Kalyan ram: అందుకే నేను, ఎన్టీఆర్‌ ఏ విషయంలోనూ ఎక్కువగా స్పందించం: కల్యాణ్‌ రామ్‌

‘డెవిల్‌’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో కల్యాణ్ రామ్ మీడియాతో ముచ్చటించారు. సినిమా విశేషాలు పంచుకున్నారు.  

Updated : 26 Dec 2023 18:39 IST

‘డెవిల్‌’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి కల్యాణ్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్త మేనన్‌ కథానాయిక. ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారం జోరు పెంచారు. ఇందులో భాగంగా మీడియాతో కల్యాణ్‌రామ్‌ ముచ్చటించారు. ఆయన పంచుకున్న విశేషాలివే.. 

‘డెవిల్‌’ (Devil) సినిమా టెక్నిషియన్స్‌ గురించి చెప్పండి?
కల్యాణ్‌ రామ్‌: ‘అమిగోస్‌’కు పని చేసిన కొందరు దీనికి కూడా వర్క్‌ చేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. నా కాస్ట్యూమ్స్‌ విషయంలోనూ ఎంతో శ్రద్ధ వహించారు. నేను ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు. కథ కోసం డైలాగులు చెప్పే విధానం మార్చుకున్నా. 

‘బింబిసార’, ‘డెవిల్’ రెండు పాత్రలు ఎలా అనిపించాయి?
కల్యాణ్‌ రామ్‌: రెండు భిన్నమైనవి. ‘డెవిల్‌’లో పాత్ర కొత్తగా అనిపించింది. దీని కోసం బాడీ లాంగ్వేజ్‌లోనూ మార్పులు చేసుకున్నా. 2023కు ఈ సినిమా విజయంతో ముగింపు పలకనున్నాం. ఈ సినిమాలో కీలకాంశాలు చాలా ఉన్నాయి. దేశభక్తి కూడా ఇందులో ఓ ప్రధానాంశం.

‘డెవిల్‌’లో మ్యూజిక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందా?
కల్యాణ్‌ రామ్‌: హర్షవర్ధన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. ఈ సినిమాలో పాటల కంటే నేపథ్య సంగీతం ఎక్కువ ఆకట్టుకుంటుంది. ‘డెవిల్‌’ టైటిల్‌ రాసిన విధానాన్ని పరిశీలిస్తే కథ అర్థమవుతుంది. నాకు ఈ కథ చాలా నచ్చింది. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. శ్రీకాంత్ నా దగ్గరకు స్టోరీ తీసుకురాగానే నేను కొన్ని మార్పులు చెప్పాను. దీని కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డాం. సినిమా చూసిన ప్రేక్షకులకు కొత్త కాన్సెప్ట్‌ను ఎంజాయ్‌ చేశామనే భావన కలుగుతుంది. 

సంయుక్త మేనన్‌ గురించి చెప్పండి?
కల్యాణ్‌ రామ్‌: సంయుక్త మేనన్‌, మాళవిక నాయర్‌ పాత్రలు సినిమాకే కీలకం. ఇందులో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యముందో హీరోయిన్‌ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యముంది. 

నిర్మాతగా మారిన తర్వాత మీలో ఏమైనా మార్పు వచ్చిందా?
కల్యాణ్‌ రామ్‌: సినిమా కోసం నటీనటుల కంటే ప్రొడక్షన్ వాళ్లు ఎక్కువ కష్టపడతారు. అందరూ అలా టీమ్‌గా పని చేస్తేనే అవుట్‌పుట్‌ బాగా వస్తుంది. సినిమా ఫలితం ప్రభావం మొదట నిర్మాతపైనే పడుతుంది. ఇక ‘డెవిల్‌’ ఒకరి దర్శకత్వంలో మొదలై.. మరొకరి దర్శకత్వంలో ముగిసింది. డైరెక్టర్లు ఎందుకు మారారనే విషయంలో మీకు నిర్మాత మాత్రమే సమాధానం చెప్పగలరు. 

ఈ సినిమా కోసం 90 కాస్ట్యూమ్స్‌ ఉపయోగించారన్నారు ఎందుకు?
కల్యాణ్‌ రామ్‌: పాత్రకు అలా కాస్ట్యూమ్స్‌ మార్చడం అవసరం. అందుకే అన్ని ఉపయోగించాం. అవన్నీ కూడా ఇక్కడివి కాదు. ఫ్రాన్స్, ఇటలీ నుంచి మెటీరియల్‌ తెప్పించి కుట్టించారు.

‘డెవిల్‌’లో కొత్తగా కనిపించే అంశం ఏది?
కల్యాణ్‌ రామ్‌: 1940ల్లో నేరపరిశోధన ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. అప్పటి రోజుల్లో ఒక కేసును ఎలా పరిశీలించేవాళ్లో, ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. సీసీ కెమెరాలు కూడా లేకుండా ఒక కేసును ఎలా పరిష్కరించారో ఇందులో చూపించాం. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి.

ఎవరి స్ఫూర్తితో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నారు?
కల్యాణ్‌ రామ్‌: ఎవరూ లేరు. నాకే కొత్త కథలను ప్రయత్నించాలనిపిస్తుంటుంది.  ప్రేక్షకులు కొత్తదనాన్ని చూడడానికి ఇష్టపడతారు. ‘గజిని’ సినిమా వచ్చినప్పుడు అందరూ ఇలా ఉందేంటి అనుకున్నారు. కానీ, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాకు అన్ని రకాల సినిమాలు ఇష్టమే. 

ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందా?
కల్యాణ్‌ రామ్‌: చర్చలు జరిగాయి. సినిమా ఫలితం తర్వాత దాన్ని అధికారికంగా ప్రకటిస్తాం. స్క్రిప్ట్‌ అయితే సిద్ధంగా ఉంది. 

కెరీర్‌ మొదలైనప్పటికీ ఇప్పటికీ సినిమా ప్రచారాల్లో మార్పులు వచ్చాయంటారా?
కల్యాణ్‌ రామ్‌: ఏ సినిమా చూడాలి, దేన్ని చూడకూడదు అనే విషయంలో ఆడియన్స్‌ క్లియర్‌గా ఉంటారు. గతంలో మూవీ పోస్టర్, దర్శకుడు, నటుడు.. ఇలాంటి అంశాలు చూసి సినిమాలకు వెళ్లేవారు. నేను కెరీర్‌ మొదలు పెట్టిన కొత్తల్లో టీవీల్లో వచ్చే సినిమా ప్రకటనలు చూసి చూడాలో వద్దా నిర్ణయించుకునే వాళ్లు. ఇప్పుడు ట్రైలర్‌ చూసి సినిమా గురించి ఓ అవగాహనకు వస్తున్నారు. అప్పుడైనా.. ఇప్పుడైనా.. కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేయాలంటే సినిమాలకు మాత్రమే వెళ్లాలి. 

భవిష్యత్తులో రచనరంగం, దర్శకత్వం వైపు వెళ్లే అవకాశం ఉందా?
కల్యాణ్‌ రామ్‌: అది చాలా కష్టం. ఆ వైపు వెళ్లాలనే ఆలోచన కూడా నాకు లేదు. 

‘దేవర’ (Devara) షూటింగ్‌ ఎక్కడ దాకా వచ్చింది?
కల్యాణ్‌ రామ్‌: 80శాతం అయిపోయింది. అందరూ అప్‌డేట్‌ అడుగుతుంటే మాకు ఒత్తిడి కలుగుతుంది. ఏ విషయంలోనైనా మాకు ఒక క్లారిటీ వచ్చే వరకు స్పందించకూడదని నేను, జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR) అనుకుంటాం. అందుకే అన్నిటికీ ఎక్కువగా స్పందించం.

మీరు కెరీర్‌ మొదలుపెట్టి 20 ఏళ్లు అవుతుంది? ఎలా అనిపిస్తుంది?
కల్యాణ్‌ రామ్‌: చాలా ఆనందంగా ఉంది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఈ వృత్తిలో నేర్చుకునే అవకాశం ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని