US Visa: అమెరికా టూర్‌ వెళ్లాలనుకుంటున్నారా? వీసా కోసం 1000 రోజులు ఆగాల్సిందే..!

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులు టూరిస్ట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంటర్వ్యూ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిందే. పర్యాటక వీసా కోసం దాదాపు 1000 రోజుల వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది.

Published : 23 Nov 2022 13:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్: విహార యాత్రకో లేదా బిజినెస్‌ టూర్‌ కోసమో అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? అయితే, మీరు మూడేళ్లు ఆగాల్సిందే..! అవును మరి.. అమెరికా పర్యాటక వీసా అపాయింట్‌మెంట్‌ కోసం దాదాపు 1000 రోజుల వెయిటింగ్‌ లిస్ట్ ఉంది. అంటే.. నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ విభాగంలో ఎవరైనా బీ1(బిజినెస్‌), బీ2(టూరిస్ట్‌) వీసాపై అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటే వారికి 2025 జూన్‌ లేదా జులైలో వీసా అపాయింట్‌మెంట్‌ లభిస్తుందన్నమాట.

భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులు, విద్యార్థులు, పర్యాటకుల కోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుదారులకు వీసా అపాయింట్‌మెంట్‌ కోసం పట్టే సమయాన్ని అమెరికా విదేశాంగశాఖకు చెందిన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అయితే, ఆయా ఎంబసీ, కాన్సులేట్‌లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బంది తదితర అంశాలను బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్‌డేట్‌ చేస్తుంటారు. భారత్‌లో దిల్లీ ఎంబసీతోపాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, కోల్‌కతా కాన్సులేట్ల నుంచి వీసా జారీ సేవలు అందిస్తోంది. తాజాగా ఈ కేంద్రాల నుంచి వీసా కోసం నిరీక్షణ సమయాన్ని అమెరికా అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించగా..

* ముంబయి ఎంబసీ నుంచి పర్యాటక వీసా(బీ1/బీ2) కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ కోసం 999 రోజులు నిరీక్షించాలని చూపిస్తోంది. అంటే.. దాదాపు 31 నెలలు వేచి చూడాలన్నమాట.

* ఇదే వీసా కోసం హైదరాబాద్‌ నుంచి దరఖాస్తు చేసుకుంటే.. 994 రోజులు, చెన్నై నుంచైతే 948 రోజులు, దిల్లీ నుంచి 961 రోజులు, కోల్‌కతా నుంచి 904 రోజుల అపాయింట్‌మెంట్‌ వెయిట్ టైం ఉంది.

* అయితే ఇతర వీసాలకు ఈ వెయిటింగ్ లిస్ట్‌ కాస్త తక్కువగానే ఉంది. హైదరాబాద్‌ ఎంబసీ నుంచి స్టూడెంట్స్‌/ఎక్స్ఛేంజ్‌ వీసాల అపాయింట్‌మెంట్‌ కోసం 374 రోజులు వేచి చూడాల్సి వస్తోంది. పిటిషన్‌ బేస్డ్‌ టెంపరరీ వర్కర్‌ వీసాల అపాయింట్‌మెంట్‌ వెయిట్‌ టైం 366 రోజులుగా ఉంది.

వీసా ఇంటర్వ్యూల సమయం భారీగా ఉండటంపై గతంలోనూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా రాయబార కార్యాలయం ఆ మధ్య స్పందిస్తూ..  కరోనా వైరస్‌ విజృంభణ సమయంలో లాక్‌డౌన్‌ తోపాటు సిబ్బంది కొరత కారణంగా వీసా జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని.. కేవలం కొత్తగా వీసా పొందేవారికే నిరీక్షణ సమయం ఎక్కువగా ఉంటోందని వెల్లడించింది. అయితే వీసా జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అమెరికాలో పర్యటించినప్పుడు ఈ వీసా ఇంటర్వ్యూల సమస్యలను.. అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని