logo

Hyderabad: ప్రధాని పర్యటన.. నగరంలో హై అలర్ట్

 ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నగర పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు.

Updated : 05 Mar 2024 07:16 IST

ప్రధాని రాక సందర్భంగా సోమవారం రాత్రి ఖైరతాబాద్‌ సిగ్నల్స్‌ వద్ద నిలిపివేసిన ట్రాఫిక్‌

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, బేగంపేట:  ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నగర పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రధాని బస చేసే రాజ్‌భవన్‌ సమీప ప్రాంతాలు, బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు రాకపోకలు సాగించే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9.30 వరకూ మోదీ రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌, సమీప ప్రాంతాలను పూర్తిగా ఎన్‌ఎస్‌జీ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. సమీప ప్రాంతాల్లో నగర పోలీసు విభాగానికి చెందిన వివిధ స్థాయిల అధికారులు 200 మంది వరకూ బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధాని కాన్వాయ్‌ వెళ్లే సమయంలో రాజ్‌భవన్‌ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. 

రాజ్‌భవన్‌కు రాక.. ప్రధాని  సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రి 9.10 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఆయన బేగంపేటకు వచ్చారు. ప్రధానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమార్‌, రాష్ట్ర డీజీపీ రవిగుప్త, నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ప్రధానికి స్వాగతం పలికారు.

నేడు ఉజ్జయిని మహంకాళి దర్శనం

ఈనాడు, హైదరాబాద్‌: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకోనున్న నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం నుంచే ఆలయ అలంకరణ పనులు ప్రారంభించారు. పోలీసులు ఉన్నతాధికారులు, ఎండోమెంట్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ఆర్‌జేసీ రామకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ ఆలయానికి చేరుకోనుండగా అర్చకులు, వేదపండితులు ఆయనకు స్వాగతం పలకనున్నారు.


ప్రధాని రాక.. ట్రాఫిక్‌ ఆంక్షలు

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: పటాన్‌చెరుకు మంగళవారం ప్రధాని మోదీ రానున్న సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్‌కుమార్‌ చెప్పారు. అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడ ఎల్లంకి ఇంజినీరింగ్‌ కళాశాలలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి, తూప్రాన్‌, రామాయంపేట, మెదక్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌, జోగిపేట, హత్నూర, దౌల్తాబాద్‌ నుంచి వచ్చే బస్సులు నేరుగా అవుటర్‌ మీదుగా ముత్తంగి జంక్షన్‌ వద్ద దిగి సభాస్థలికి చేరుకోవచ్చని వివరించారు. అవుటర్‌ సర్వీస్‌ రోడ్డు మీదుగా రామేశ్వరంబండ, ఎల్లంకి కళాశాల ప్రాంగణంలో పార్కింగ్‌ చేయవచ్చని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు ముత్తంగి అవుటర్‌ ఎక్కి మరోవైపు నుంచి దిగి సర్వీస్‌రోడ్డు ద్వారా ఎల్లంకి కళాశాల పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకోవచ్చని తెలిపారు. కొల్లూరు అవుటర్‌ జంక్షన్‌ వద్ద దిగడానికి అనుమతిస్తున్నామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని