allu arjun: ‘పుష్ప’రాజ్‌కు జాతీయ అవార్డు.. ఈ అంశాలే కారణమా..!

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ నటనకు గాను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పుష్ప’రాజ్‌ గురించి ఆసక్తికర అంశాలేంటో చూద్దాం..

Updated : 25 Aug 2023 12:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు..’ అంటూ పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ (Allu arjun).. ఇప్పుడిదే సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొంది చరిత్ర సృష్టించారు. బన్నీ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa)లో పుష్పరాజ్‌గా బన్ని నటన, డైలాగ్‌ డెలివరీ, డ్యాన్స్‌.. ఇలా ఒక్కటేంటి భారత సినీ ప్రేక్షకులకు మాస్‌ అవతార్‌గా కనిపించారు. మీమ్స్‌, రీల్స్‌, రైమ్స్‌తో చిన్నా, పెద్దా అంతా ‘తగ్గేదేలే’ అంటూ సోషల్‌మీడియాను హోరెత్తించారు. బాక్సాఫీస్‌ వద్ద కాసులు కురిపించడమే కాదు, రికార్డులను సైతం ఈ ‘పుష్పరాజ్‌’ తన ఖాతాలో వేసుకున్నాడు.  ఇప్పుడు నేషనల్‌ అవార్డును కూడా సొంతం చేసుకుని తెలుగు సినిమా తలెత్తుకునేలా చేశాడు. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

  • ‘ఆర్య’తో బన్ని కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని మైలురాయిని వేశారు సుకుమార్‌. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య2’ పర్వాలేదనిపించింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్‌, సుకుమార్‌ చేతులు కలిపారు. తాజాగా దీనికి జాతీయ అవార్డు రావడంతో ఈ ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంబరాలు చేసుకున్నారు.
  • ‘పుష్ప’ కథను తొలుత మహేశ్‌బాబుకు చెప్పారట సుకుమార్‌. ఆయనకు కథ నచ్చి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చారు. అంతకుముందే ఒప్పుకొన్న ప్రాజెక్టుల కారణంగా డేట్స్‌ సర్దుబాటు చేయలేకపోవడం, ఇతర కారణాల వల్ల ప్రాజెక్టు ఆగిపోయింది. ‘పుష్ప’ ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగుతుంది. మహేశ్‌కు చెప్పిన కథ ఇదే నేపథ్యమైనా స్టోరీ లైన్‌ వేరని సుకుమార్‌ ఆ తర్వాత తెలిపారు. అయితే పుష్పరాజ్‌ పాత్రకు బన్నీ శ్రమతో ప్రాణం పోశాడు. ఈ పాత్రకోసం రెండు, మూడు గంటలు కదలకుండా మేకప్‌ వేసుకున్నాడు. ఇప్పుడదే కృషి అతడిని అవార్డు వరించేలా చేసిందనడంలో ఆశ్చర్యం లేదు.
  • అల్లు అర్జున్‌, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ ఈ ముగ్గురూ కలిస్తే, సౌండ్‌ బాక్సులు బద్దలవ్వాల్సిందే. ‘పుష్ప’ విషయంలోనూ అదే మ్యాజిక్‌ రిపీట్‌ అయింది. ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావ’, ‘సామి సామి’ పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. 2022లో అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్‌-10 సాంగ్స్‌లో ఇవి నిలిచాయి.  అంతేకాదు, 6.2 బిలియన్‌ + వ్యూస్‌ సొంతం చేసుకున్న తొలి ఇండియన్‌ ఆల్బమ్‌గానూ పాటలు రికార్డు సృష్టించాయి. ఈ పాటలకు గాను  దేవిశ్రీప్రసాద్‌కూడా ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకోనున్నారు.
  • 2021 డిసెంబరు 17న పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన ‘పుష్ప ప్రపంచవ్యాప్తంగా రూ.365కోట్లు(గ్రాస్‌) వసూలు చేసింది, ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్‌) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప’రాజ్‌ రికార్డు సృష్టించాడు.

  • ఓటీటీలోనూ ‘పుష్ప’అదరగొట్టింది. 2022లో అమెజాన్‌ప్రైమ్‌లో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్‌లోనూ పుష్పరాజ్‌ హవా చూపించాడు. 2022లో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌ సాధించిన చిత్రంగా పుష్ప అలరించింది. 10మిలియన్‌+ ఇన్‌స్టా రీల్స్‌ క్రియేట్‌ చేశారంటే పుష్ప మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు, సన్నివేశాలు దర్శనమిస్తూనే ఉన్నాయి.
  • ఇక అవార్డుల విషయంలోనూ పుష్పరాజ్‌ తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. గతంలో ఈ సినిమాకు ఏడు ఫిల్మ్‌ఫేర్‌లు, మరో ఏడు సైమా అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. 
  • ‘పుష్ప’ అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు..’, ‘సరకు ఉంటే పుష్ప ఉండడు.. పుష్ప ఉంటే సరకు ఉండదు.. రెండింటినీ కలిపి చూడాలనుకుంటే మీరు ఎవ్వరూ ఉండరు’, ‘నేను ఇక్కడ బిజినెస్‌లో ఏలుపెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చా.. తగ్గేదేలే’లాంటి డైలాగ్‌లు బాగా ఫేమస్‌ అయ్యాయి.

ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా  ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) రానుంది. దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ‘పుష్ప ఎక్కడా..?’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. అందులోని ‘అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండడుగులు వెనక్కి వేస్తే పుష్ప వచ్చాడని అర్థం’ అంటూ సాగే డైలాగ్‌ దీనిపై అంచనాలు పెంచేసింది. అలాగే ఇందులో అల్లు అర్జున్‌, రష్మిక (Rashmika), ఫహాద్ ఫాజిల్‌ల ఫస్ట్‌లుక్‌లను రిలీజ్‌ చేయగా అవి ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని