logo

తెలుగుదేశంలో నయా జోష్‌.. అధికార పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు

ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో సరికొత్త జోష్‌ కనిపిస్తోంది. వైకాపా నుంచి పలువురు కీలక నేతలు తెదేపాలో చేరి కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తున్నారు.

Updated : 16 Apr 2024 07:04 IST

తెదేపాలో చేరిన కుటుంబాలతో నారా లోకేశ్‌ (పాతచిత్రం)

ఈనాడు, అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో సరికొత్త జోష్‌ కనిపిస్తోంది. వైకాపా నుంచి పలువురు కీలక నేతలు తెదేపాలో చేరి కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తున్నారు. వారిలో జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి,  మాజీ ఎమ్మెల్యేలు ఉండడం విశేషం.

నేతల చేరికలతో సందడి

వైకాపా ప్రభుత్వ విధానాలు, జగన్‌ ఒంటెద్దు పోకడలు రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడం, అరాచకాలు పెరిగిపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు తెదేపా వైపు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పలువురు కీలక నేతలు తెదేపాలో చేరారు. వారు పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నరసరావుపేట సిటింగ్‌ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరడంతోపాటు అదే స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా, ఆమె భర్త సురేష్‌కుమార్‌ ఇటీవల కొల్లూరు ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. సీఎం జగన్‌ గుంటూరు జిల్లాలో బస్సుయాత్ర చేస్తున్న సమయంలోనే వారు వైకాపాను వీడడం ఆ పార్టీకి పెద్ద షాక్‌. ఎమ్మెల్సీ జంగా, క్రిస్టినాకు ఇంకా రెండేళ్లకుపైగా పదవీకాలం ఉంది. అయినా వారు ఇమడలేక బయటకు రావడం చర్చనీయాంశమైంది.

రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపా బాట

కొత్తగా చేరిన నేతలు నరసరావుపేట తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలుతోపాటు వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు విజయానికి కృషి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటరమణ కూడా తెదేపాలో చేరారు. ప్రత్తిపాడు ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో ఆయన అనుచరులతో కలిసి చేరారు. రాష్ట్ర ప్రగతి, భావితరాల భవిష్యత్తు కోసం వైకాపాలో ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలని కోరారు. రావి వెంకటరమణ 2004లో ప్రత్తిపాడు నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. 2009లో ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వుడు కావడంతో పోటీ చేయలేకపోయారు. 2014లో పొన్నూరు నుంచి వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చివరి నిమిషంలో వైకాపా టికెట్‌ రావికి కాకుండా రోశయ్యకు ప్రకటించారు. రోశయ్య గెలుపు కోసం పనిచేసినా తర్వాత వైకాపాలో గుర్తింపు దక్కలేదు. రోశయ్య ఫిర్యాదుతో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. ఓట్లు చీలితే వైకాపాకు లబ్ధి కలుగుతుందని భావించి తెదేపాలో చేరారు. గుంటూరు మాజీ డిప్యూటీ మేయరు తాడిశెట్టి మురళీమోహన్‌ తెదేపా తీర్థం పుచ్చుకుని కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని