కవితకు 23 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ

దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను ఈనెల 23 వరకు జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఆదేశించింది.

Published : 16 Apr 2024 04:32 IST

ఆమె మీడియాతో మాట్లాడటంపై న్యాయమూర్తి అభ్యంతరం

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను ఈనెల 23 వరకు జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కవితకు విధించిన సీబీఐ కస్టడీ సోమవారంతో ముగియడంతో అధికారులు ఉదయం 10 గంటలకు ఆమెను న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరిచారు. ‘‘ప్రస్తుతానికి ఆమెను కస్టడీలో విచారించాల్సిన అవసరంలేదు. ప్రముఖ రాజకీయ నాయకురాలు కావడం, తీవ్ర ప్రభావం చూపే శక్తిసామర్థ్యాలు ఉండటంవల్ల ఆమె సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. అందువల్ల ఈకేసు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిందితురాలిని 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి పంపండి’ అని సీబీఐ న్యాయవాది న్యాయమూర్తికి విజ్ఞప్తిచేశారు. కవిత తరఫున హాజరైన న్యాయవాది నితేష్‌రాణా సీబీఐ వాదనలను తోసిపుచ్చారు. కవిత సమాధానాలను దాటవేస్తున్నారని సీబీఐ పేర్కొంటోందని..పంకజ్‌బన్సల్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిందితులు తమకు ఇష్టం వచ్చినట్లు సమాధానం చెప్పే హక్కు ఉందని, దర్యాప్తు సంస్థలు కోరినట్లుగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి కవితను ఈ నెల 23వరకు జ్యుడిషియల్‌ కస్టడీకి పంపుతున్నట్లు చెప్పారు. కవిత కోర్టు హాల్‌ నుంచి బయటికొస్తూ ‘‘బయట భాజపా వాళ్లు మాట్లాడిన విషయాలనే... లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారు’’ అంటూ వెళ్లిపోయారు.

బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 22కి వాయిదా

కోర్టు జ్యుడిషియల్‌ కస్టడీ విధించిన వెంటనే కవిత బెయిల్‌కోసం దరఖాస్తుచేశారు. దానిపై ఈ నెల 20లోపు కౌంటర్‌ దాఖలుచేయాలని న్యాయమూర్తి కావేరి బవేజా సీబీఐని ఆదేశించారు. విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.

న్యాయస్థానం ఆవరణలో అలా మాట్లాడటం సరికాదు..

కోర్టు ప్రాంగణంలో కవిత మీడియాతో మాట్లాడటంపై ఆమె న్యాయవాది మోహిత్‌రావును న్యాయమూర్తి కావేరి బవేజా ప్రశ్నించారు. ఆమె సొంతంగా మాట్లాడలేదని, మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇచ్చారని ఆయన చెప్పగా న్యాయమూర్తి అందుకు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆమె ఏం చెప్పాలనుకున్నా లిఖితపూర్వకంగా కోర్టుకు చెప్పాలి తప్పితే న్యాయస్థానం ఆవరణలో ఇలా మాట్లాడటం మంచిదికాదని చెప్పారు. ఈ సూచనలను తాను కవిత దృష్టికి తీసుకెళ్తానని మోహిత్‌రావు న్యాయమూర్తికి హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని