logo

కాలుష్యం కాటు... మనుగడకే చేటు

కాసుల కోసం పరిశ్రమలు కానిచ్చేస్తున్న కార్యకలాపాలు ప్రజలపాలిట శాపంలా మారుతున్నాయి. జిప్సం పరిశ్రమల వ్యర్థాలతో నింగి, నేలా, నీరు కలుషితమవుతున్నాయి. వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది ప్రజలు అనారోగ్యం

Updated : 15 Aug 2022 04:34 IST

పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న పరిశ్రమలు

ప్రజల గోడు పట్టని అధికారులు  

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ, పెద్దేముల్‌

అధికారులకు విన్నవించేందుకు వెళ్తున్న రైతులు

కాసుల కోసం పరిశ్రమలు కానిచ్చేస్తున్న కార్యకలాపాలు ప్రజలపాలిట శాపంలా మారుతున్నాయి. జిప్సం పరిశ్రమల వ్యర్థాలతో నింగి, నేలా, నీరు కలుషితమవుతున్నాయి. వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా అధికారులు పరిశీలించి వెళ్లడమే తప్ప చర్యలు చేపట్టకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తాండూరు ప్రాంతంలో కొనసాగుతున్న కాలుష్య పరిశ్రమలపై ‘న్యూస్‌టుడే’ కథనం.  

సుద్ద, యాసిడ్‌ మిశ్రమాలతో వ్యర్థాలు ఇలా..

గుంతలు తవ్వి నిల్వచేస్తున్నారు
జిన్‌గుర్తి, మిట్టబాస్పల్లి, అంతారం శివార్లలో జిప్సం పరిశ్రమలను నెలకొల్పారు. నియోజకవర్గంలో తాండూరు, యాలాల మండలాలతోపాటు పట్టణ పరిధిలో కొనసాగుతున్న నాపరాయి పరిశ్రమల్లో వెలువడే వ్యర్థ పదార్థం సుద్ద, యాసిడ్‌ను పరిశ్రమలకు తరలించి జిప్సం తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. జిప్సం పరిశ్రమల్లో సుద్ద, యాసిడ్‌ మిశ్రమాలను ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా నేలపై గుంతలు తవ్వి నిల్వ చేస్తున్నారు. నేలలోకి వ్యర్థాలు ఇంకిపోకుండా ఉండేలా హౌసులు నిర్మించి నిల్వ చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు.  

దుర్వాసనతో విద్యార్థులకు అనారోగ్యం
మిట్టబాస్పల్లి పరిధిలోని పరిశ్రమ ద్వారా చుట్టూ 6 కిలోమీటర్ల దాకా భరించలేని చెడు వాసన వస్తుండటంతో పక్కనున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోని 400లకుపైగా విద్యార్థినిలు, ఆదర్శ పాఠశాల, కళాశాలలోని 600లకుపైగా విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. చర్మ వ్యాధులు, పంటి నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు.  

అంతారం శివారులోని పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలతో చెరువులోని చేపలు మృతి చెందడంతోపాటు అటవి భూముల్లో నిర్మించిన ఉద్యానంలో మొక్కలు దెబ్బతిన్నాయి.  

విస్తుపోయారు.. పత్తాలేరు..
జిన్‌గుర్తి వద్ద ఏర్పాటైన పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలతో పంటలు, భూగర్భ జలాలు కలుషితమై ఆరోగ్యం, పంటలపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ జిన్‌గుర్తి గ్రామస్థులు హైదరాబాద్‌లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. గతనెల 12న విచారణకు వచ్చిన అధికారులు పరిశ్రమలను పరిశీలించి విస్తుపోయారు. మూసి వేయిస్తామంటూ హామీ ఇచ్చారు. నెల దాటినా అధికారులు చేపట్టిన చర్యలు శూన్యం. అంతారం శివారులోని జిప్సం పరిశ్రమ మూసివేయాలంటూ అంతారం, కందనెల్లితండాల రైతులు పలుమార్లు జహీరాబాద్‌, సంగారెడ్డి రహదారులపై బైఠాయించి ధర్నాలు చేశారు. మిట్టబాస్పల్లి పరిధిలో జిప్సం పరిశ్రమను మూసివేయాలని సర్పంచి నరేందర్‌రెడ్డి అధ్వర్యంలో రైతులు తాండూరు తహసీల్దారు కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేసి ఫిర్యాదు చేసినా లాభం కనిపించలేదు.  


పదికిపైగా బోర్లలో ఎర్రరంగు నీరు: లాల్‌అహ్మద్‌, మిట్టబాస్పల్లి  
పది ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. పక్కనున్న పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలు వదలడంతో పంట దిగుబడులు దెబ్బతింటున్నాయి. నా బోరుతోపాటు చుట్టుపక్కల పొలాల్లోని పదికిపైగా బోర్లలో ఎర్రరంగులో నీరు వస్తోంది.


త్వరలో చర్యలు చేపడతాం: వెంకన్న, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి  
జిప్సం పరిశ్రమల నుంచి సేకరించిన నమూనాల ప్రయోగ ఫలితాల నివేదిక వచ్చింది. 16వ తేదీ తర్వాత సమావేశం ఏర్పాటు చేసి ఆయా పరిశ్రమలపై చర్యలకు నిర్ణయం తీసుకుంటారు. కాలుష్యం వెదజల్లే, నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని