logo

ఏటా కొలువులన్నారు.. ఏమార్చారు

రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు.

Published : 24 Apr 2024 05:27 IST

గాలిలో కలిసిన 2.5 లక్షల ఉద్యోగాల భర్తీ
సీఎం జగన్‌ హామీపై నిరుద్యోగుల ఆగ్రహం
న్యూస్‌టుడే, కూచిపూడి, కానూరు

రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి అయిదేళ్లు కావస్తున్నా ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేశారు. దీంతో మా ఉద్యోగం ఎక్కడ జగనన్నా అంటూ నిరుద్యోగులు ప్రశ్నించారు. ఏటా కొలువులు భర్తీ లేక వయో పరిమితి దాటిపోతోందని, ఎంత చదువుకున్నా ప్రయోజనం లేకపోతోందని వాపోతున్నారు. ఈ అయిదేళ్లలో ఏపీపీఎస్సీ(ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌), గ్రూపు-4, పోలీసు శాఖలో ఉద్యోగాలు అసలు భర్తీయే చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం పోలీస్‌శాఖలో ఆరు వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన జగన్‌ ఒక్క కానిస్టేబుల్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఇదిలా ఉండగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరుద్యోగులను మోసగించేందుకు మెగా డీఎస్సీ అంటూ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో ఉన్న ఉద్యోగుల ఆరోగ్యంపై ఆ ప్రభావం పడుతోంది. 70శాతం ఆరోగ్య సమస్యలు ఒత్తిడి వల్లనే వస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి వారిపై పనిభారం తగ్గించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయింది. ఈ హామీ అమలపై జిల్లాలో నిరుద్యోగ యువత ఏమంటున్నారో వారి మాటల్లో..

చదువున్నా అవకాశాల్లేవు

- ఓ నిరుద్యోగి (కోసూరు)

చదువుకున్నవారికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. బెంగళూరు, హైదరాబాదు వంటి ప్రాంతాలకు వెళ్లాలి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు. దాని ఊసే లేదు. వాలంటీర్‌ వ్యవస్థ అంటూ ఉద్యోగాలిచ్చి ఇంటింటికీ తిప్పుతున్నారు. నూతనంగా కంపెనీలు రావడం లేదు. ఇక ముందు కూడా మా పిల్లలకు ఇదే పరిస్థితి వస్తోంది. రాను రాను రాష్ట్రం మరో బిహార్‌ అయ్యేలా ఉంది.


అమలు కాని వారాంతపు సెలవు

- ఓ ఉద్యోగి

సాధారణంగా ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులు, సిబ్బందికి ఆదివారం సెలవు ఉంటోంది. ఇతర పండగల సమయంలో కూడా సెలవులుంటాయి. మా శాఖలో అటువంటి పరిస్థితులు లేవు. వారాంతపు సెలవు ఇస్తానని ముఖ్యమంత్రి జగన్‌ దాన్ని జీవోలకే పరిమితం చేశారు. హక్కులపై గొంతెత్తే స్వేచ్ఛ కూడా మాకు లేదు. సిబ్బంది కొరత వల్లే సెలవు ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. సిబ్బంది నియామకాలు చేపట్టి వారంతపు సెలవులు అమలు చేస్తే బాగుంటుంది.


తెదేపా హయాంలోనే నయం

- పి.శాంతి, ఒప్పంద ఉద్యోగి, పోరంకి

గతంలో తెదేపా హయాంలో ఏటా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ అయ్యేవి.  నాటి ప్రభుత్వం మెరిట్‌ ప్రకారం ఎంపికలు నిర్వహించి అవసరమైన మేరకు కొలువులు భర్తీ చేసింది. వైకాపా వచ్చిన నుంచి ఆ ఊసే లేకుండాపోయింది. ఏపీపీఎస్సీ అసలు నోటిఫికేషనే ఇవ్వలేదు. గ్రూపు-4 ఉద్యోగాలకు పరీక్ష కూడా నిర్వహించలేదు. ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు లేక యువకులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు.  


పోలీసు శాఖలో ఉద్యోగాల ఊసేలేదు

- అప్పారావు, నిరుద్యోగ యువకుడు, ఉయ్యూరు

వైకాపా అయిదేళ్లలో పోలీసు శాఖలో కొలువుల భర్తీని పూర్తిగా అటకెక్కించారు. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మెగా డీఎస్సీ అంటూ దగా చేశారు. చివరలో తూతూమంత్రంగా నోటిఫికేషన్‌ ఇచ్చినా దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. ఇంతకీ ఆ పరీక్ష కూడా జరగలేదు. ఇంతచదువుకుని అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగాలు రాకపోతే మేము ఏం చేయాలో అర్థం కావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని