Congress Vs TMC: మాటల యుద్ధం వేళ.. డెరెక్‌కు అధీర్‌ రంజన్‌ క్షమాపణ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ.. టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌కు క్షమాపణలు చెప్పారు. ఆయన్ను ఓ విదేశీయుడంటూ పేర్కొనడంపై విచారం వ్యక్తం చేశారు.

Published : 27 Jan 2024 02:18 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పొత్తుల విషయంలో కాంగ్రెస్‌, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇది కాస్త.. టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌ (Derek O'Brien), కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ (Adhir Ranjan Chowdhury)ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ క్రమంలోనే డెరెక్‌ విదేశీయుడంటూ చౌధరీ గురువారం వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దీంతో నేడు ఆయనకు క్షమాపణలు చెప్పారు.

‘‘విదేశీయుడనే మాట అనుకోకుండా వచ్చేసింది. అలా మాట్లాడినందుకు ఓబ్రియన్‌ వద్ద విచారం వ్యక్తం చేశాను’’ అని చౌధరీ ట్వీట్‌ చేశారు. టీఎంసీ నేత ఆయన క్షమాపణలను అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో కూటమి పనిచేయకపోవడానికి అధీర్‌ రంజన్‌ కారణమని డెరెక్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. చౌధరీ తీరుతో రాష్ట్రంలో పొత్తులు కుదరలేదని విమర్శించారు. ఇదే విషయాన్ని అధీర్‌ వద్ద మీడియా లేవనెత్తగా.. ‘‘డెరెక్‌ ఓ విదేశీయుడు. ఆయనకు చాలా విషయాలు తెలుసు. ఆయన్నే అడగండి’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది కాస్త చర్చనీయాంశమైంది.

ఆయన వల్లే బెంగాల్‌లో ఈ చిక్కులు : తృణమూల్‌

బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై తాను చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్‌ తోసిపుచ్చిందని, దీంతో ఒంటరిగా పోటీకి దిగాలని నిర్ణయించినట్లు టీఎంసీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో కాంగ్రెస్‌ ఉలిక్కిపడింది. ఇండియా కూటమిలో తృణమూల్‌ ముఖ్య భాగస్వామి అని, మమత లేకుండా విపక్ష కూటమి మనుగడను ఊహించలేమని పేర్కొంది. త్వరలోనే ప్రతిష్టంభన తొలగిపోతుందని తెలిపింది. ఇలా కాంగ్రెస్‌ నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ.. సమయం మించిపోయిందని టీఎంసీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని