ఎట్లున్నరు.. మస్తున్నర్లే!

ఏడాదంతా ఎదురుచూస్తే పదిమంది ఫాలోయర్లు కూడా రాలేదు.. ఆ కొద్దిమందీ గొంతు బాగోలేదని కామెంట్లు! ఆ విమర్శలకి భయపడకుండా అమెరికా జీవితంపై పట్టుదలగా చేసిన వీడియోలు ఆమెకు లక్షలకొద్దీ అభిమానులని సంపాదించిపెట్టాయి.

Updated : 24 Sep 2023 10:34 IST

ఏడాదంతా ఎదురుచూస్తే పదిమంది ఫాలోయర్లు కూడా రాలేదు.. ఆ కొద్దిమందీ గొంతు బాగోలేదని కామెంట్లు! ఆ విమర్శలకి భయపడకుండా అమెరికా జీవితంపై పట్టుదలగా చేసిన వీడియోలు ఆమెకు లక్షలకొద్దీ అభిమానులని సంపాదించిపెట్టాయి. స్వాతి స్టైల్స్‌ అండ్‌ వ్లాగ్స్‌ పేరుతో యూట్యూబర్‌గా మారిన స్వాతి కామిడి చెబుతున్న ముచ్చట్లివి..

మాది జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం. మాఊరి పేరుతో ప్రాజెక్టు కట్టాకే అందరికీ తెలిసింది కానీ, లేకపోతే అదో కుగ్రామం. నాన్న లచ్చిరెడ్డి రైతు. అమ్మ లలిత. తమ్ముడు సుధీర్‌ ఐటీ ఉద్యోగి. ఏడో తరగతి వరకూ ఊళ్లోనే చదువుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చి, ఎంసీఏ చేశా. నన్ను, తమ్ముణ్ని చదివించడం కోసం నాన్న చాలా కష్టపడ్డాడు. అప్పులు చేశాడు, లోన్లు తీసుకున్నాడు. ఎంసీఏ పూర్తికాగానే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆరేళ్లు పని చేశా. కలిసి చదువుకున్న చారీనే పెళ్లి చేసుకుని, ఆయనతో కలిసి అమెరికా వెళ్లాను. అక్కడకు వెళ్లాక కాస్త తీరిక దొరికింది. అప్పుడే యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టాలనే ఆలోచన వచ్చింది. స్కూళ్లో, కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవంతో ధైర్యంగా అడుగేశా. వీడియో, ఆడియో.. ఎడిటింగ్‌ నేర్చుకున్నా. అంతలోనే కొవిడ్‌ రావడంతో నా ఆలోచనకు బ్రేక్‌ పడింది. ఆ తర్వాతే స్వాతి స్టైల్స్‌ అండ్‌ వ్లాగ్స్‌ను ప్రారంభించా.

మానేద్దామనుకున్నా..

మొదట్లో హెయిర్‌ స్టైల్స్‌కి సంబంధించి వీడియోలు చేశా. వాటిని ఎవరూ చూసేవారు కాదు. ఎనిమిది నెలల్లో పట్టుమని పది మంది ఫాలోయర్లు లేరు. ఆ పదిమందిలోనూ కొందరు నెగెటివ్‌ కామెంట్లు చేసేవారు. గొంతు బాగోలేదని వెక్కిరించేవారు. వాటిని చూసి బాధపడి మానేద్దామనుకున్నా. ఆ సమయంలో మావారు ‘అమితాబ్‌లాంటి గొప్ప వ్యక్తులనే గొంతు బాగాలేదన్నారు. బాధపడకు...’ అంటూ సపోర్ట్‌ చేశారు. ఆయనిచ్చిన ప్రోత్సాహంతోనే పట్టు వదలకుండా వీడియోలు చేశా. అమెరికాలో మేముండే డల్లాస్‌లో తెలుగు వారు ఎక్కువ.

ఓరోజు మా ఫ్రెండ్‌ ఇంట్లో సత్యనారాయణ వ్రతం వీడియో చేసి, బ్యాక్‌గ్రౌండ్‌లో నా మాటలతో షార్ట్‌ వీడియో చేసి పోస్ట్‌ చేశా. మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత మరొకటి. ఇలా నెలరోజుల్లోనే లక్ష మంది ఫాలోయర్లు అయ్యారు. ఇక వెనుతిరిగి చూడలేదు. పాప పుట్టాక కొన్నిరోజులు బ్రేక్‌ తీసుకుని, మళ్లీ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నా. అక్కడ జరిగే పండగలు, మా స్నేహితుల గృహప్రవేశాల వీడియోలు చేస్తుంటాను. వంటలు, షాపింగ్‌, పర్యాటక ప్రాంతాలు, హోటళ్లకు వెళ్లినప్పుడు, గార్డెనింగ్‌, ఇంటి అలంకరణ ఇలా అన్నింటినీ వీడియోలు చేస్తుంటా. ఇటీవల ఇండియాకొచ్చి రెండు నెలలున్నాం. మా అత్తగారిల్లు ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలోనూ వీడియోలు చేశాను. అన్నింటికీ మంచి ఆదరణ వస్తోంది.

కష్టమే అయినా..

వీడియోలు తీయడం, వాటిని ఎడిట్‌ చేయడం.. అర్థవంతంగా మార్చడం, వాటికి తగినట్లుగా వాయిస్‌ ఇవ్వడం శ్రమతో కూడుకున్న పనే. మా పాప పడుకున్నాక రాత్రిపూట ఎడిట్‌ చేస్తుంటాను. ఏదో కాలక్షేపం కోసం కాకుండా.. సామాజిక బాధ్యత పెంచే వీడియోలనీ చేస్తున్నా. విద్యార్థులపై ఉండే ఒత్తిడి.. ఆత్మహత్యలు వంటివాటిపైనా చేశాను. ఇందుకోసం నేను లోన్‌ తీసుకుని ఎంత కష్టపడి చదివానో వాళ్లకి చెప్పాను. టాప్‌ ర్యాంకులో ఉండాలని చెప్పను.. కానీ జీవితంలో ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకూడదని చెబుతా. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎన్నో అవకాశాలున్నాయి. ప్రస్తుతం నేను మిలియన్‌ ఫాలోయర్లకి చేరువలో ఉన్నాను. ఈ మధ్య ఇండియా వచ్చినప్పుడు ఎంతో మంది నన్ను గుర్తుపట్టి, ఫొటోలు తీసుకున్నారు. ‘ఎట్లున్నరు.. మస్తున్నర్లే’ అనే నా పలకరింపు, గొంతు భలే ఉంటుందని పొగుడుతున్నారు. ఒకప్పుడు అదే గొంతు విషయంలో విమర్శలు వచ్చాయి. అప్పుడు ఆగిపోయి ఉంటే ఈ ప్రశంసలు దక్కేవా! అందుకే అనుకున్నది చేయడానికి వెనకడుగు వేయకూడదు.

- సోగాల స్వామి, జయశంకర్‌ భూపాలపల్లి


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్