logo

నిధుల్లేవంటూ..నిత్యం నరకం చూపిస్తూ!

చింతలేని రహదారుల వ్యవస్థ లక్ష్యంగా ప్రారంభించిన ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం) కష్టాల్లో పడింది. ప్రధాన నగరంలోని కీలక రహదారులపై చేపట్టిన పైవంతెనల పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్లపై పడుతున్న గుంతలను

Updated : 20 Aug 2022 04:51 IST

పైవంతెనల నిర్మాణంలో గుత్తేదారుల నిర్లక్ష్యం

బిల్లులు ఆలస్యమంటూ నత్తనడకన ‘ఎస్సార్డీపీ’ పనులు

అస్తవ్యస్తంగా మారిన రోడ్లు

ఈనాడు, హైదరాబాద్‌

చింతలేని రహదారుల వ్యవస్థ లక్ష్యంగా ప్రారంభించిన ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం) కష్టాల్లో పడింది. ప్రధాన నగరంలోని కీలక రహదారులపై చేపట్టిన పైవంతెనల పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్లపై పడుతున్న గుంతలను అలాగే వదిలేస్తూ, బారికేడ్లు ఏర్పాటు చేయకుండా పనులు చేస్తున్నారు. గడువు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. గుత్తేదారులు, ఇంజినీర్ల నిర్లక్ష్యంతో ఆయా రోడ్లపై పౌరులు నిత్యం నరకం చూస్తున్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని గుత్తేదారులు, చిన్న చిన్న కారణాలకే కాంట్రాక్టర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఇంజినీర్లు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని, లేకుంటే మరో రెండేళ్లు రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్‌ చౌరస్తా, నాగోల్‌, సాగర్‌ రింగు రోడ్డు-ఎయిర్‌పోర్టు మార్గం, ఆర్టీసీ క్రాసురోడ్డు, చంచల్‌గూడ జైలు రోడ్డు, ఆరాంఘర్‌ రహదారి, కొండాపూర్‌ రోడ్డు, గచ్చిబౌలి చౌరస్తా, ఇతరత్రా రోడ్డు మార్గాల్లో జనాలు అవస్థలు పడాల్సిందేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్టీసీ క్రాసు రోడ్డు ఆందోళనకరంగా..

ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలో పడిన గోతుల్లో నిలిచిన నీరు

వీఎస్టీ కూడలి నుంచి ఇందిరా పార్కు వరకు నాలుగు లైన్ల ఉక్కు వంతెన పనులు రెండున్నరేళ్ల కిందట మొదలయ్యాయి. ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉండగా ఇంకా 50శాతం దాటలేదు. పిల్లర్ల నిర్మాణమూ అంతంతే. మూడు నెలల కిందట వీఎస్టీ కూడలి వద్ద ర్యాంపు కోసం తవ్విన గుంతలు అలాగే ఉన్నాయి. రోజువారీ పురోగతి 0.5శాతం కూడా ఉండట్లేదని ఇంజినీర్లు చెబుతున్నారు. బిల్లులు ఆలస్యమంటూ గుత్తేదారు నత్తనడకన పనులు చేస్తున్నారు. దీంతో విద్యానగర్‌ నుంచి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ రోడ్డులో ప్రయాణించేవారు నిత్యం నరకం చూస్తున్నారు. ఇక్కడి హోటళ్లు, థియేటర్లకు వచ్చేవారు రోడ్లపై వాహనాలు నిలుపుతుండటంతో రాకపోకలు మరింత క్లిష్టంగా మారాయి.

పైవంతెన పొడవు.. 2.8 కి.మీ.

ప్రాజెక్టు వ్యయం.. రూ.356 కోట్లు

నల్గొండ క్రాసు రోడ్డు నుంచి యాతనే

సంతోష్‌నగర్‌లో ఇరుకుగా మారిన రహదారి

రెండున్నరేళ్ల కిందట నల్గొండ ఎక్స్‌రోడ్డు పైవంతెన నుంచి ఒవైసీ ఆస్పత్రి కూడలి వరకు ఉక్కు వంతెన నిర్మాణం మొదలైంది. రెండేళ్లలో పూర్తవ్వాలనేది నిబంధన. బిల్లులు ఆలస్యంగా చెల్లిస్తున్నారంటూ గుత్తేదారు నెమ్మదిగా పనులు చేస్తున్నారు. ఇంకా సగం పూర్తికాలేదు. రోడ్డంతా తవ్వేసి వదిలేశారు. మూడు కి.మీ. పొడవునా మట్టి కుప్పలు, గుంతలే కనిపిస్తున్నాయి. భూసేకరణలో భాగంగా నిర్మాణాలను పూర్తిగా తొలగించలేదు. సర్వీసు రోడ్డు ఆక్రమణల్లోనే ఉంది. ప్రయాణికుల వాహనాలు కిలోమీటరు ప్రయాణించేందుకు 20 నిమిషాలు పడుతోంది.

పైవంతెన పొడవు.. 3.38 కి.మీ.

ప్రాజెక్టు వ్యయం.. రూ.523.37 కోట్లు

ఆరాంఘర్‌ చౌరస్తా వరకు విధ్వంసం

జూ నుంచి ఆరాంఘర్‌ మధ్య లేస్తున్న దుమ్ము

రెండేళ్ల కిందట జూ నుంచి ఆరాంఘర్‌ చౌరస్తా వరకు పైవంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగరంలోని పొడవైన పైవంతెనల్లో ఇది రెండోది. 2023లో పనులు పూర్తవ్వాలనేది నిబంధన. నత్తనడకన సాగుతుండటంతో రెండేళ్లు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పనులు జరుగుతోన్న ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. పిల్లర్ల గుంతల వద్ద బారికేడ్లు ఉండట్లేదు. సూచిక బోర్డులు లేవు. సర్వీసు రోడ్డు పునరుద్ధరించలేదు.

పైవంతెన పొడవు.. 4 కి.మీ.

ప్రాజెక్టు వ్యయం.. రూ.636.80 కోట్లు

అన్ని ప్రాంతాల్లో అదే తీరు

ఎల్బీనగర్‌ నాగోల్‌ మధ్య స్తంభించిన ట్రాఫిక్‌

కొండాపూర్‌లోని కొత్తగూడ కూడలి, గచ్చిబౌలి పైవంతెన కూడలి, నాగోల్‌ రోడ్డు, శిల్పా లేఅవుట్‌, పాతబస్తీ రోడ్డు మార్గం, ఇతరత్రా ప్రాంతాల్లోనూ పైవంతెనల నిర్మాణ పనులు చాలా రోజులుగా కొనసాగుతున్నాయి. ఉప్పల్‌ కూడలిలో శంకుస్థాపన జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా ఇటుక వేయలేదు. బల్దియా ఖజానాలో నిధుల్లేకపోవడమే కారణమనే విమర్శలున్నాయి. ఇంజినీరింగ్‌ విభాగం మాత్రం గుత్తేదారులదే నిర్లక్ష్యమంటోంది. ప్రాజెక్టు వ్యయం పూర్తిగా భరించే సామర్థ్యం తమకుందని అంగీకరిస్తూ గుత్తేదారులు టెండరులో పాల్గొంటారు. అందుకు భిన్నంగా, ఒకటిరెండు నెలలు బిల్లులు నిలిచాయిని మొత్తంగా పనులు ఆపేస్తున్నారని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు