CBI: సెన్సార్‌ బోర్డుపై విశాల్‌ ఆరోపణలు.. రంగంలోకి సీబీఐ

సెన్సార్‌ బోర్డుపై నటుడు విశాల్‌ అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో సీబీఐ విచారణ మొదలుపెట్టింది.

Updated : 05 Oct 2023 14:18 IST

దిల్లీ: సెన్సార్‌ బోర్డు అవినీతిమయమైందంటూ నటుడు విశాల్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) రంగంలోకి దిగింది. విశాల్‌ చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ముగ్గురు వ్యక్తులతోపాటు సీబీఎఫ్‌సీకి చెందిన ఓ అధికారిపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నిందితుల ఇళ్లలో ఇప్పటికే సోదాలు కూడా మొదలు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

విశాల్‌ చేసిన ఆరోపణలపై సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (CBFC) ఇటీవల స్పందించింది. లంచం డిమాండ్‌ చేసింది సెన్సార్‌ బోర్డు సభ్యులు కాదని.. థర్డ్‌పార్టీ వారని తెలిపింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన సీబీఐ.. మెర్లిన్‌ మేనకా, జీజా రాందాస్‌, రాజన్‌ ఎం అనే ముగ్గురు వ్యక్తులతో పాటు సీబీఎఫ్‌సీకి చెందిన ఓ అధికారిపై కేసు నమోదు చేసింది. అనంతరం నిందితుల ఇళ్లతోపాటు ముంబయిలో నాలుగు చోట్ల సోదాలు జరిపింది.

‘హిందీలోకి అనువదించిన ఓ సినిమాకు సంబంధించి లంచం తీసుకొని సెన్సార్‌ బోర్డు (CBFC) నుంచి సర్టిఫికేట్‌ ఇప్పించేందుకు కుట్ర జరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు సీబీఎఫ్‌సీ తరఫున రూ.7లక్షల లంచం డిమాండు చేశారు. చర్చల తర్వాత ఆ మొత్తాన్ని రూ.6.54లక్షలకు తగ్గించారు. చివరకు మరో ఇద్దరు నిందితులతో కలిసి నిందితురాలు రూ.6.54లక్షలను స్వీకరించారు. అనంతరం 26వ తేదీన సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్‌ జారీ అయ్యింది. ఈ తతంగం మొత్తాన్ని సమన్వయపరిచినందుకు ఫీజుగా అదనంగా మరో రూ.20 వేలు నిందితురాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి’ అని సీబీఐ పేర్కొంది.

ముంబయి సీబీఎఫ్‌సీ కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందని నటుడు విశాల్‌ (Vishal) చేసిన ఆరోపణలపై స్పందించిన సెన్సార్‌ బోర్డు.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనే సినిమాల సెన్సార్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. సెన్సార్‌ బోర్డు స్పందించిన కొన్ని గంటల్లోనే సీబీఐ రంగంలోకి దిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని