close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాలుగంతస్తుల నుంచి నడిరోడ్డు మీదకు...

నాలుగంతస్తుల నుంచి నడిరోడ్డు మీదకు...

‘ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోయే ప్రపంచమిది. హిట్‌ వచ్చినప్పుడు ఎగిరెగిరి ఆనందపడటం, ఫ్లాప్‌ పలకరించగానే ఉసూరుమనడం నాకు తెలియదు. ఫలితం ఏదైనా ఒకలాగే తీసుకుంటా. నాకు తెలిసిందల్లా ఖాళీ లేకుండా పని చేయడం’ అంటారు తేజ. పరిమితమైన బడ్జెట్‌లో కొత్తవాళ్లతో సినిమాలు చేసి బాక్సాఫీసును కళకళలాడించడంలో తేజది ప్రత్యేకమైన బాణీ. దర్శకుడిగా ఆయన ప్రయాణంలో ఘన విజయాలెన్నో చూడటమే కాదు, ప్రేక్షకుల్ని మెప్పించలేని సందర్భాలూ ఉన్నాయి. ఒక దశలో వరుస పరాజయాలు చవి చూసిన తేజ ‘నేనే రాజు.. నేనే మంత్రి’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లనూ అనుభవాల్నీ ఎదుర్కోవడం ఎలాగో జీవితమే తనకు నేర్పిందంటున్న తేజ తన గురించి ఇంకా ఏం చెబుతున్నారంటే...

  చెన్నై, ముంబై, హైదరాబాద్‌... ఈ మూడు నగరాలూ నాకెన్నో పాఠాలు నేర్పాయి. సమయపాలన, క్రమశిక్షణతో పని చేయడం, చెప్పిన సమయానికల్లా పని పూర్తి చేయడం, యజమాని బాగుండాలనుకోవడం... ఇవన్నీ చెన్నై నగరం నేర్పింది. చేసే పనిలో కచ్చితత్వం తెచ్చేందుకు ఎంతైనా శ్రమించాలనే విషయాన్ని ముంబై నేర్పింది... అక్కడ నువ్వు పెద్దోడివా చిన్నోడివా అని చూడరు. నీ పనితనమే నీకు గుర్తింపునిస్తుంది. ఈ రెండు నగరాలకీ భిన్నం హైదరాబాద్‌. ఎంతసేపూ పక్కోడు ఏం చేస్తున్నాడు, వాడు పైకి వెళ్తుంటే ఎలా లాగేయొచ్చు అని ఆలోచించే వాళ్ళమధ్య కూడా ఎలా నెగ్గుకు రావచ్చో భాగ్యనగరం నేర్పింది. వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఈ మూడు నగరాలతోనే నాకు ఎక్కువ అనుబంధం.

చెన్నై... ఎత్తుపల్లాల బతుకు
60వ దశకంలో.. చెన్నైలో బాగా కలిగిన కుటుంబాల్లో మాదీ ఒకటి. నాన్న జె.బి.కె.చౌదరి కొరియా, జపాన్‌లకు ఎగుమతుల వ్యాపారం చేసేవారు. బెరైటీస్‌, మైకా లాంటి ఖనిజాలతోపాటు తిరుమల నుంచి జుట్టును విదేశాలకు ఎగుమతి చేసేవారు. నాలుగంతస్తుల పేద్ద ఇల్లు మాది. బాలగురుకుల్‌ స్కూల్లో చదివేవాణ్ని. నేను స్కూల్‌కి వెళ్లేందుకు ప్రత్యేకంగా కారు, డ్రైవర్‌. ఏ రోజు టర్కీ టవల్‌ ఆ రోజు మార్చాల్సిందే. నటి జీవిత, చంద్రబోస్‌ భార్య-కొరియోగ్రాఫర్‌ సుచిత్ర నా క్లాస్‌మేట్స్‌. దర్శకుడు శంకర్‌ నాకు సీనియర్‌. నేను సినిమాకు వెళ్లాలీ అనుకుంటే ఒక వరుసలోని సీట్లన్నీ బుక్‌ చేసేవారు. నల్లులు కుడతాయేమోనని శుభ్రం చేసి టవల్‌ వేసేవారు. ఆ వరుసలో ఆ చివర డ్రైవర్‌, ఈ చివర బట్లర్‌ కూర్చునేవారు. అమ్మ నా చిన్నప్పుడే చనిపోవడంతో నాయనమ్మ పర్వతవర్థనమ్మ పెంచింది నన్ను. ఆమె రామాయణ, మహాభారత, భాగవతాలను కథలుగా చెప్పేది. స్కూల్‌కి వెళ్లేటప్పుడు చెక్క డబ్బాలోని సింధూరాన్ని వెండి వూచతో తీసి నిలువు బొట్టుగా పెట్టేది. ‘నిజం’ చిత్రంలో మహేష్‌బాబుకి నామంపెట్టడానికి నా చిన్నప్పటి ఆ అలవాటే కారణం. ఈ మధ్య ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో హనుమంతుడి పెయింటింగ్‌ కోసం రచయితా, చిత్రకారులు శివశక్తిదత్తా గారిని కలిసినప్పుడు... మహాభారతం ప్రస్తావన తెచ్చి ఓ కాకి కథ చెప్పారు. చిన్నప్పుడు విన్నట్లు అనిపించి ‘సార్‌... ఈ కథ ఎక్కడ విన్నారు?’ అని అడిగాను. ‘మీ నాయనమ్మ దగ్గరే. ఆమె నాకు గురువుతో సమానం’ అన్నారు.

నాన్న వ్యాపారాల్లో బాగా దెబ్బ తినడంతో మా పరిస్థితి తలకిందులైంది. నాలుగంతస్తుల ఇంటి నుంచి నడిరోడ్డు మీదకు వచ్చేయాల్సి వచ్చింది. కొంతకాలం బంధువుల ఇళ్లలో ఉన్నాం. బతుకు పోరాటం మొదలైంది. మా అత్తయ్యవాళ్లింటి దగ్గర్లో సినిమా ఆఫీసులుండేవి. ఆనంద్‌మోహన్‌ అని సినిమా మీడియేటర్‌ ఉండేవారు... ఆయన ఆఫీసులో ఉంటూ టీలు అందించేవాణ్ని. చెన్నైలో అలా చిన్నాచితకా పనులు చాలా చేసేవాణ్ని.

హైదరాబాద్‌... కాస్ట్‌లీ కెమెరామెన్‌
చెన్నై నుంచి హైదరాబాద్‌కి వచ్చేశాక తిరుపతి పిక్చర్స్‌ అనే సినిమా పంపిణీ సంస్థలో చేరాను. సినిమా రిప్రజంటేటివ్‌గా పని చేస్తే రోజుకి రూ.15 ఇచ్చేవారు. అక్కడే పోస్టర్‌ ఇన్‌ఛార్జిగా పని చేశాను. ఆ తరవాత కెమెరా అసిస్టెంట్‌గా షూటింగుల దగ్గరకు కెమెరా మోసుకెళ్లేవాణ్ని. రూ.25 ఇచ్చేవారు. అలా చాలా సినిమా షూటింగులకు తిరిగాను. దర్శకులు టి.కృష్ణగారు చాలా బాగా చూసుకునేవారు. ఆ కృతజ్ఞతతోనే గోపీచంద్‌ను నా సినిమాలో విలన్‌గా తీసుకున్నాను. ఛాయాగ్రాహకులు రవికాంత్‌ నగాయిచ్‌, మహీధర్‌, ఎస్‌.గోపాలరెడ్డిల దగ్గర సహాయకుడిగా పని చేశాను. రాంగోపాల్‌వర్మ పరిచయమయ్యాక, ‘శివ’ సినిమాకు స్క్రిప్టు దశ నుంచి విడుదలయ్యేవరకూ చాలా విభాగాల్లో పని చేశాను. అప్పుడు జీతం నెలకు రూ.15 వందలు. హిట్‌ అవడంతో బోనస్‌గా రూ.10 వేలు ఇచ్చారు. తరవాత క్షణక్షణం సినిమాకు నెలకు రూ.2500 ఇచ్చేవారు. వర్మ తీసిన ‘రాత్రి’తో ఛాయాగ్రాహకుడిగా మారాను. తరవాత అంతం, మనీ సినిమాలకు ఛాయాగ్రహణం అందించాను. వీటికి రూ.5 లక్షలు పారితోషికం అనుకున్నాం... రూ.1.5 లక్షలు ఇచ్చారు. తరవాత ‘రక్షణ’ సినిమాకు రూ.3 లక్షలు తీసుకున్నాను. అప్పటికి తెలుగులో ఓ కెమెరామెన్‌కి అదే అధిక పారితోషికం. అక్కినేని వెంకట్‌ నన్ను చూస్తే ‘కాస్ట్‌లీ కెమెరామెన్‌ వచ్చాడు’ అనేవారు.

ముంబై... తీరిక లేదక్కడ
హైదరాబాద్‌లో తెలుగు, వాటి హిందీ వెర్షన్‌లకు పని చేస్తుండగా బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. తన మిత్రుడు దర్శకత్వం వహించే సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పని చేయాలని అడిగారు. ఆ మిత్రుడు అశుతోష్‌గోవారికర్‌. ఆయన తీసిన ‘బాజీ’తో నా బాలీవుడ్‌ ప్రయాణం మొదలైంది. అక్కడ అసలు తీరికన్నది లేకుండా పని చేశాను. హిందీవాళ్లు తాము అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చే వరకూ రాజీపడరు. అందుకు ఎంత టైమైనా తీసుకుంటారు. అలాగే రాజీలేకుండా పని చేసేవాళ్లంటే బాగా గౌరవిస్తారు. ఆమిర్‌తో స్నేహం పెరగడానికి నా పని తీరే కారణం. ‘గులాం’ సినిమా విషయంలో మా మధ్య కొన్ని విషయాల్లో వాదనలు కూడా జరిగేవి. అందులో కీలకమైన ట్రైన్‌ ఎపిసోడ్‌లో... ‘కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కాదు, ట్రైన్‌ పరుగెడుతుంటే దూకేస్తాను’ అంటారు ఆమిర్‌. ‘చాలా రిస్క్‌ అవుతుంది. వేర్వేరుగా చేద్దాం’ అన్నా ఒప్పుకోలేదు. ‘అయితే మీ ఇంట్లోవాళ్లను పిలిపించి వాళ్లతో మాట్లాడమ’ని చెప్పాన్నేను. చివరకు సీజీ నిపుణుల్ని పిలిపించి గ్రీన్‌మాట్‌ వేసి తీశాం. ఆ సినిమాలోనే ‘ఆతి క్యా ఖండాలా...’ పాట చిత్రీకరణ సమయంలో డ్యాన్స్‌ అసలు బాగోలేదని నేను చెబితే ఆమిర్‌ ఒప్పుకోలేదు. తరవాత రషెస్‌ చూసుకుని నా జడ్జిమెంట్‌ కరెక్టే అని ఒప్పుకుని, గల్లీల్లో డ్యాన్స్‌ చేసే వ్యక్తిని పిలిపించి మళ్లీ తీశారు. అక్కడ ఉండగా ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండేవాణ్ని కాదు. వాణిజ్య ప్రకటనలకూ, మ్యూజిక్‌ వీడియోలకూ ఛాయాగ్రహణం అందించాను. షిప్ట్‌కి రూ.75 వేలు తీసుకునేవాణ్ని.

హిందీ సినిమాలకు ఛాయాగ్రహణం అందిస్తూ తరచూ రామోజీ ఫిల్మ్‌సిటీకి వచ్చేవాణ్ని. ఆ క్రమంలోనే రామోజీరావుగారిని కలుసుకున్నాను. అప్పుడు ‘చిత్రం’ కథ చెబితే నచ్చి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆ సినిమా ప్రీమియర్‌ సమయంలో చాలామందికి నచ్చలేదు. కానీ రామోజీరావుగారికి నచ్చింది. అది ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే.

నాకేం కొత్త కాదు
‘చిత్రం’ తరవాత దర్శకుడిగా బిజీ. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు. ఇక్కడ మన పనితనం మీద దృష్టికంటే పక్కవాళ్లు ఏం చేస్తున్నారన్న ఆరానే ఎక్కువ. కానీ నాకవేమీ పట్టవు. ఎన్నో విజయాలు సాధించాను. అలాగే ఎదురు దెబ్బలూ తగిలాయి. వరుసగా విజయాలున్న సమయంలో ఇంట్లో పైఅంతస్తులో, కింద హాల్లో, ఆఫీసులో నిర్మాతలు నా కోసం వెయిట్‌ చేస్తుండేవారు. ఇక్కడ ప్రతి శుక్రవారం గంటగంటకీ జాతకాలు మారుతుంటాయి. మార్నింగ్‌ షోకి ముందు ఒకలా.. షో పూర్తయ్యాక ఒకలా... మ్యాట్నీ తరవాత మరోలా ఉంటుంది. దాన్నిబట్టే మన చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంటుంది. నేను ఆ విషయాలను ఏ రోజూ తలకెక్కించుకోను. నాలుగంతస్తుల ఇంటి నుంచి నడి రోడ్డు మీదకు వచ్చినవాణ్ని... ఎత్తుపల్లాలు నాకేం కొత్త కాదు. దర్శకత్వం గురించి నీకేం తెలుసు అని అడగకుండా అవకాశం ఇచ్చింది రామోజీరావుగారు. మా అబ్బాయి చనిపోయిన తరవాత సినిమా ఇచ్చింది వి.ఆనందప్రసాద్‌. పరాజయాలు ఉన్నా పట్టించుకోకుండా సినిమా చేయమన్నది సురేష్‌బాబు. కాబట్టి ఈ ముగ్గురు ఎప్పుడు పిలిచి సినిమా చేయమన్నా మారుమాట్లాడకుండా చేస్తాను, అది నా బాధ్యత.

ఆ ముగ్గురి జీవిత చరిత్రలూ...

‘శివ’ సినిమాకి పబ్లిసిటీ ఇన్‌ఛార్జిగా పని చేశాను. అప్పటి వరకూ పోస్టర్లలో టైటిల్‌కి పసుపు రంగు వేసేవారు. నేను ఎరుపు వాడితే... నేషనల్‌ లితో ప్రింటర్స్‌ బాబు అభ్యంతరపెట్టారు. ఎరుపు అయితే ఎవరికీ కనబడదని ఆయన వాదన. అప్పుడు ఆ లోగో మీద పసుపు గీతలు గీయించాను. అలాగే టైటిల్‌లో సైకిల్‌ చెయిన్‌ పట్టుకొని ఉండే చేయి నాగార్జునది కాదు. వెంకట్‌ అక్కినేనిది. టైటిల్‌ మధ్యలో ఉండే నాగ్‌ ఫొటో విక్కీదాదా కోసం తీసింది.

* తెలుగువారిలో ఎవరివైనా జీవిత చరిత్రలను సినిమాగా తీయాలనుకుంటే మొదట ఎన్టీ రామారావుగారిదే తీయాలి... అనుకునేవాణ్ణి. నా అభిమాన నటుడాయన. సైకిల్‌ మీద పాల బిందెలు కట్టుకొని తిరిగి, వెండితెరతోపాటు రాష్ట్రాన్నీ ఏలిన వ్యక్తి. ఈమధ్యనే బాలకృష్ణ పిలిచి ఆ ప్రాజెక్టు అప్పగించారు.

* అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి జీవితాన్నీ సినిమాగా మలచుకోవచ్చు. ఇక పత్రికాధిపతిగా, వాణిజ్యవేత్తగా రామోజీరావుగారు ఎదిగిన క్రమం అత్యంత స్ఫూర్తిదాయకం. మా సినిమావాళ్లకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోను అందించారాయన.

* నాకు పార్టీలూ, పబ్‌లూ నచ్చవు. ప్రతి రోజు తప్పనిసరిగా ఓ సినిమా చూస్తా. కాల్పనిక సాహిత్యమంటే ఇష్టం. పుస్తకాలు బాగా చదువుతాను. ఇంట్లో టీవీ కూడా లేదు. ఇంట్లో అందరం పత్రికలు తప్పనిసరిగా చదువుతాం.

* వెంకటేష్‌తో త్వరలో ఓ సినిమా చేయబోతున్నా.

పరాజయాలు వరుసకట్టినా పెద్దగా బాధపడిపోను. నెగెటివ్‌గా ఆలోచించను. అసలు నా నోటి నుంచి ఎప్పుడూ అమంగళకరమైన మాట రాకుండా చూసుకుంటాను. నేను దేవుణ్ని నమ్మను. కానీ తరచూ రామాయణ, భారత, భాగవతాలు చదువుతాను. వాటిని ఎన్నిసార్లు చదివినా ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త కోణం కనిపిస్తుంటుంది. ఒక్క మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని కనీసం అయిదువేల సినిమా కథలు రాసుకోవచ్చు. అలాగే నాకు కులం పట్టింపు లేదు. అందుకే నా ఇంటి పేరు కూడా తీసేసుకున్నా. మా పిల్లలకీ ఉండదు. నా భార్య వల్లీకి దైవభక్తి ఎక్కువ. ఆమె విశ్వాసాలకు నేనేనాడూ అడ్డుచెప్పను. ఇంట్లో అంతా సహజ ఆహారమే. మొక్కలు పెంచేందుకు కూడా పురుగుల మందు కొట్టదు. ఆవు పేడతో చేసిన ఎరువునే వాడుతుంది. ఆ రోజంతా కంపు కొట్టినా నేనేం మాట్లాడను. మీ పిల్లలు ఏం చదువుతున్నారని ఎవరైనా అడిగితే నేను చెప్పలేను. వాళ్లకు నచ్చింది వాళ్లు చదువుకుంటున్నారు. నేనుగానీ, నా భార్యగానీ ఏమీ ఒత్తిడి చేయం. అబ్బాయి అమితోవ్‌ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నాడు. అమ్మాయి ఐలా ప్లస్‌ వన్‌గానీ, ప్లస్‌ టూగానీ చదువుతోందీ అనుకుంటున్నా. తను పియానో, వయొలిన్‌ బాగా వాయిస్తుంది. స్కూల్లో పేరెంట్స్‌ మీటింగ్స్‌కి కూడా నేను వెళ్లను. ఎందుకంటే సెలబిట్రీ పిల్లలుగా వాళ్లు పెరగడం నాకు ఇష్టం ఉండదు. సాధారణంగా ఇంట్లో భోజనం చేసేటప్పుడు నా సినిమాల చర్చ వస్తుంటుంది. నేను తీయబోయే సినిమా కథ వాళ్లకు నచ్చకపోతే ‘నాన్న నుంచి ఒక ఫ్లాప్‌ రాబోతోంది’ అనేంత స్వేచ్ఛ వాళ్లకు ఉంది. అకడమిక్‌ చదువుల కంటే మంచి కమ్యునికేషన్‌ స్కిల్స్‌ అవసరమని నా అభిప్రాయం. మా చిన్నబాబు చనిపోయినపుడు మానసికంగా చాలా నలిగిపోయాను అనుకుంటారుగానీ... వాడు బతికున్న సమయంలోనే ఎక్కువ ఆందోళనతో ఉండేవాణ్ని. పుట్టిన తరవాత ఆసుపత్రిలో చేసిన పొరపాటువల్ల గుటక వేయడంలో, వూపిరి తీసుకోవడంలో సమస్యలు వచ్చాయి. ఎన్నో దేశాల్లో వైద్యం చేయించాను. అయినా ఫలితం లేకపోయింది.

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసినవాణ్ని. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నేను తిండికి ఇబ్బందిపడలేదు. ‘నీ చేతిలో వడ్లగింజ ఉంది. అది మన ఇంటి దేవత అన్నపూర్ణాదేవి’ అని నాయనమ్మ చెప్పేది. మా పిల్లల చేతిలోనూ వడ్లగింజ ఉందట. ఇవన్నీ నేను నమ్మను. కాకపోతే ఎలాంటి సమయంలోనైనా సంతోషంగా ఉండేందుకు మాత్రం ప్రయత్నిస్తాను. నా చుట్టూ ఉన్నవాళ్లూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను.

- వట్టికూటి చక్రవర్తి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.