Sita Soren: సోరెన్‌ కుటుంబంలో ‘ఇంటిపోరు’.. కల్పనకు ‘సీత’ చెక్‌!

సోరెన్‌ కుటుంబంలో ఇంటిపోరు మొదలైనట్లు కనిపిస్తోంది. కల్పనాను ముఖ్యమంత్రి చేసేందుకు తాను వ్యతిరేకం అంటూ శిబు సోరెన్‌ పెద్ద కోడలు సీతా సోరెన్‌ (Sita Soren) ప్రకటించారు.

Updated : 31 Jan 2024 19:59 IST

రాంచీ: ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల విచారణ కొనసాగుతోన్న తరుణంలో అక్కడ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. ఏదైనా అనూహ్య పరిణామం చోటుచేసుకుంటే (హేమంత్‌ సోరెన్‌ అరెస్టైతే).. కల్పనా సోరెన్‌కు (Kalpana Soren) సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోరెన్‌ కుటుంబంలో ఇంటిపోరు మొదలైనట్లు కనిపిస్తోంది. కల్పనను ముఖ్యమంత్రి చేసేందుకు తాను వ్యతిరేకం అంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్‌ పెద్ద కోడలు సీతా సోరెన్‌ (Sita Soren) బహిరంగ ప్రకటన చేయడం అక్కడి రాజకీయాలను మరింత వేడెక్కించింది.

కల్పనా సోరెన్‌.. జేఎంఎం ప్లాన్‌-బి కర్త ఆమె..!

‘ఎమ్మెల్యేగా ఎన్నిక కాని, రాజకీయ అనుభవం లేని కల్పననే ఎందుకు? పార్టీలో ఎంతోమంది సీనియర్‌ నేతలుండగా.. ఆమె పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో నేనే సీనియర్‌ను. 14ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. ఆమెను ముఖ్యమంత్రి చేయాలనే ఏ చర్యపైనైనా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తా’ అని దుర్గా సోరెన్‌ భార్య, ప్రస్తుత ఎమ్మెల్యే సీతా సోరెన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆమె.. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొనలేదన్నారు. ఆ సమావేశానికి అనేకమంది ప్రజాప్రతినిధులు హాజరుకాలేదని మరో సీనియర్‌ నేత వెల్లడించారు.

ఇదిలాఉంటే, మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారిస్తోంది. ఇప్పటికే జనవరి 20న ఓసారి విచారించినప్పటికీ.. మరింత సమాచారం కోసం మరోసారి ప్రశ్నించనున్నట్లు ఈడీ ఇటీవల పేర్కొంది. ఈ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న వార్తలతో అక్కడ భారీ భద్రత ఏర్పాటుచేశారు. పలు ప్రాంతాల్లో సెక్షన్‌ 144ను విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని