logo

మట్టి గణపతులకు గట్టి గిరాకీ

గతంలో ఇళ్లలో, కొన్ని కాలనీలకు మాత్రమే పరిమితమైన పర్యావరణహిత మట్టి గణపతి విగ్రహాలు క్రమంగా పెరుగుతూ గేటెడ్‌ కమ్యూనిటీలు, బస్తీలు, గల్లీల్లోని మండపాల్లో పూజలందుకంటున్నాయి.

Published : 30 Jun 2022 02:28 IST

ఇప్పటికే వేల సంఖ్యలో ఆర్డర్లు

ఈనాడు, హైదరాబాద్‌: గతంలో ఇళ్లలో, కొన్ని కాలనీలకు మాత్రమే పరిమితమైన పర్యావరణహిత మట్టి గణపతి విగ్రహాలు క్రమంగా పెరుగుతూ గేటెడ్‌ కమ్యూనిటీలు, బస్తీలు, గల్లీల్లోని మండపాల్లో పూజలందుకంటున్నాయి. ఈసారి వీటి సంఖ్య మరింతగా పెరగనుంది. మట్టి ప్రతిమలకు ఆర్డర్లు పెరుగుతున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్‌ నుంచే పనులు మొదలుపెట్టగా వేల సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని, ఈసారి 25 శాతం ఆర్డర్లు పెరిగినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు మట్టిగణనాథుల ప్రతిమల వినియోగంపై అవగాహన, పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నాయి.

దృఢత్వ పరిశీలన తర్వాతే..

మట్టి విగ్రహాలు తయారవ్వడానికి పది నెలల శ్రమ పడాల్సి ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. ముందుగా చుట్టుపక్కల చెరువుల నుంచి నాలుగైదు రకాల మట్టిని తీసుకొచ్చి నాలుగైదు విగ్రహాలు తయారు చేసిన అనంతరం వాటిని గుంతలున్న రోడ్లపై తిప్పి దృఢత్వాన్ని పరీక్షిస్తున్నారు. అనంతరం ఓ అంచనాకు వచ్చిన తర్వాత ఆయా మోతాదుల్లో పెద్దఎత్తులో విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటితోపాటు తాండూరు, కర్ణాటక, కోల్‌కతా గంగమట్టిని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. తయారీలో జనపనార, పేపర్‌ డస్ట్‌ను;కలిపి విగ్రహాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.


ప్రతిసారీ 2 లక్షల విగ్రహాల పంపిణీ

ఎం.విజయ్‌భాస్కర్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌, కూకట్‌పల్లి

ఏటా చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 2 లక్షల విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం. విజయవాడ కొండపల్లిలో తయారీదారులకు జీవనోపాధి పెరిగేలా ఆర్డర్లు ఇస్తున్నాం. తయారీదారులకు, కొనుగోలుదారులకు అనుసంధాన కర్తగా మాత్రమే ఉండి లాభాపేక్ష లేకుండా స్కూళ్లు, కార్పొరేటు కార్యాలయాలు, కాలనీలు, హౌజింగ్‌ సొసైటీల్లో అవగాహన కార్యక్రమాలతోపాటు తయారీదారులు ఇచ్చిన ధరకే పంపిణీ చేపడుతున్నాం.


25 శాతం ఆర్డర్లు పెరిగాయి

విజయ్‌, జైగణేశ్‌ ఆర్ట్స్‌ ప్రతినిధి

2021లో 2000 ప్రతిమలకు ఆర్డర్లు వస్తే ఇప్పటి వరకు 2500 ప్రతిమలు బుకింగ్‌ చేసుకున్నారు. అంతకంటే ఎక్కువగానే ఆర్డర్లు వస్తున్నా మా పరిమితుల ఆధారంగా ఎక్కువ బుకింగ్‌లను తీసుకోవడం లేదు. బౌరంపేట, మేడ్చల్‌లో ప్రతిమలను తయారు చేస్తున్నాం. 8 అంగుళాల నుంచి 8 అడుగుల వరకు ప్రతిమలు తయారు చేస్తుంటాం. మా వద్ద పశ్చిమబెంగాల్‌కు చెందిన 35 మంది కళాకారులు పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని