స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాలకు వెంటనే రసీదులు..

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలో ఓటర్లు సుమారు మూడు లక్షల మంది పెరిగారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ మంగళవారం ‘ఈనాడు-ఈటీవీ’తో చెప్పారు.

Updated : 10 Apr 2024 08:17 IST

మరుసటి రోజు విచారణలో ఆధారాలు చూపిస్తే తిరిగి అప్పగింత
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పది లక్షల బోగస్‌ ఓట్లు తొలగించాం
‘ఈనాడు-ఈటీవీ’తో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలో ఓటర్లు సుమారు మూడు లక్షల మంది పెరిగారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ మంగళవారం ‘ఈనాడు-ఈటీవీ’తో చెప్పారు. లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గాలకు ఈవీఎంలను కేటాయించామని, సిబ్బందికి రెండు దఫాల శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

  • తనిఖీల్లో.. నగదు, బంగారం, ఆభరణాలు తదితరాలు స్వాధీనం చేసుకుంటే.. వెంటనే అధికారులు రసీదు ఇస్తారు. మరుసటి రోజు నిర్వహించే విచారణలో వాటికి సంబంధించిన అధికారిక పత్రాలను అందజేస్తే.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వాటిని తిరిగి ఇచ్చేస్తారు.
  • అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరవాత నుంచి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన రోజు వరకు సుమారు పది లక్షల బోగస్‌ ఓట్లు తొలగించాం. మరణించిన వారి పేర్లను తొలగించడంతోపాటు జాబితాలో పేర్కొన్న చిరునామాలో నివాసం ఉండని వారి ఓట్లనూ తొలగించాం. ఇలా తొలగించిన ఓట్లలో అధిక శాతం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఉన్నాయి.
  • ప్రజలు ఈ నెల 15వ తేదీ వరకు ఓటు హక్కుకు నమోదు చేసుకోవచ్చు.
  • రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసే వరకు పనిచేస్తాయి. ఈ బృందాల నిఘా అసెంబ్లీ ఎన్నికలకు ఉపయుక్తంగా ఉంది.
  • అసెంబ్లీ ఎన్నికల్లో రూ.800 కోట్ల వరకు నగదు తదితరాలను స్వాధీనం చేసుకున్నాం. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి సుమారు రూ.వంద కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నాం.
  • ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 860 పోలీసు కేసులు నమోదు చేశాం.

సి-విజిల్‌ యాప్‌ను ప్రజలు ఉపయోగించాలి

ఎన్నికల్లో ప్రలోభాలు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజా సహకారాన్ని ఎన్నికల సంఘం ఆహ్వానిస్తోంది. ప్రజలు తమ దృష్టికి వచ్చిన అక్రమాలు, ప్రలోభాల ఫొటోలు తీసి సి-విజిల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయవచ్చు. తక్షణం మా బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని