టెట్‌పై నిరాసక్తి!

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. వచ్చే నెల 20 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనుండగా.. 9వ తేదీ నాటికి 1.93 లక్షల మందే దరఖాస్తు చేశారు.

Updated : 10 Apr 2024 07:35 IST

గత ఏడాది 2.91 లక్షలు... ఈసారి 1.93 లక్షల మందే దరఖాస్తు
ప్రభావం చూపిన ఫీజు పెంపు, ఇతర అంశాలు
నేటితో ముగియనున్న గడువు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. వచ్చే నెల 20 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనుండగా.. 9వ తేదీ నాటికి 1.93 లక్షల మందే దరఖాస్తు చేశారు. బుధవారం ఒక్క రోజే గడువు ఉండడంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 2 లక్షలకు మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన ఈ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేశారు. దీంతో పోలిస్తే ఈసారి దాదాపు 91 వేల దరఖాస్తులు తగ్గే అవకాశం ఉంది.

ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి టెట్‌ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షల మంది టెట్‌లో అర్హత సాధించారు. ఉపాధ్యాయ కొలువు ఎంపికలకు నిర్వహించే డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో కొత్తగా డీఈడీ, బీఈడీ పాసైన అభ్యర్థులతోపాటు గతంలో టెట్‌ పాసైన వారు సైతం మార్కులు పెంచుకునేందుకు ఈ పరీక్ష నిర్వహించిన ప్రతిసారీ రాస్తుంటారు. ఈసారి మాత్రం అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోయింది.


డీఎస్సీపైనే అభ్యర్థుల దృష్టి!

 

  • గత ఏడాది వరకు టెట్‌లో రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే దరఖాస్తు రుసుం ఉండేది. ఈసారి ఒక్కో పేపర్‌కు దరఖాస్తు రుసుమును     రూ.వెయ్యికి పెంచారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళన నిర్వహించినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.    ఈ క్రమంలో.. గతంలో గరిష్ఠ మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేయలేదని భావిస్తున్నారు.
  • వాస్తవానికి ఈసారి డీఎస్సీలో ఉద్యోగాల సంఖ్య 11,062కి పెరగడంతో.. టెట్‌ రాసేవారి సంఖ్య కూడా అధికంగా ఉండొచ్చని భావించారు. దీనికితోడు ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్‌ తప్పనిసరి అని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. వారు సైతం దరఖాస్తు చేస్తారని ఆశించారు.
  • అయితే తమకు ప్రత్యేక టెట్‌ జరపాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేయడం, మరికొన్ని సందేహాలు లేవనెత్తడం... వీటిపై జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నుంచి స్పష్టత రాకపోవడం తదితర కారణాలతో స్వల్ప సంఖ్యలోనే వారు దరఖాస్తు చేసినట్లు సమాచారం.
  • అన్నింటికీ మించి అభ్యర్థులు ఇప్పటికే డీఎస్సీకి దరఖాస్తు చేసి సిద్ధమవుతున్నారు. వారు మళ్లీ టెట్‌ రాయడం కంటే డీఎస్సీకి సన్నద్ధం కావడం మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్లు డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం నేతలు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని