Salaar: ‘సలార్‌’ వెనుక ‘బాహుబలి’ స్ఫూర్తి ఉండొచ్చేమో..: పరుచూరి గోపాలకృష్ణ

‘సలార్‌’ (Salaar) చిత్రం విజయం సాధించడంపై పరుచూరి గోపాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని ఆయన అభినందించారు.

Updated : 27 Dec 2023 11:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’ (Salaar). తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా విజయంపై చిత్రబృందానికి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాస్‌, నేటి తరం ప్రేక్షకుల గురించి ఆయన మాట్లాడారు. 

‘‘వర్షం’, ’పౌర్ణమి’ సినిమాల సమయం నుంచి ప్రభాస్‌ (Prabhas)ను చూస్తున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే మంచితనానికి అతడు మారుపేరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అతడిలోని గొప్ప విషయం. నేటి తరం హీరోల్లో అందరి కంటే ముందు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బాహుబలి’ ప్రభాస్‌కు ఓ వరం. ఆ సినిమాతోనే అందరి హృదయాల్లో స్థానం సంపాదించాడు. తాజాగా ‘సలార్‌’తో మరో విజయాన్ని అందుకున్నాడు. గతంలో ‘కేజీయఫ్‌’ లాంటి అద్భుతమైన సినిమాలను అందించిన ప్రశాంత్ నీల్ దీన్ని తెరకెక్కించారు. ఒక జానపద కథను యాక్షన్‌ చిత్రంగా రూపొందించారు. దీని వెనుక ‘బాహుబలి’ స్ఫూర్తి ఉండొచ్చని అనుకుంటున్నా. ఇందులోని పాత్రలన్నీ అద్భుతాలే’’ 

ఒకే ఫ్రేమ్‌లో రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ఫ్యామిలీస్‌.. మాళవిక డిసెంబరు పిక్స్‌!

‘‘నేను పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ఒక్కో హీరో ఏడాదికి 20 సినిమాల దాకా చేసే వారు. వాటిల్లో కొన్ని ప్రేక్షకాదరణ పొందలేకపోయినా.. వారిపై ప్రతికూల ప్రభావం కనిపించేది కాదు. కానీ, ఇప్పుడు ఒక హీరో రెండేళ్లకు ఒక సినిమా చొప్పున తీస్తున్నారు. అది హిట్‌ కాలేకపోతే.. అభిమానులు మళ్లీ మూడేళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. అలాగే ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా అప్పటితో పోలిస్తే చాలా మార్పు వచ్చింది. వాళ్లు కోరుకునే విధంగా తీయాలని ఇప్పటి దర్శకులు ఆలోచిస్తున్నారు. అలా ప్రేక్షకుల ఆలోచనలకు తగ్గట్లు సినిమాలు తీసే దర్శకుల్లో రాజమౌళి(SSRajamouli) ముందు వరుసలో ఉంటే.. అలా నటించే హీరోల జాబితాలో ప్రభాస్‌ తొలి స్థానంలో ఉన్నారు’’ అంటూ అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు