logo

పునర్‌వైభవానికి పునాది.. ఓయూ ఫౌండేషన్‌

తెలంగాణలో విద్యావికాసం, పరిశోధనలకు చిరునామా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్‌వైభవం దిశగా అడుగులు వేస్తోంది.

Published : 30 May 2023 02:12 IST

పూర్వ విద్యార్థులు, కార్పొరేటు సంస్థల సహకారం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో విద్యావికాసం, పరిశోధనలకు చిరునామా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్‌వైభవం దిశగా అడుగులు వేస్తోంది. కొత్త తరహా విద్యాబోధనలు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పాటు పూర్వ విద్యార్థులు, ధార్మిక సంస్థలు, కార్పొరేటు సంస్థల నుంచి విరాళాలు సేకరిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్ర చట్టప్రకారం ఏర్పాటు కావడంతో చట్ట ప్రకారం వితరణలు, విరాళాల సేకరణకు వీలుండదు. అందుకే ఉస్మానియా ఫౌండేషన్‌ పేరుతో విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని పదినెలల క్రితం ప్రారంభించారు. లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఫౌండేషన్‌ను నమోదు చేయించారు. దీంతో దాతలు, సంస్థలు ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది.

విశ్వవ్యాప్తంగా చేయూత

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థుల్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ప్రజాప్రతినిధులతో పాటు విదేశాల్లో ఉన్నతస్థానాల్లో విధులు నిర్వహిస్తున్నవారు, సొంతగా సంస్థలు స్థాపించినవారూ ఉన్నారు. వీరిలో చాలామంది తమవంతు విరాళాన్ని వివిధ రూపాల్లో ఇచ్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. విదేశాల నుంచి విరాళాలు నేరుగా స్వీకరించేందుకు అవకాశం లేకపోవడంతో ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ రవీందర్‌ను ఏడాది క్రితం సంప్రదించారు.  దీంతో ఆయన అధికారులతో చర్చించి ఉస్మానియా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో నలుగురు సంచాలకులతో సహా తొమ్మిదిమంది సభ్యులుంటారని, విదేశీ, స్వదేశీ విరాళాలు, వితరణలు పర్యవేక్షించాలని సూచించారు.

పది నెలలు.. రూ.8.2 కోట్లు

ఉస్మానియా ఫౌండేషన్‌ను స్థాపించిన పదినెలల్లోనే వివిధ రూపాల్లో రూ.8.2 కోట్లు విరాళాలుగా వచ్చాయి. నామ్‌కేవాస్తేగా ఉన్న ఎంటెక్‌ మైనింగ్‌ కోర్సును పునరుద్ధరించేందుకు కోల్‌ ఇండియా సంస్థ రూ.3 కోట్ల విరాళం అందజేసింది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులను కోల్‌ఇండియా సంస్థల్లో అప్రెంటిషిప్‌ సౌకర్యం కల్పించనున్నారు. దీంతోపాటు ఉస్మానియా పూర్వవిద్యార్థి, ఐఏఎస్‌ శ్రీధర్‌ సింగరేణి కాలరీస్‌ తరఫున రూ.3 కోట్లను అభివృద్ధి పనులకు విరాళంగా ఇచ్చారు. కొద్దినెలల క్రితం నిర్వహించిన ఉస్మానియా గ్లోబల్‌ అల్యూమ్నిలో రూ.1.5కోట్ల నిధులు సమీకరించారు. మరో పూర్వ విద్యార్థి రూ.70లక్షలతో ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియంను నిర్మించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని