logo

సాగులో సాంకేతికత.. మహిళలకు సాధికారత

వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్‌ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్‌ నిర్వహణ,

Published : 29 Mar 2024 05:21 IST

డ్రోన్‌ శిక్షణ పొందుతున్న మహిళలు

ఆదిలాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే : వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్‌ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్‌ నిర్వహణ, వినియోగం తదితర వాటిపై శిక్షణ ఇచ్చారు. కోరమాండల్‌, ఇఫ్కో కంపెనీల ఆధ్వర్యంలో మహిళలను ఎంపిక చేసి ఇటీవల శిక్షణ ఇప్పించడంతోపాటు వీరికి డ్రోన్‌లను సైతం అందించారు. ఇంకా కొన్ని పరికరాలను ఇవ్వాల్సి ఉంది. శిక్షణ పొందిన యువతులు వానాకాలం సీజన్‌ నుంచి డ్రోన్‌ పైలట్లుగా మారనున్నారు.  

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 15 వేల మంది మహిళలను డ్రోన్‌ పైలట్లుగా మార్చి డ్రోన్లు అందించాలని డ్రోన్‌ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలివిడతలో ఉమ్మడి జిల్లా మొత్తంలో 10 మంది యువతీ, యువకులు శిక్షణ పొందారు. వీటిని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ పథకం వల్ల సత్ఫలితాలు వస్తే మరి కొంత మందికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉంది. సంఘాల్లోని కొంత మంది చదువుకున్న యువతులకు శిక్షణ ఇచ్చి, వారే స్వయంగా నిర్వహించుకునేందుకు వీలుగా రూ.10 లక్షల విలువ గల డ్రోన్లను మంజూరు చేశారు.

ఖర్చు తక్కువ.. సమయం ఆదా..

వ్యవసాయరంగంలో డ్రోన్లతో పొలాలకు ఎరువులు, పురుగు మందులు చల్లటం తేలిక. పైగా ఖర్చు తగ్గుతుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు డ్రోన్లను రైతులు వినియోగించుకునేలా పురుగుమందులు తయారు చేస్తున్నాయి. డ్రోన్లు గరిష్ఠంగా 10 లీటర్ల మందును మోసుకెళ్లగలవు. సాధారణంగా రైతులు ఎకరా పొలంలో మందు పిచికారీ చేయాలంటే అయిదారు గంటలు పడుతుంది. అదే డ్రోన్‌ అయితే పది నిమిషాల్లో పూర్తి చేస్తుంది. రాత్రి ఛార్జి చేసి పెట్టుకుంటే రోజంతా డ్రోన్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఒక రోజు గరిష్ఠంగా 30 ఎకరాల్లో రసాయన మందులు పిచికారీ చేసే వీలుంది.


అవకాశం వచ్చింది.. వినియోగించుకుంటాం
శ్రీదేవి, రజిత, కుమురంభీం జిల్లా

మాది మారుమూల లంబాడిహెట్టి గ్రామం. చింతలమానేపల్లి మండలం. డ్రోన్‌లతో రసాయన మందులు పిచికారీ చేయడంపై పది రోజులు శిక్షణ తీసుకున్నాం. తర్వాత మళ్లీ మూడు రోజులు శిక్షణ ఇచ్చారు. స్వయంగా డ్రోన్‌ను నిర్వహించగలమనే నమ్మకంతో ఉన్నాం. డ్రోన్‌తోపాటు వాటికి సంబంధించిన పరికరాలు, బ్యాటరీ తదితర నిర్వహణకు శిక్షణ కోరమాండల్‌ కంపెనీ వాళ్లు ఇచ్చారు. ఇంకా కొన్ని పరికరాలు ఇస్తామని చెప్పారు. స్వయంగా ఆదాయం సంపాదించడంతోపాటు రైతులకు మేలు జరిగే అవకాశం ఉండటంతో డ్రోన్లను సమర్థవంతంగా నిర్వహిస్తాం.


ఆర్థికాభివృద్ధి చెందేలా..
సాయిరమ్య, మంచిర్యాల జిల్లా

నాది టేకుమట్ల గ్రామం జైపూర్‌ మండలం. నేను పీజీ పూర్తి చేశాను. మహిళా సంఘంలో ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా పలు కార్యక్రమాలను చేపడుతున్నాం. స్వయం ఉపాధి పొందేందుకు డ్రోన్లపై శిక్షణ ఇవ్వడమే కాకుండా వాటిని ఉచితంగా అందించడంతో ఉపాధి పొందే అవకాశం కలిగింది. రైతులకు తక్కువ ఖర్చుతో పని పూర్తి చేసే డ్రోన్లకు రాబోయే రోజుల్లో మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయరంగంలో సాంకేతికతను ప్రోత్సహించడంతోపాటు మహిళలకు డ్రోన్ల నిర్వహణ అప్పగించడంతో ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం దక్కింది.


రైతులకు మేలు
హారిక, నిర్మల్‌ జిల్లా

నాది కొరిటికల్‌ గ్రామం మామడ మండలం. డ్రోన్‌ నిర్వహణపై శిక్షణ తీసుకున్నాను. వ్యవసాయరంగంలో పంటలపై పురుగుమందుల పిచికారీ అనేది పెద్ద సమస్య. పంట చేతికి వచ్చే వరకు అయిదారుసార్లు మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. డ్రోన్‌ ద్వారా తక్కువ సమయంలో పిచికారీ చేయవచ్చు. నేను డ్రోన్‌ శిక్షణ తీసుకున్నా. అవసరమైన రైతులు తమ పంటకు అవసరమైన రసాయన మందులు తెచ్చుకుంటే పంటలపై పిచికారీ చేసి ఇస్తాం. మరిన్ని డ్రోన్లు అందుబాటులోకి వస్తే రైతులకు మేలు జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని