Apple Passkeys: పొడవాటి పాస్‌వర్డ్‌ల చిరాకు ఇక లేదు... త్వరలో యాపిల్‌ కొత్త టెక్నాలజీ!

పాస్‌ వర్డ్‌ సమస్యల నుంచి బయటపడేసేందుకు యాపిల్‌ కొత్తగా పాస్‌కీస్‌ తీసుకొస్తోంది... 

Updated : 10 Jun 2022 19:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎంత జాగ్రత్తగా ఉన్నా... ఆన్‌లైన్‌ కాలంలో పాస్‌వర్డ్‌లు సురక్షితం కాదు. అక్షరాలు, అంకెలు, గుర్తులు కలిపి పాస్‌వర్డ్‌ పెట్టినా.. సాంకేతికతను ఉపయోగించుకుని హ్యాక్‌ చేసేస్తున్నారు. దీంతో పాస్‌వర్డ్‌లు లేని లాగిన్‌లు తీసుకురావాలనే ఆలోచన మొదలైంది. అందులో భాగంగా యాపిల్‌ సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చింది. అదే ‘పాస్‌కీస్‌’. పాస్‌వర్డ్‌లు అవసరం లేని లాగిన్‌ సౌకర్యాన్ని పాస్‌కీస్‌ ద్వారా పొందొచ్చు. అంటే ఏదైనా వెబ్‌సైట్‌/సర్వీసులో లాగిన్‌ అవ్వాలంటే యూజర్‌ నేమ్‌ ఉంటే చాలు. మీ ఫింగర్‌ ప్రింట్‌ లేదా ఫేస్‌ ఐడీతో ఎంచక్కా లాగిన్‌ అవ్వొచ్చు. 

‘పాస్‌ కీస్‌’ సౌకర్యాన్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తారు. అప్పుడు మొబైల్‌/ఐప్యాడ్‌/మ్యాక్‌ ఓఎస్‌లో పాస్‌కీస్‌ను వాడొచ్చు. యూజర్‌ ఐడీతో ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేశాక... ఫేస్‌కీస్‌లో అప్రూవ్‌ అని అడుగుతుంది. అక్కడ ఫింగర్‌ ప్రింట్‌/ఫేస్‌ఐడీ /పాస్‌ కోడ్‌ ఎంటర్‌ చేస్తే లాగిన్ అవుతుంది. పాస్‌కీస్‌ ఫీచర్‌ను పబ్లిక్‌ కీ క్రిపోగ్రఫీ అనే సాంకేతికత ద్వారా రూపొందించారు. దీని వల్ల ఫిషింగ్‌లు, లీక్‌లు లాంటి వాటికి తావు ఉండదు అని యాపిల్‌ టీమ్‌ చెబుతోంది. అంతేకాదు ఐక్లౌడ్‌ కీచెయిన్‌ ద్వారా మీ దగ్గరున్న అన్ని యాపిల్ డివైజ్‌లలో పాస్‌కీస్‌ని ఆటో సింక్‌ చేసుకోవచ్చట. అంటే అన్నింట్లోనూ ఒకేలా వాడుకోవచ్చన్నమాట. 

పాస్‌కీస్‌లో సేవ్‌ చేసిన సమాచారం ఏ సర్వర్‌లోనూ భద్రపరచడం లేదు. కేవలం ఆ డివైజ్‌లోనే ఉంటుంది. కాబట్టి ఆ సమాచారాన్ని ఇంకొకరు చూస్తారనే భయం అక్కర్లేదు అని చెబుతోంది యాపిల్‌. పాస్‌వర్డ్‌ లెస్‌ లాగిన్‌ సౌకర్యం కోసం యాపిల్‌ ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌తో జట్టుకట్టింది. బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ లాగిన్‌ వ్యవస్థను తీసుకురావడానికి ఈ మూడు టెక్‌ దిగ్గజాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే పాస్‌కీస్‌ వచ్చిందని చెప్పొచ్చు. పూర్తిస్థాయిలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ఇక ‘పాస్‌వర్డ్స్‌ గతించిన చరిత్ర’ అని చెప్పొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని