Samajavaragmana: సినిమా చాలా బాగుంది కానీ, వాటి లెంగ్త్‌ తగ్గిస్తే బాగుండేది: పరుచూరి విశ్లేషణ

‘సామజవరగమన’ (Samajavaragamana) సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపారు సీనియర్‌ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna). సినిమా తనకెంతో నచ్చిందని ఆయన అన్నారు.

Published : 05 Aug 2023 09:40 IST

హైదరాబాద్‌: శ్రీవిష్ణు  (Sree Vishnu)- రెబా మోనికా జాన్‌ (Reba Monica John) నటీనటులుగా తెరకెక్కిన రీసెంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సామజవరగమన’ (Samajavaragamana). నరేశ్‌, వెన్నెల కిషోర్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, రాజీవ్‌ కనకాల కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా జూన్‌ నెలాఖరులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ‘ఆహా’ వేదికగా అందుబాటులో ఉన్న ఈ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా చాలా బాగుందని చెప్పిన ఆయన కొన్ని సీన్స్‌ను మెచ్చుకున్నారు. అలాగే, మరికొన్ని సన్నివేశాలు నిడివి తగ్గించి ఉంటే సినిమా మరోస్థాయిలో ఉండేదన్నారు.

‘‘ఇదొక ప్రేమకథా చిత్రం. నటీనటుల ప్రేమ సఫలమవుతుందా? లేదా? అనే ఉత్కంఠను చివరి వరకూ దర్శకుడు కొనసాగించారు. అలాగే, వినోదం కూడా అదే మోతాదులో అందించారు. ఏ అమ్మాయినైతే హీరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడో ఆ అమ్మాయే అతడిని అన్నయ్య అని పిలిచే పరిస్థితి రావడంతో ప్రేక్షకులు కథకు బాగా కనెక్ట్‌ అవుతారు. తన కుటుంబంలో జరుగుతున్న ఓ పెళ్లిని దృష్టిలో ఉంచుకుని తాను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పలేడు. అలాగే, ఆమెకు అన్నయ్యని కాదని అనలేదు. మరి హీరో ఏం చేశాడు? ప్రేమలో ఎలా విజయం సాధించాడు? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ఆ విషయం నన్నెంతో భయపెడుతుంది: సాయి ధరమ్‌ తేజ్‌

శ్రీవిష్ణు-రెబా మోనికా జాన్‌తోపాటు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది నరేశ్‌, వెన్నెల కిషోర్‌, రాజీవ్‌ కనకాల. అలాగే, రఘుబాబు కూడా తనవంతు హాస్యం పండించారు. సినిమా మొత్తం నవ్వులు పువ్వులతో సాగుతుంది. హీరో-హీరోయిన్‌ అన్నాచెల్లి అవుతారనే ఎపిసోడ్‌, రాఖీ కట్టే ఎపిసోడ్‌కు సంబంధించిన నిడివిని కాస్త తగ్గించి.. కథను కాస్త సీరియస్‌ మోడ్‌లోకి తీసుకెళ్లి కొత్త సన్నివేశాలు క్రియేట్‌ చేసి ఉంటే మరింత బాగుండేది. ఎందుకంటే, ఏ సన్నివేశాన్ని అయినా ఒకే రసంతో కొనసాగిస్తే ప్రమాదం. ఒక స్టేజ్‌లో ఈ సినిమాలో అది ఏర్పడింది. దాన్ని కనుక బ్రేక్‌ చేసి ఉంటే మరిన్ని ఎక్కువ వసూళ్లు రాబట్టేది.

ఈ సినిమాలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వృద్ధాప్యం వచ్చాక తల్లిదండ్రులను చూసుకోవడాన్ని పిల్లలు భారంగా భావిస్తున్నారు. అలాంటి సన్నివేశాలనే ఈ సినిమాలోనూ చూపించారు. తన నాన్నమ్మను వృద్ధాశ్రమానికి పంపించాల్సిన అవసరం లేదని తానే చూసుకుంటానని హీరో చెప్పే సీన్‌కు థియేటర్‌లో క్లాప్స్‌ పడి ఉంటాయి. నటీనటులు అన్నాచెల్లి కావడం అనే పాయింట్‌ కొత్తగా ఉంది. సోదరి సెంటిమెంట్‌తో వచ్చే సీక్వెన్స్‌ కామెడీగా ఉన్నాయి’’ అని పరుచూరి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని