close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాటుకోడి పులుసు బాగా నచ్చింది!

నాటుకోడి పులుసు బాగా నచ్చింది!

మహానుభావుడు, రాజా ది గ్రేట్‌, కేరాఫ్‌ సూర్య, జవాన్‌... 2017 ద్వితీయార్ధంలో వచ్చిన ఈ నాలుగు సినిమాల్లో హీరోలు వేరైనా హీరోయిన్‌ ఒక్కరే. ఆమె... మెహరీన్‌ కౌర్‌ పిర్‌జాదా. వరుస హిట్‌లతో 2017ని టాలీవుడ్‌లో ‘మెహరీన్‌ నామ సంవత్సరం’గా మార్చుకుని 2018లో అడుగుపెడుతున్న సందర్భంగా తన మనసులోని మాటల్ని చెబుతోందిలా...
నవంబరు 5, 2016... ముంబయిలో నా పుట్టినరోజు పార్టీ జరుగుతోంది. ఆ పార్టీని నా ఫ్రెండ్‌ ఏర్పాటుచేసింది. అంత పెద్ద పార్టీ చేసుకునే అర్హత నాకు లేదంటూ ఆ రాత్రి అందరి మధ్యలో ఏడుస్తూ కూర్చున్నా. కొన్నాళ్లుగా నేను దిగాలుగా ఉండటం చూసి, నా మూడ్‌ని మార్చాలని ఫ్రెండ్‌ ఆ పార్టీ ఇస్తోంది. పార్టీకి ఎందుకు అర్హత లేదన్నానంటే... 2016 ఫిబ్రవరిలో విడుదలైన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ పెద్ద హిట్‌ అయింది. కానీ, తర్వాత నాకు ఒక్క అవకాశమూ రాలేదు. పోనీ గుర్తింపు రాలేదా అంటే, అదీ కాదు. మధ్యలో హైదరాబాద్‌ వచ్చినపుడు... ‘మీరు చాలా అందంగా ఉంటారు’, ‘కృష్ణగాడి... సినిమాలో బాగా చేశారు’ అని చాలా మంది చెప్పేవారు. నటించాలన్న కోరికా, చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా అవకాశాలు రాకపోయేసరికి చాలా బాధపడ్డాను. మరోవైపు దేనికైనా కాలం కలిసి రావాలి అనుకునేదాన్ని. ఎప్పుడైనా మనం కోరుకునేదానికన్నా, మనకోసం వేరేవాళ్లు బలంగా కోరుకుంటే అది జరుగుతుందంటారు. నా జీవితంలోనూ అదే జరిగింది. నా స్నేహితులూ, అభిమానులూ, కుటుంబ సభ్యుల ఆశీర్వచనాలూ ఫలించాయి. పుట్టినరోజు పార్టీ చేసుకున్న మర్నాడే తమిళ సినిమా ఆడిషన్స్‌ కోసం పిలుపు వచ్చింది. చెన్నై వెళ్లాను అది ఓకే అయింది. తర్వాత హైదరాబాద్‌ వచ్చి డిసెంబరులో నాలుగు సినిమాలకి సంతకాలు చేశాను. 2017 అంతా నాకు విరామం లేదు, విశ్రాంతి లేదు. పని, ప్రయాణం, నిద్ర... ఆదివారం కూడా సెలవులేదు. ఒకేసారి నాలుగు సినిమాలు చేశాను. అంతలా కష్టపడటానికి కారణం తెలుసుకోవాలనుకుంటే కాలంలో కాస్త వెనక్కి వెళ్లాలి మరి!

అందాల పోటీల నుంచి...
నేను పుట్టింది పంజాబ్‌లోని బఠిండా. తర్వాత మా కుటుంబం దిల్లీకి వలస వెళ్లింది. అక్కడే ప్లస్‌ టూ వరకూ చదువుకున్నాను. స్కూల్‌ రోజుల్లో ఎన్‌సీసీలో చురుగ్గా పాల్గొనేదాన్ని. ‘అడ్వెంచర్‌ అండ్‌ ట్రెకింగ్‌’లో సిల్వర్‌ మెడల్‌ గెల్చుకున్నాను. షూటింగ్‌లోనూ ప్రవేశం ఉంది. భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నాను. కారణం తెలీదుకానీ ఎక్కువగా అబ్బాయిలు పోటీపడే అంశాల్లోనే ఉండేదాన్ని. అల్లరి కూడా ఎక్కువే. అంటే హాని తలపెట్టే అల్లరి కాదు. ఓసారి క్లాస్‌ మధ్యలో ఫ్రెండ్స్‌ ఏదో తుంటరి పనిచేస్తే నవ్వు వచ్చేసింది. టీచర్‌ ఉన్నా నవ్వు ఆపుకోలేకపోయాను. దాంతో క్లాస్‌ నుంచి వారంరోజులపాటు సస్పెండ్‌ అవ్వాల్సి వచ్చింది. నాకు ఆర్ట్స్‌, బయాలజీ అంటే ఆసక్తి. మ్యాథ్స్‌ అంటే మాత్రం చచ్చేంత భయం. ప్లస్‌టూ తర్వాత అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేద్దామని అమెరికా వెళ్లాను. కానీ కొన్ని కారణాలవల్ల అక్కడ కాలేజీలో చేరలేకపోయాను. బంధువుల సలహాతో కెనడాలో చదువుకోవడానికి వెళ్లాను. బిజినెస్‌, ఎకనామిక్స్‌ విభాగంలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో చేరాను. అక్కడ చదువు తప్ప ఇంకేం పనుండేది కాదు. దాంతో బరువు పెరిగి మగరాయుడిలా తయారయ్యాను. దక్షిణాసియా నుంచి వచ్చిన వాళ్లకే ప్రత్యేకమైన ఓ అందాలపోటీ గురించి ఎవరో చెబితే తెలిసింది. అమ్మ కూడా వెళ్లమని ప్రోత్సహించింది. పోటీలో గెలవాలని కాదు, అలాంటి చోటికి వెళ్తే అప్పుడయినా అమ్మాయినని గుర్తుంచుకుని నాజూగ్గా తయారవుతానని ఆమె ఉద్దేశం. అమెరికాలో ఉన్నపుడు ‘7 లెవెన్‌’ రెస్టరెంట్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసేదాన్ని. అక్కడికి వచ్చేవారిలో కొంతమంది... ‘హే నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌... మ్యాగజైన్ల కవర్‌ పేజీపైన ఉండాల్సిన దానివి ఇక్కడెందుకు ఉన్నావ్‌’ అనేవారు. ఆ మాటలు గుర్తొచ్చి అందాల పోటీకి నేనూ సిద్ధమయ్యాను. అనూహ్యంగా ‘మిస్‌ పర్సనాలిటీ సౌత్‌ ఏసియా- కెనడా 2013’ కిరీటం అందుకున్నాను. అదంతా మర్చిపోలేని ప్రయాణం. ఒక టామ్‌బాయ్‌లా ఉన్న నన్ను అక్కడో ఏజెన్సీ సిబ్బంది అందమైన అమ్మాయిలా మార్చగలిగారు. ఆ పోటీల సమయంలో ప్రతి దశలోనూ ప్రేక్షకుల నుంచి ప్రోత్సాహం లభించడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. చదువుకునే రోజుల్లో సునీతా విలియమ్స్‌ని దగ్గరుండి చూసే అవకాశం వచ్చింది. ఆమెని చూశాక ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ అవ్వాలనుకున్నా. అలాగే హాస్పిటల్‌కి వెళ్లినపుడు డాక్టర్‌, మరో సందర్భంలో వ్యాపారవేత్త... ఇలా చాలా చాలా అనుకునేదాన్ని. కానీ అందాల పోటీల్లో గెల్చిన తర్వాత మాత్రం సినిమాలే భవిష్యత్తని నిర్ణయించుకున్నాను. కెనడాలో ఉండగానే రెండు వాణిజ్య ప్రకటనలకు పనిచేశాను. భారత్‌లో అయితే మంచి అవకాశాలు ఉంటాయనిపించి చదువు మధ్యలో వదిలేసి ఇక్కడికి వచ్చేశాను. వచ్చిన ఆరు నెలల వ్యవధిలో డవ్‌, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ... ఇలా 40 వరకూ ప్రకటనలకు పనిచేశాను.

టాలీవుడ్‌లో అవకాశం
మోడల్‌గా ర్యాంప్‌పైన నడిచే తరహా శరీరాకృతి కాదు నాది. అందుకే సినిమాల్లోనే చేయాలని ఉండేది. వాణిజ్య ప్రకటనల్లో నన్ను చూసిన దర్శకుడు హను రాఘవపూడి ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ కోసం ఆడిషన్స్‌కి హైదరాబాద్‌ పిలిచారు. రెండ్రోజుల ఆడిషన్‌ తర్వాత ఎంపిక చేశారు. అందులో హీరో నాని... అంతకంటే శుభారంభం ఎవరికి వస్తుంది. అయితో ఇక్కడో చిక్కుంది. నానీ లాంటి సహజ నటుడి పక్కన నటించి మెప్పించడం అంత సులభం కాదు. కానీ ఆ పరీక్ష బాగానే పాసయ్యాను. అందులో చేసిన మహాలక్ష్మి పాత్ర తెలుగు ప్రేక్షకులకు నన్ను దగ్గర చేసింది. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘చెప్పానా... నేను చెప్పానా... నీకు చెప్పానా’ డైలాగుతో బాగా గుర్తింపు వచ్చింది. ఆ సినిమాకంటే ముందే బాలీవుడ్‌లో ‘ఫిల్లౌరీ’ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లాను. వివిధ దశల్లో ఆడిషన్స్‌ తర్వాత నన్ను ఎంపికచేశారు. అనుష్క శర్మ నిర్మించి, నటించిన సినిమా అది. అలా బాలీవుడ్‌లోనూ కనిపించాను. ఆ సినిమా సమయంలో అనుష్క నన్ను సొంత చెల్లిలా చూసుకుంది. సెట్స్‌లో నాకు సలహాలూ, సూచనలూ ఇస్తూ ధైర్యాన్ని నింపేది. ఆ సినిమా కూడా హిట్‌. తర్వాత చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి కానీ అవకాశాలు రావడంలేదు. సినిమాల గురించి ఎన్నో కలలు కన్నాను. అవన్నీ కలగానే మిగిలిపోతాయేమోననిపించేది. 2016లో నా పుట్టినరోజు చేసుకున్న తర్వాత రోజే తమిళ దర్శకుడు సుశీందిరన్‌ నుంచి పిలుపు వచ్చింది. చెన్నై వెళ్లి కలిశాను. రెండ్రోజుల ఆడిషన్స్‌ తర్వాత తమిళంలో ‘నెంజిల్‌ తునివిరుందల్‌’ సినిమాకి సంతకం చేశాను. ఆ సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత డిసెంబరులో హైదరాబాద్‌ వచ్చి నాలుగు సినిమాలకు సంతకం చేశాను. ఏడాది తిరిగేసరికి అవన్నీ రిలీజయ్యాయి.

విరామం లేదు
‘అందరికీ 24 గంటలే ఉంటాయి. ఆ సమయాన్ని నువ్వెలా ఉపయోగించుకుంటున్నావన్నది ముఖ్యం’ అని అమ్మ చెప్పేది. రోజూ ఉదయం నిద్రలేవగానే నాకు ఆ మాటలే గుర్తొస్తాయి. ఖాళీగా ఉండటం నచ్చదు. నా చేతిలో ఉన్న పనిని వంద శాతం అంకితభావంతో చేస్తాను. అలాగని వచ్చిన ప్రతి సినిమాకీ ఓకే చెప్పను. ప్రేక్షకుల కోణంలో కథని వింటాను. నచ్చితేనే ఓకే చెబుతాను. సెప్టెంబరులో వచ్చిన ‘మహానుభావుడు’ ఈ ఏడాది నా మొదటి సినిమా. అది బ్లాక్‌బస్టర్‌. తర్వాత వచ్చిన ‘రాజా ది గ్రేట్‌’ నా కెరీర్‌లోనే పెద్ద హిట్‌. ఇంకా కేరాఫ్‌ సూర్య (నెంజిల్‌ తునివిరుందల్‌), జవాన్‌లు కూడా బాగా ఆడాయి. ఇప్పుడు గోపీచంద్‌ 25వ సినిమాలో నటిస్తున్నాను. మరి కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. ఈ ఒక్క ఏడాదే కాదు కనీసం మరో అయిదారేళ్లు ఇలాగే నన్ను నిరూపించుకోవాలనుకుంటున్నా. టాలీవుడ్‌లో ఈ కాలాన్ని ‘మెహరీన్‌ శకం’గా చెప్పుకునేలా గుర్తింపు తెచ్చుకోవాలనుంది. జీవితంలో ఏదీ సులభంగా దొరకదు. పైకి వచ్చినవారందరూ ఎన్నో ఒడుదొడుకుల్ని చూసినవారే. కష్టాలు ఎదురవుతున్నాయంటే వెనక విజయం దాగుందని అర్థం. అందుకే కష్టపడ్డానికి వెనుకాడను.

దెబ్బ తగిలితే హిట్‌
నా సినిమాలన్నింటిలోనూ షూటింగ్‌ సమయంలో నాకు చిన్నదో పెద్దదో దెబ్బ తగులుతోంది. అలా దెబ్బ తగిలితే ఆ సినిమా హిట్టేనంటారు మా ఫ్రెండ్స్‌. నాకు మూఢనమ్మకాలు లేవు. ఆ దెబ్బలు తగలడానికి కారణం వేరు. సెట్‌లో కుదురుగా ఉండను. మేకప్‌ వేసుకున్నంతసేపే వ్యానిటీ వ్యాన్‌లో ఉంటాను. మళ్లీ సాయంత్రం ప్యాకప్‌ చెప్పిన తర్వాత మేకప్‌ తీయడానికి అందులోకి వెళ్తాను. షూటింగ్‌ జరుగుతున్నంతసేపూ అటూ ఇటూ తిరుగుతుంటాను. చిన్న పిల్లలా గెంతుతుంటాను. అందువల్లే దెబ్బలు.

ఎక్కడున్నా ఇంటి వంటే!
నాకు బయటి తిండికంటే కూడా ఇంటి దగ్గర చేసిన వంటకాలంటేనే ఇష్టం. షూటింగ్‌లో ఉన్నా హోటల్‌లో ఉన్నా అక్కడ వంటవాళ్లకి దాల్‌, రైస్‌, సబ్జీ, చికెన్‌ చేసే విధానాన్ని అమ్మతో ఫోన్లో మాట్లాడించి చెప్పిస్తాను. దాంతో ఎక్కడ ఉన్నా ఇంటివంటకు దూరం కానవసరం ఉండదు. హైదరాబాద్‌వచ్చాక తెలుగు వంటకాలూ అలవాటయ్యాయి. నాటుకోడి పులుసు బాగా నచ్చేసింది. దానికితోడు రాగి సంగటి ఉంటే ఆరోజు ఫుల్‌గా లాగించేస్తాను. ఇంకా సాంబార్‌-రైస్‌ ఇష్టంగా తింటాను. తెలుగు వాళ్లు కారం ఎక్కువగా వేసుకుంటారు. నాకు మాత్రం కాస్త తగ్గించమంటాను.
నవంబరు 5 2017... నా పుట్టినరోజుని న్యూయార్క్‌లో ఫ్రెండ్స్‌తో చాలా గ్రాండ్‌గా చేసుకున్నాను. అదే న్యూయార్క్‌లో అయిదేళ్ల కిందట ‘7 లెవెన్‌’లో పనిచేశాను. అప్పుడు నేనో సాధారణ అమ్మాయిని. ఈసారి మాత్రం నన్ను కొందరు గుర్తు పట్టగలిగారు. నాకు ‘బోలెడంత డబ్బు సంపాదించాల’ని లేదు. ‘మెహరీన్‌ స్థాయికి నేనూ వెళ్లాలి’ అని కొందరైనా నన్ను ఆదర్శంగా తీసుకునే స్థాయికి చేరుకోవాలనేదే నా లక్ష్యం.

తమ్ముడూ నటుడే

ట్రావెలింగ్‌ బాగా ఇష్టం. అందుకేనేమో సినిమాల్నీ ఎంజాయ్‌ చేయగలుగుతున్నాను. నా ప్రయాణాల్ని ఒంటరిగా, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో... ఇలా ప్లాన్‌ చేస్తుంటాను.
* నా డిజైనర్‌ శ్వేత... నాకు మంచి స్నేహితురాలు. హైదరాబాద్‌లో ఉంటే తనే నాకు తోడు. నన్ను తన చెల్లిలా చూసుకుంటుంది.
* ‘చాలామంది భాష ఇబ్బంది’ కాదా అని అడుగుతారు. కెమెరా ముందు మేం పలికించేది భావోద్వేగాలనే కదా, వాటికి భాషతో సంబంధం లేదు. కానీ తెలుగు చాలా వరకూ నేర్చుకున్నాను.
* ఖాళీ దొరికితే నిద్ర పోతాను. ఎందుకంటే ఒక్కోరోజు అయిదారు గంటలు కూడా నిద్రపోలేను. రోజంతా సెలవు దొరికితే స్నేహితులతో షికారు కెళ్తాను.
* ట్విటర్‌లో నా అభిమానులు ‘మెహ్రీనిజం’ పేరుతో ఒక ఖాతాను పెట్టారు. నాకు సంబంధించిన విషయాల్ని నాకంటే ముందు వాళ్లే పోస్ట్‌ చేస్తుంటారు.
* మా తమ్ముడు ‘గుర్‌ఫతే సింగ్‌’ కూడా మోడల్‌. బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తున్నాడు కూడా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.