logo

స్వేచ్ఛ భారతానికి వారధులు వీరే..!

స్వరాజ్యం సిద్ధించిన క్షణాల్ని కళ్లారా చూసిన వారు.. దేశ పురోభివృద్ధిని సాంతం గమనించిన వారు.. భారత స్వాత్రంత్య వజ్రోత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో తమ అనుభవాలను ‘ఈనాడు’తో పంచుకున్నారు.  దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో

Updated : 12 Aug 2022 06:54 IST

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, మియాపూర్‌  

స్వరాజ్యం సిద్ధించిన క్షణాల్ని కళ్లారా చూసిన వారు.. దేశ పురోభివృద్ధిని సాంతం గమనించిన వారు.. భారత స్వాత్రంత్య వజ్రోత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో తమ అనుభవాలను ‘ఈనాడు’తో పంచుకున్నారు.  దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో తమకు ఎదురైన అనుభవాలను వివరించారు. కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌లో ఉంటున్న తొమ్మిది పదుల వృద్ధుల మనోభావాలు ఇలా ఉన్నాయి.


జెండా ఎగరవేస్తే ఊరుకునేవారు కాదు

యెడమ రాంరెడ్డి, 94 సంవత్సరాలు

మాది ఒకప్పటి నల్గొండ జిల్లా జనగామ తాలూకాలోని నీర్మాల గ్రామం. నాలుగో తరగతి వరకు చదివి ఆపేశా. ఆంధ్ర సారస్వత పరిషత్తు తరఫున పరీక్ష రాసి పాసయ్యా. స్వాతంత్య్రం వచ్చే నాటికి నాకు 18-19 ఏళ్లు ఉంటాయి. 1947లో స్వాతంత్య్రం ప్రకటించినప్పుడు  ఊళ్లలో జెండాలు ఎగరవేస్తే రజాకార్లు ఊరుకునేవారు కాదు. అప్పట్లో రాత్రిళ్లు సంఘపోళ్లు(కమ్యూనిస్టులు) వచ్చి రజాకార్లకు వ్యతిరేకంగా చైతన్యపరిచేవారు. మా ప్రాంతంలో స్వాతంత్య్ర సమరం కంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఎక్కువగా పాల్గొన్నాం. ధూళిపాళ్ల సత్యనారాయణ దళంలో పనిచేశా. మా ఉప నాయకుడు గడ్డం పాపిరెడ్డిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. ప్రస్తుత సమాజంలో అందరికీ స్వాతంత్య్రం ఉంది. కానీ అన్యాయం పెరిగింది.


ఊరంతా భారీ ర్యాలీ చేశాం
- ఎలినేని సత్యనారాయణ, 92 సంవత్సరాలు

మాది విజయవాడ సమీపంలోని గన్నవరం. ఇక్కడికి రాకమునుపు తిరువూరులో ఉండేవాళ్లం. స్వాతంత్య్రం వచ్చినప్పుడు అక్కడే నాలుగో ఫారం చదువుతున్నానని గుర్తు. దేశానికి స్వరాజ్యం ప్రకటించారని చెప్పి పాఠశాలకు సెలవు ఇచ్చారు. నేను మా సొంతూరు కోడూరు వెళ్లా. పెద్దలందరూ భారీ జెండా కుట్టించి ఊరంతా ఊరేగింపు చేశారు. ప్రతి ఇంటి ముందు నీళ్లు పోసి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఊరి మధ్యలో జెండానే ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒకసారి గాంధీజీ విజయవాడ వస్తున్నారని తెలిసింది. ఊరి నుంచి పెద్దసంఖ్యలో విజయవాడ రైల్వే స్టేషన్‌కు వెళ్లాం. అక్కడ ఆయన కాసేపు బయటకు వచ్చి అభివాదం చేసి వెళ్లిపోయారు. గాంధీజీని చూడటం అదే మొదటిసారి. 1955లో ఆంధ్ర హ్యాండ్లూమ్‌ సహకార సొసైటీలో ఉద్యోగం చేసేప్పుడు వర్కర్‌ టీచర్‌ ట్రైనింగ్‌లో భాగంగా కోల్‌కతా తీసుకెళ్లారు. అక్కడ గాంధీజీ, బ్రిటీషర్లకు మధ్య నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలు ప్రత్యక్షంగా చూశాను. వాటిని కోలకతా మ్యూజియంలో పదిలపరిచారు. ఈ 75ఏళ్లలో ఎన్నో మార్పులు చూశాను. ప్రస్తుత తరం సందేశాలు వినే పరిస్థితి లేదు. జాగ్రత్తగా ఉంటూ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళితే చాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని