Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌లో తారస్థాయికి అసమ్మతి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి తారస్థాయికి చేరింది. చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిపై ఇంకా తేల్చని అధిష్ఠానం.. ఆదిలాబాద్‌ టికెట్‌ను ఎన్‌ఆర్‌ఐకి కేటాయించడాన్ని జిల్లా కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. 

Updated : 06 Nov 2023 20:09 IST

ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి తారస్థాయికి చేరింది. చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిపై ఇంకా తేల్చని అధిష్ఠానం.. ఆదిలాబాద్‌ టికెట్‌ను ఎన్‌ఆర్‌ఐకి కేటాయించడాన్ని జిల్లా కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ ఖాన్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు పీసీసీ కార్యదర్శి గండ్ర సుజాత, సీనియర్‌ నేత సంజీవ్‌రెడ్డి కూడా రాజీనామా చేశారు. సంజీవ్‌రెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేందుకు నోరు రావడం లేదని సాజిద్‌ ఖాన్‌ అన్నారు. పార్టీలో రాహుల్‌ గాంధీ పాత్ర ఏంటో అర్థం కావడం లేదని, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను అవలంబిస్తున్న వ్యక్తులకు కాంగ్రెస్‌లో స్థానం లేదని చెప్పిన నేతలు.. ఇప్పుడు అదే ఐడియాలజీ కలిగిన వారికి టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

‘‘మా ముగ్గురిలో ఎవరికి టికెట్‌ వచ్చినా కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం. రేవంత్‌రెడ్డిని కొనుక్కున్నట్లు ఎన్‌ఆర్‌ఐ ప్రచారం చేశారు. అది వాస్తవమే’’ అని సంజీవ్‌రెడ్డి అన్నారు. డబ్బే ప్రధానాంశంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తడిబట్టతో గొంతులు కోశారని గండ్ర సుజాత విమర్శించారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పేందుకు సంజీవ్‌రెడ్డిని పోటీకి దించుతున్నట్లు చెప్పారు. ప్రజలతో సత్సంబంధాలు లేని వ్యక్తికి టికెట్‌ కేటాయించడంలో అర్థమేంటని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి రూ.5కోట్లు ఇచ్చినట్లు టికెట్‌ తీసుకున్న అభ్యర్థి ప్రచారం చేస్తుంటే.. అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని