Hidimba: ఓటీటీలోకి రానున్న ‘హిడింబ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఇటీవల విడుదలైన ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్‌ ‘హిడింబ’ (Hidimba) ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు స్ట్రీమింగ్‌ వివరాలను సంస్థ వెల్లడించింది.

Published : 06 Aug 2023 09:56 IST

హైదరాబాద్‌: అశ్విన్‌బాబు హీరోగా అనిల్ క‌న్నెగంటి తెర‌కెక్కించిన సినిమా ‘హిడింబ’ (Hidimba). ఇటీవల విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి రానుంది. ఆహా (aha) వేదికగా ఆగస్టు 10వ తేది రాత్రి 7గంటల నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆహా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో నందితా శ్వేత హీరోయిన్‌గా నటించగా..రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె, దీప్తి నల్లమోతు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ మృణాల్‌ ఠాకూర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. కారణం ఏమిటంటే?

క‌థేంటంటే: అభ‌య్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత‌) పోలీస్ శిక్ష‌ణ‌లో ఉండ‌గా ప్రేమించుకుంటారు. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోతారు. ఆ త‌ర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీస‌ర్ అవుతుంది. అభ‌య్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్‌ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్లిద్ద‌రూ ఓ కేసు విష‌య‌మై మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. న‌గ‌రంలో జ‌రుగుతున్న అమ్మాయిల సీరియ‌ల్ కిడ్నాప్‌ల‌కు సంబంధించిన కేస‌ది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్ర‌మంలో కాలా బండ‌లోని బోయ అనే క‌రుడుగ‌ట్టిన ముఠాను ప‌ట్టుకుంటారు. వాళ్ల చెర‌లో ఉన్న అమ్మాయిలంద‌రినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసిన‌ట్లే అనుకుంటున్న త‌రుణంలో న‌గ‌రంలో మ‌ళ్లీ మ‌రో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మ‌రి ఈ కేసును ఆద్య‌, అభ‌య్ ఎలా ఛేదించారు? అస‌లు ఈ కిడ్నాప్‌లు చేస్తున్న నేర‌స్థుడెవ‌రు? అత‌ను రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిల్నే ల‌క్ష్యం చేసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? వాళ్ల‌ను అత‌నేం చేస్తున్నాడు? ఈ క‌థ‌కు అండ‌మాన్ దీవుల్లో ఉన్న ఓ ఆదిమ తెగ‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్న‌ది ఆహాలో చూసి తెలుసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని