logo

పైసా ఖర్చు లేకుండా... ప్రాణదానం

శరీరంలో ఏదో ఒక అవయవం చెడిపోయి మృత్యువుకు దగ్గరైన రోగులకు అవయవమార్పిడి ద్వారా ప్రాణదానం చేసేందుకు నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు నడుంబిగించాయి.

Published : 16 Dec 2022 04:37 IST

గాంధీ, ఉస్మానియా వైద్యుల పర్యవేక్షణలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు
గాంధీలో సిద్ధమవుతున్న మాడ్యులర్‌ థియేటర్లు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: శరీరంలో ఏదో ఒక అవయవం చెడిపోయి మృత్యువుకు దగ్గరైన రోగులకు అవయవమార్పిడి ద్వారా ప్రాణదానం చేసేందుకు నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు నడుంబిగించాయి. జీవన్‌దాన్‌ ట్రస్ట్‌ ద్వారా అవయవాలను సేకరించి సంబంధిత రోగులకు అమర్చేందుకు ఈ రెండు ఆస్పత్రుల్లోని నిపుణులైన వైద్యులు ఆపరేషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికోసం గాంధీలో అత్యాధునికమైన ఆపరేషన్‌ థియేటర్లను నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు.  

మంత్రి చొరవతో...

జీవన్‌దాన్‌ ట్రస్టు ద్వారా జీవన్మృతుల నుంచి అవయవాల సేకరణ ద్వారా ఏటా 700 మందికిపైగా రోగులకు వైద్యులు ప్రాణదానం చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు అవయవమార్పిడి పేరుతో రోగుల కుటుంబీకుల దగ్గర ఆపరేషన్‌ కోసం రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. కొన్నింటికి దాదాపు రూ.25 లక్షలపైనే ఖర్చవుతోందని రోగులు చెబుతున్నారు. పేద రోగులకు చికిత్సలు అందించడంలో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు కీలక భూమికను పోషిస్తున్నాయి. అనేక క్లిష్ట శస్త్రచికిత్సలను ఇక్కడి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే వీటిలో అవయవ మార్పిడి ఆపరేషన్లు ఒకట్రెండు మాత్రమే జరిగాయి. పూర్తిస్థాయి సౌకర్యాలతో ఉన్న ఆపరేషన్‌ థియేటర్లు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ విషయం ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి వచ్చింది. దీంతో ఆయన సమీక్షించి తక్షణం ఈ ఆపరేషన్ల కోసం థియేటర్లు నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి రూ.35 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ప్రధాన బ్లాక్‌లోని ఎనిమిదో అంతస్తు మొత్తాన్ని అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు వినియోగించాలని నిర్ణయించారు. దీనికోసం ఇక్కడ ఎనిమిది మాడ్యులర్‌ థియేటర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. నాలుగైదు నెలల్లో వీటి నిర్మాణం పూర్తికానుంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాల అవయవ మార్పిడి ఆపరేషన్లు ఇక్కడ జరిగే అవకాశం ఉంది.  


ఆరునెలల్లో మొదలుపెడతాం
- డాక్టర్‌ రాజారావు, గాంధీ సూపరింటెండెంట్‌

ఎనిమిది మాడ్యులర్‌ థియేటర్లలో అవయవ మార్పిడి ఆపరేషన్లను ఆరు నెలల్లోగా  మొదలుపెడతాం. కొన్ని రకాల శస్త్రచికిత్సలు చేయడానికి ఉస్మానియా ఆస్పత్రి కూడా ముందుకొచ్చింది. ఈ రెండు ఆస్పత్రుల వైద్యుల తోడ్పాటుతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించాం. దీనికోసం ఇప్పటి నుంచే సంబంధిత వైద్యులను సన్నద్ధం చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని