logo

ప్రాధాన్యం విడువక..సంక్షేమం మరువక

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సోమవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేదిగా ఉంది.

Published : 07 Feb 2023 04:06 IST

బడ్జెట్‌ కేటాయింపులతో జిల్లాకు ప్రయోజనం
- న్యూస్‌టుడే, తాండూరు

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సోమవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేదిగా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్తు, నీటి పారుదల, అడవుల అభివృద్ధితో పాటు పట్టణ, పల్లె ప్రగతి వంటి తదితర రంగాలకు నిధుల కేటాయింపు జరిగింది. బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం నుంచి జిల్లాకు ఆయా పద్దుల కింద నిధులు మంజూరు కానున్నాయి. వీటి ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

సొంత స్థలం ఉన్నా.. ఇళ్లు లేని పేదలకు..

జిల్లాలో సొంతంగా స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ.3లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.  జిల్లా వ్యాప్తంగా ఈ లెక్కన 8000 మందికి లబ్ధి చేకూరుతుంది. అలాగే జిల్లాలో మంజూరైన 4,323 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేందుకు దోహద పడుతుంది.

మాఫీ కానున్న రూ.422.85 కోట్ల వ్యవసాయ రుణాలు

తాజా బడ్జెట్‌ కేటాయింపుతో జిల్లాకు చెందిన 59,073 మంది రైతులు రుణమాఫీలో లబ్ధి పొందనున్నారు. వీరికి రూ.75 వేల నుంచి రూ.లక్ష లోపు కలిపి మొత్తం రూ.422.85 కోట్లు రుణాలు మాఫీ కావాల్సి ఉంది.

సాగు నీటి రంగంపై చిన్న చూపు

జిల్లాలో అతి పెద్దదైన కోట్‌పల్లి జలాశయం మరమ్మతుకు ఈ బడ్జెట్‌లో కూడా ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరగలేదు.

* ప్రాజెక్టు కింద ఆయకట్టు భూములు.. 9,200 ఎకరాలు.

* ప్రస్తుతం నీరు పారేది.. కేవలం 4000 ఎకరాలు

* మరమ్మతులకు రూ.40 కోట్లు కావాలని నీటి పారుదల శాఖ ప్రతిపాదనలు ఇంతకు ముందే పంపినా నిధులు కేటాయించలేదు. ఇదే సమయంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు 60 శాతం పూర్తయ్యాని బడ్జెట్‌లో పేర్కొన్నారు.

దళిత బంధుతో 4,400 కుటుంబాలకు లబ్ధి

దళిత బంధు పథకం కింద ఒక్కో నియోజక వర్గం నుంచి 1100 మంది దళితులు లబ్ధి పొందేలా నిధుల కేటాయింపు జరిగింది. ఈ లెక్కన ప్రతి లబ్ధి దారునికి రూ.10 లక్షల చొప్పున 4,400 మంది రూ.440 కోట్ల విలువ చేసే యూనిట్లు మంజూరు చేస్తారు.

కంది బోర్డు, పర్యాటక ప్రకటన లేక నిరాశ

జిల్లాలో కంది బోర్డు ఏర్పాటుతో పాటు అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటన ఉంటుందని అందరూ ఎదురు చూశారు. తీరా ఆ ఊసేలేక పోయింది.

ఒప్పంద ఉద్యోగులకు ప్రయోజనం

జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారు ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ ఉద్యోగులుగా మారనున్నారు. జిల్లా వ్యాప్తంగా వీరి సంఖ్య 500కు పైగా ఉంది.  

బాగుపడనున్న రహదారులు

తాజా బడ్జెట్‌ కేటాయింపులతో రహదారులు, భవనాల శాఖకు చెందిన రహదారులు ఈఏడాది దశల వారీగా మరమ్మతులకు నోచుకోనున్నాయి.  

స్థానిక సంస్థలకు ఆర్థిక వెసులుబాటు

జిల్లాలోని 560 గ్రామ పంచాయతీలు, తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ పురపాలికలకు ఈ బడ్జెట్‌లో కొంత ఆర్థిక వెసులుబాటు కలిగింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కలిపి ఏటా జనాభా ప్రాతిపదికన రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు నిధులు మంజూరవుతాయి.  

విద్య, వైద్యకు గుర్తింపు

జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 సామాజిక ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రి, మూడు బస్తీ దవాఖానాలకు చికిత్స కోసం వచ్చే వారి కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లోంచి వినియోగిస్తారు. ఇక జిల్లాలోని 154 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు సమకూరుతాయి.  

మహిళా, శిశు సంక్షేమం

జిల్లాలో 968 అంగన్‌ వాడీ కేంద్రాలున్నాయి. 120 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లోని 69,974 మంది చిన్నారులకు, 8,256 మంది బాలింతలు, 7,300 గర్భిణులకు ప్రయోజనం కలుగుతుంది. 

పొదుపు సంఘాలకు చేయూత

జిల్లాలో 16,500 పొదుపు సంఘాలున్నాయి. వీటికి రూ.538 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.295 కోట్లు ఇచ్చారు. తాజా కేటాయింపులతో అన్ని మహిళా సంఘాలకు రుణాలు అందుతాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని