logo

HYD News: బుద్వేల్‌, మోకిల లేఅవుట్లకు మోక్షం

ఎట్టకేలకు కీలమైన బుద్వేల్‌, మోకిల హెచ్‌ఎండీఏ లేఅవుట్ల అభివృద్ధి పనులకు మోక్షం లభించింది. ఈ రెండు లేఅవుట్లలో ప్లాట్లను వేలం ద్వారా గత ప్రభుత్వం విక్రయించింది.

Updated : 19 Mar 2024 07:08 IST

రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు  
టెండరు దక్కించుకున్న ఎన్‌సీసీ!

బుద్వేల్‌ లేఅవుట్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎట్టకేలకు కీలమైన బుద్వేల్‌, మోకిల హెచ్‌ఎండీఏ లేఅవుట్ల అభివృద్ధి పనులకు మోక్షం లభించింది. ఈ రెండు లేఅవుట్లలో ప్లాట్లను వేలం ద్వారా గత ప్రభుత్వం విక్రయించింది. వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించినప్పటికీ వసతుల కల్పనలో హెచ్‌ఎండీఏ తాత్సారం చేసింది. వాస్తవానికి 18 నెలల్లో లేఅవుట్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇప్పటికే గడువు ముగియడంతో కొనుగోలుదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇటీవలే రూ.400 కోట్ల విలువైన అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచారు. నాలుగు సంస్థలు టెండర్లు దాఖలు చేయగా...ఎన్‌ఎన్‌సీ ఈ పనులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కోకాపేటలో 500 ఎకరాల్లో ఇదే సంస్థ వసతులను కల్పించింది.

మొత్తం నిధులు ఊడ్చేశారు..

గత ప్రభుత్వ హయాంలో భూముల వేలం ద్వారా వేల కోట్లు హెచ్‌ఎండీఏ ఖాతాలోకి చేరాయి. ఇవి ప్రభుత్వం అప్పటి అవసరాల కోసం వాడుకుంది. కనీసం లేఅవుట్లలో మౌలిక వసతులకు అవసరమైన నిధులను అప్పటి అధికారులు పక్కన పెట్టకపోవడంతో వసతుల కల్పనలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు టెండర్లు ఖరారు కావడంతో ఆయా లేఅవుట్లలో అభివృద్ధి పనులకు మార్గం సుగమం కానుంది. ఒక్క బుద్వేల్‌ లేఅవుట్‌ పనుల కోసమే రూ.350 కోట్ల వరకు కేటాయించనున్నారు. రాజేంద్రనగర్‌ సమీపంలో మెట్టపై ఈ లేఅవుట్‌ ఉంది. పెద్దపెద్ద బండరాళ్లను తొలగించడంతోపాటు రెండు వైపులా రహదారులు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక మోకిలలో 165 ఎకరాల లేఅవుట్‌ లో విడతల వారీగా ప్లాట్లను విక్రయించారు. గజం ధర రూ.లక్షపైనే పలికింది. తద్వారా హెచ్‌ఎండీఏకు భారీ ఎత్తున ఆదాయం వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని