Gurpatwant Singh Pannun: పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐఏ

వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)కు కేంద్రం షాకిచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ అతడి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. 

Updated : 23 Sep 2023 15:57 IST

దిల్లీ: కెనడా- భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ (Canada India relations)..కెనడాలోని హిందువులకు వార్నింగ్ ఇచ్చిన వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun)కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పంజాబ్‌లోని అతడి ఇల్లు, భూమిని జాతీయ దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది.

అమృత్‌సర్‌ శివారులోని పన్నూ పూర్వీకుల గ్రామమైన ఖాంకోట్‌లో ఉన్న దాదాపు ఆరు ఎకరాల భూమిని, చండీగఢ్‌లోని ఇంటిని దర్యాప్తు సంస్థ(NIA) స్వాధీనం చేసుకుంది. ప్రస్తుత చర్యతో అతడు తన ఆస్తులపై హక్కుల్ని కోల్పోయాడు. ప్రస్తుతం వాటిని ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తారు.  2020లో దర్యాప్తు సంస్థలు అతడి ఆస్తుల్ని అటాచ్ చేశాయి. అతడు వాటిని విక్రయించడానికి వీలులేదని దానర్థం. వివిధ దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోన్న వేర్పాటువాద సంస్థలపై తీసుకుంటోన్న చర్యలకు ప్రస్తుత పరిణామం మరింత బలం చేకూరుస్తోందని ఎన్‌ఐఏ తన ప్రకటనలో పేర్కొంది.

సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను భారత్‌ 2019లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్‌ సింగ్ పన్ను కూడా ఒకడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. తాజాగా కెనడాలో జరుగుతోన్న పరిణామాలపై పన్నూ స్పందించాడు. కెనడా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇండో- కెనడియన్‌ హిందువులు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన అతడు.. అటువంటి వారు తిరిగి భారత్‌ వెళ్లిపోవాలని బెదిరించాడు.  పన్నూ బెదిరింపులపై కెనడాలో హిందూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని