logo

Hyderabad News: కాలేయం కరుగుతోంది.. సాయం కోరుతోంది

అందరిలానే ఆ యువకుడు జీవితం గురించి ఎన్నో కలలు కన్నాడు. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా ఉన్నత చదువులు చదివాడు. ఎంఎస్సీ అప్లైడ్స్‌ ఎలక్ట్రానిక్స్‌ పూర్తి చేశాడు. ప్రభుత్వ

Updated : 04 May 2022 09:27 IST

డబ్బు లేక ఆగిన శస్త్ర చికిత్స

శ్రీనివాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: అందరిలానే ఆ యువకుడు జీవితం గురించి ఎన్నో కలలు కన్నాడు. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా ఉన్నత చదువులు చదివాడు. ఎంఎస్సీ అప్లైడ్స్‌ ఎలక్ట్రానిక్స్‌ పూర్తి చేశాడు. ప్రభుత్వ రంగంలో కొలువు సాధించాడు. ప్రస్తుతం ప్రొబెషన్‌లో కొనసాగుతున్నాడు. అంతా సవ్యంగా సాగుతుందనే సరికి విధి పగపట్టింది. కాలేయ వ్యాధి రూపంలో జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రస్తుతం ఆదుకునే వారికోసం ఆ యువకుడు దీనంగా చూస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, నంది వనపర్తికి చెందిన పి.శ్రీనివాస్‌ది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. తండ్రి గోపాల్‌ కాలం చేశాడు. తల్లి గంగమ్మ తమ్ముడు, ఇద్దరు అక్కలు. కులవృత్తి చేసుకుంటూ వచ్చిన సంపాదనలో శ్రీనివాస్‌ను తల్లిదండ్రులు చదివించారు. అనుకున్నట్లే చదువులో రాణించాడు. పంచాయతీరాజ్‌ శాఖలో చిన్న ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కొన్ని రోజులు బాగానే నడిచింది. ఒక్కసారిగా శ్రీనివాస్‌ అస్వస్థతకు గురైయ్యాడు. పొట్ట ఉబ్బి వాంతులు, నీరసం ఆవహించాయి.

అప్పటికి అతనికి తెలియదు అది ప్రాణాంతక వ్యాధి అని. వైద్యులను సంప్రదిస్తే కాలేయం పూర్తిగా పాడైందని చెప్పారు. అతనికి పుట్టుకతోనే ఈ వ్యాధి ఉందని, ముదిరే వరకు లక్షణాలు బయటపడవని వైద్యులు తెలిపారు. కాలేయ మార్పిడి ఒక్కటే మార్గమని తేల్చారు. నిమ్స్‌లోని జీవన్‌దాన్‌ ట్రస్టులో పేరును నమోదు చేసుకున్నాడు శ్రీనివాస్‌. అయితే అంతకుముందు చాలామంది వరుసలో ఉండటంతో అప్పుడే తన వంతు రాదని వైద్యులు తెలిపారు. కుటుంబంలో ఎవరైనా కాలేయంలో కొంతభాగం దానం చేస్తే మార్పిడి చేయవచ్చునని సూచించారు. అన్నయ్యకు పునర్జన్మ ప్రసాదించేందుకు శ్రీనివాస్‌ తమ్ముడు ముందుకు వచ్చాడు. కాలేయమార్పిడి అంటే లక్షలతో పని. అంత డబ్బు అతని వద్ద లేకపోవడంతో ప్రస్తుతం ఆదుకునే చేతులవైపు శ్రీనివాస్‌ ఎదురు చూస్తున్నాడు. ‘కాలేయ మార్పిడి చికిత్సలకు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు అంటున్నారు. తనను ఆదుకొని పునర్జన్మ ఇస్తే ఉద్యోగం చేసి రుణం తీర్చుకుంటానని తెలిపాడు. సహాయం చేయాలనుకున్న వారు ‘ఈనాడు’ ప్రతినిధిని 8008778188 నంబరుకు సంప్రదించగలరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని