23 వరకు కవిత జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు

దిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది.

Updated : 10 Apr 2024 05:37 IST

ఈ కేసులో తన పాత్రలేదంటూ.. 4 పేజీల లేఖ విడుదల చేసిన ఎమ్మెల్సీ

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. ఆమెకు ఇదివరకు ఇచ్చిన కస్టడీ గడువు మంగళవారంతో ముగియడంతో పోలీసులు ఆమెను న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతున్నందున ఆమె బయట ఉంటే సాక్షులపైనా, దర్యాప్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, అందువల్ల మరో 14 రోజులు జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. అయితే ఆ విజ్ఞప్తి పట్ల కవిత తరఫు న్యాయవాది నితేష్‌రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ వద్ద ప్రస్తుతం కొత్తగా ఆధారాలేవీ లేవని చెప్పారు. ఈ సందర్భంగా కవిత తన అభిప్రాయాలను చెప్పుకోవడానికి అనుమతి ఇవ్వాలని నితేష్‌రాణా న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. అయితే ఆమె నేరుగా కోర్టులో మాట్లాడేందుకు న్యాయమూర్తి అనుమతించలేదు. ఏదైనా ఉంటే లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు. పోలీసులు కవితను కోర్టుకు తీసుకొస్తున్నప్పుడు ఆమె ‘జై తెలంగాణ’ నినాదం చేశారు. బయటకు వెళ్తున్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇదో తప్పుడు కేసు, కోర్టులో చెప్పాల్సింది చెప్పాను’’ అని పేర్కొన్నారు. అంతకుముందు ఆమె న్యాయమూర్తి అనుమతితో తన భర్త అనిల్‌కుమార్‌, మామ రామ్‌కిషన్‌రావులతో మాట్లాడారు.

నాలుగు పేజీల లేఖ విడుదల

కోర్టు విచారణ అనంతరం కవిత తరఫు న్యాయవాదులు మీడియాకు నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. కోర్టులో న్యాయమూర్తికి చెప్పడానికి ఆమె రాసుకొచ్చినట్లు చెబుతున్న లేఖను బహిర్గతం చేశారు. ‘‘ఈ కేసులో నాకు ఎలాంటి పాత్రలేదు. ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందలేదు. నేనో బాధితురాలిని. రెండున్నరేళ్లుగా ఈడీ/సీబీఐ దర్యాప్తు అంతులేకుండా సాగుతోంది. అంతిమంగా అది మీడియా ట్రయల్‌గా మారింది. నన్ను లక్ష్యంగా చేసుకొని నా వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. నా ఫోన్‌ నంబర్‌ను టీవీల్లో ప్రదర్శిస్తూ నేరుగా వ్యక్తిగత గోప్యతలోకి చొరబడ్డారు. నేను దర్యాప్తునకు సహకరించాను. బ్యాంకు, వ్యాపారాల వివరాలు ఇచ్చాను. మొబైల్‌ ఫోన్లన్నింటినీ దర్యాప్తుసంస్థకు సమర్పించి విచారణకు సహకరించినా వాటిని ధ్వంసం చేసినట్లు నాపై బురదజల్లారు. గత రెండున్నరేళ్ల దర్యాప్తు సమయంలో సీబీఐ, ఈడీలు ఎన్నోసార్లు భౌతికంగా, మానసికంగా వేధించడంతోపాటు, దురుసుగా వ్యవహరించి బెదిరించాయి. ఈ మొత్తం కేసు వాంగ్మూలాలపైనే ఆధారపడి ఉంది. ఇందులో ఎక్కడా మనీ ట్రయల్‌ కనిపించలేదని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాయే చెప్పారు. ఈ కేసులో అవినీతికి ఆధారాలు లేవు. ఈడీ అంతిమంగా మార్చి 15న నన్ను అరెస్ట్‌ చేసింది. నేను సాక్షులపై ప్రభావం చూపుతున్నట్లు ఆరోపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? నాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు హామీపత్రం ఇచ్చిన తర్వాత కూడా నన్ను అరెస్ట్‌ చేశారు. ఈ రోజుల్లో 95% ఈడీ, సీబీఐ కేసులు ప్రతిపక్ష నాయకులపైనే నమోదు చేస్తున్నారు. నిందితులు భాజపాలో చేరిన వెంటనే వాటిని అర్ధాంతరంగా నిలిపేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకులు ఎంతో ఆశతో ఉపశమనం కోసం న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నారు. నేను ఇకముందు కూడా విచారణకు సహకరిస్తాను. నేను బాధ్యతగల తల్లిని. ఇది నా జీవితంలో ముఖ్యమైన కోణం. నేను ఉన్నత అర్హతలున్న వ్యక్తిని. అందువల్ల బోర్డు పరీక్షలకు కుమారుడిని సిద్ధం చేయడంలో నా పాత్రను అర్థం చేసుకోండి. తల్లిపాత్రను ఎవ్వరూ భర్తీ చేయలేరు. నేను దగ్గర లేకపోవడం అబ్బాయిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నాను. అందువల్ల నా బెయిల్‌ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.


కవితను ప్రశ్నించిన సీబీఐ

దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన కవితను సీబీఐ తిహాడ్‌ జైలులో ప్రశ్నించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శనివారం సీబీఐ అధికారులు  జైలుకు వెళ్లి ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని