మనం కళ్లు మూసుకుని జీవిస్తున్నాం: భూమిక

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మరణించి సోమవారానికి సరిగ్గా ఏడాది. ఇప్పటికీ ఆయనది హత్యా లేక ఆత్మహత్యా..? అన్నది తేలలేదు. ఆ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కాగా.. సుశాంత్‌తో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకొంటూ నటి భూమిక తీవ్ర భావోద్వేగానికి లోనైంది. వీరిద్దరూ

Published : 15 Jun 2021 01:04 IST

ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘమైన పోస్టు చేసిన నటి

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మరణించి సోమవారానికి సరిగ్గా ఏడాది. ఇప్పటికీ ఆయనది హత్యా లేక ఆత్మహత్యా..? అన్నది తేలలేదు. ఆ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కాగా.. సుశాంత్‌తో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకొంటూ నటి భూమిక తీవ్ర భావోద్వేగానికి లోనైంది. వీరిద్దరూ ‘ఎం.ఎస్‌.ధోనీ’ చిత్రంలో కలిసి పనిచేశారు. సుశాంత్‌ మరణించి ఏడాది గడిచిన సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక పెద్ద పోస్టు చేసింది. మొత్తానికి నీకు ప్రశాంతత దొరికిందని భావిస్తున్నానని, మాకు తప్పును ఎదిరించే ధైర్యం లేదని,  కళ్లు మూసుకుని జీవిస్తున్నామని ఆమె రాసుకొచ్చింది.

‘‘ప్రియమైన సుశాంత్‌.. చివరికి నువ్వు ప్రశాంతత పొందావని ఆశిస్తున్నాను. కానీ.. నీ గురించి మాలో ఎంతో లోతైన అన్వేషణ ఇంకా సాగుతోంది. నువ్వు ఈ లోకాన్ని విడిచి సంవత్సరం గడిచిపోయింది. నీ గురించి నాకు పెద్దగా తెలియదు. ‘ఎం.ఎస్.ధోనీ’లో నీకు సోదరి పాత్రను పోషించాను. అలా సెట్స్‌లో కొద్ది రోజులు నీతో కలిసే ఉన్నాను. మనం కూర్చొని జీవితం గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాం. గత సంవత్సరం ఏం జరిగిందో నాకు స్పష్టంగా గుర్తుంది. నా తండ్రి, నా పిల్లలతో కలిసి కారులో డ్రైవ్‌ కోసం బయలుదేరాం. అప్పుడు వర్షం పడుతోంది. అదే సమయంలో ‘సుశాంత్‌ ఇక లేరు’ అని నాకు ఒక సందేశం వచ్చింది. అది నాకు నమ్మతరం కాలేదు. జీవితం అంటే ఒక నీటి బుడగ లాంటిదని నాకు అప్పుడు అనిపించింది. బాహ్య ప్రపంచానికి నువ్వు సంతోషంగా ఉన్నావని అనిపించనప్పుడే నిన్ను లోపల నుంచి ఏదో చీకటి చుట్టుముట్టినట్లుంది. నీ మరణ వార్త ఈ ప్రపంచాన్నే కదిలించింది. దానంతటికీ కారణం.. నీ వ్యక్తిత్వమే. 

వార్తలు, దర్యాప్తు ప్రారంభమయ్యాయి. నీ మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు వార్తా ఛానళ్లు ప్రసారాలు మొదలుపెట్టాయి. మన జీవితంలో మంచి భాగస్వామి ఉండటమే చాలా ముఖ్యమనే విషయం నాకు అర్థమైంది. కొన్నిసార్లు అందంగా కనిపించే వాతావరణంలో ఉన్నప్పటికీ లోతైన సంభాషణలు లేకపోతే.. మనకు తెలియకుండానే సుడిగుండంలో పడిపోయే అవకాశం ఉంటుంది. నిజానికి చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే ఉంటున్నారు. నేను ఇక్కడ చెప్పదలచుకున్న ఏకైక విషయం ఏమిటంటే.. మనం కళ్లు మూసుకుని జీవిస్తున్నాం. మన చుట్టూ జరుగుతున్న తప్పులు మనకు తెలిసినా ఎదుర్కొనే ధైర్యం మనలో చాలామందికి లేదు. అందుకే చూసీచూడనట్లు వదిలేయాలని నిర్ణయించున్నాం. మనమందరం కొన్నిసార్లు జీవితంలో వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది.  జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలి. నువ్వు ఎక్కడ ఉన్నా.. మీ కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం’’ అని భూమిక తన సుదీర్ఘమైన పోస్టులో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని