తాగునీటికి ఆర్థిక సంఘం నిధులు

రాష్ట్రంలో గడిచిన అక్టోబరు నుంచి వర్షాలు లేకపోవడంతోపాటు గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

Published : 10 Apr 2024 02:34 IST

 వినియోగంలో కలెక్టర్లకు వెసులుబాటు
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గడిచిన అక్టోబరు నుంచి వర్షాలు లేకపోవడంతోపాటు గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అవసరమైన నిధులను అధికారులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఆర్థికసంఘం నిధులను వినియోగించుకోవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో ప్రధానంగా 10 పురపాలికలు, కరీంనగర్‌, ఖమ్మం కార్పొరేషన్ల పరిధిలోనే తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామని, ఆయా ప్రాంతాలకు ఇప్పటికే నాగార్జునసాగర్‌తోపాటు ఉదయ సముద్రం, మిడ్‌మానేరుల నుంచి నీటిని విడుదల చేశామని వివరించింది.

67 పట్టణాల్లో నీటి కొరత

‘రాష్ట్రంలో సాధారణ రోజుల్లో 1,398 ఎంఎల్‌డీల తాగునీరు అవసరం కాగా.. ప్రస్తుతం 1,371 ఎంఎల్‌డీలు(మిలియన్స్‌ ఆఫ్‌ లీటర్‌ పర్‌ డే) అందుబాటులో ఉన్నాయి. తలసరి నీటి అవసరాన్ని పరిగణనలోకి తీసుకుంటే 27 పట్టణాల్లో ప్రస్తుతం 135 ఎల్‌పీసీడీ(లీటర్‌ పర్‌ పర్సన్‌ పర్‌ డే) కన్నా ఎక్కువ మొత్తంలో సరఫరా అవుతున్నాయి. 48 పట్టణాల్లో 135 నుంచి 100 ఎల్‌పీసీడీ మధ్య అందుతున్నాయి. అంతకంటే తక్కువగా సరఫరా అవుతున్న 67 పట్టణాలను సమస్యాత్మకంగా గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి సరఫరా చేయాలని నిర్ణయించాం. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేదు. దాదాపు అన్ని చోట్లా వంద ఎల్‌పీసీడీ నీటి సరఫరా జరుగుతోంది.

ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటి వరకు

అత్యవసరమైన పక్షంలో జిల్లా కలెక్టర్లు 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా తాగునీటి సరఫరాకు వినియోగించుకునే వెసులుబాటును కల్పించాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.కోటి వరకు వినియోగించుకోవచ్చు. తాగునీటి కోసం ఇప్పటికే అన్ని జిల్లాలకు కలిపి రూ.వంద కోట్ల వరకు విడుదల చేశాం. తాగునీటి పరిస్థితులపై రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 10 మంది సీనియర్‌ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాం’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని