Malaikottai Vaaliban: మోహన్‌లాల్‌ ‘మలైకోటై వాలిబన్‌’.. ఓటీటీ రిలీజ్‌ అప్పుడే?

మోహన్‌ లాల్‌ నటించిన ‘మలైకోటై వాలిబన్‌’ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైనట్లు సమాచారం. ఆ వివరాలివీ..

Published : 10 Feb 2024 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోహన్‌లాల్‌ (Mohanlal) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్‌’ (Malaikottai Vaaliban). రిపబ్లిక్‌ డే సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో మార్చి 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి. బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేసిన పోరాటం నేపథ్యంలో దర్శకుడు లిజో జోస్‌ పెల్లిస్సేరి ఈ చిత్రాన్ని రూపొందించారు. రెజ్లర్‌ వాలిబన్‌ పాత్రలో మోహన్‌లాల్‌ నటించారు. సోనాలీ కులకర్ణి, హరీశ్‌ పేరడీ ఇతర కీలక పాత్రలు పోషించారు. జనవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. దాదాపు రూ. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 25 కోట్ల వసూళ్లు చేసింది. మోహన్‌లాల్‌ నటన, సాంకేతిక విభాగానికి మంచి మార్కులు పడ్డాయి.

సినిమాపై వచ్చిన విమర్శలపై దర్శకుడు ఇటీవల స్పందించారు. ‘‘నేను విమర్శలను స్వాగతిస్తా. కానీ, వాటిలో కొన్ని మనసుకు బాధ కలిగిస్తాయి. సినిమాను ఎంతో కష్టపడి రూపొందిస్తాం. అది విడుదలయ్యాక మొదటి రెండు రోజుల్లో వచ్చే కామెంట్స్ దానిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది సరైంది కాదు. ఒక వర్గం ప్రేక్షకులు విమర్శించడమే లక్ష్యంగా కామెంట్స్‌ చేస్తుంటారు. వాళ్లకు సినిమా నచ్చలేదు కాబట్టి ప్రపంచంలో ఎవరూ దాన్ని చూడకూడదు అనుకుంటారు. వారి కామెంట్స్‌ వల్ల సినిమా కోసం ఏడాదిన్నర పాటు పడిన కష్టమంతా కనుమరుగైపోతుంది. అది నన్ను ఎంతో బాధించింది. మూవీ చూడాలని లేకపోతే వదిలేయండి. ఇతరులను చూడొద్దని చెప్పొద్దు’’ అంటూ విమర్శకులకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని