Family Star: ‘దేవర’ సంగతేమో కానీ, దేవరకొండ వచ్చేస్తున్నాడు!

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.

Updated : 02 Feb 2024 16:52 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఏప్రిల్‌ 5న ఈ ‘ఫ్యామిలీ స్టార్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌ - పరశురామ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి. ‘ఐరనే వంచాలా ఏంటి’ డైలాగ్‌ సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపేసింది. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం సంక్రాంతి కానుకగా మూవీని విడుదల చేయలనుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. ఫిబ్రవరి 20 నాటికి షూటింగ్‌ పూర్తి చేసి, ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తున్నారు. గోపీ సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

మరి ‘దేవర’ రానట్లేనా?

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ (NTR) నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘దేవర: పార్ట్‌1’ (Devara) ఏప్రిల్‌ 5న విడుదల కావాల్సి ఉంది. ఈ విషయాన్ని చిత్ర బృందం కూడా ప్రకటించింది. ఇప్పుడు ఈ మూవీ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం సైఫ్ అలీఖాన్‌ గాయపడటం. షూటింగ్‌లో భాగంగా సైఫ్‌కు గాయాలవడంతో శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కారణంగా సినిమా విడుదల వాయిదా పడినట్లేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదల తేదీని ప్రకటించడం గమనార్హం. జాన్వీ కపూర్‌ కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్న ‘దేవర 1’లో సైఫ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని