close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బాహుబలి జర్నీలో అభిమానులూ భాగమే!

బాహుబలి జర్నీలో అభిమానులూ భాగమే!

బాహుబలి... కేవలం తెలుగువారే కాదు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఇప్పుడీ సినిమా గురించి చర్చిస్తున్నారు. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌ సినిమాను తెరకెక్కించడంలో కీలక వ్యక్తులు ఆర్కా మీడియా వ్యవస్థాపకులైన దేవినేని ప్రసాద్‌ (ప్రెసిడెంట్‌), యార్లగడ్డ శోభనాద్రి (సీయీవో). ఇంజినీరింగ్‌ చదివిన వీరిద్దరూ అనుకోకుండా సినిమా నిర్మాణంలో అడుగుపెట్టడం నుంచి దక్షిణాదిలోనే భారీ బడ్జెట్‌ సినిమా నిర్మాతలుగా నిలబడటం వరకూ చేసిన జర్నీ గురించి చెబుతున్నారిలా...
ప్రసాద్‌...
మా ప్రయాణాన్ని ఆర్కా మీడియా స్థాపనకు ముందు, తర్వాతగా విభజించాలి. ఆర్కాకు ముందు వరకూ మా ఇద్దరి ప్రయాణాలు వేరు. ప్రముఖ దర్శకులు కె.ఎస్‌.ప్రకాశరావుగారు నాకు తాతగారు. కె.రాఘవేంద్రరావు గారు మేనమామ. మా నాన్నగారు అప్పారావు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అమ్మ స్వతంత్ర. నాన్నది కృష్ణా జిల్లా. 1950ల్లోనే ఇంజినీరింగ్‌ చేశారు. నాన్న ఉద్యోగరీత్యా గోవా, ముంబయి, చెన్నై, విశాఖపట్నంలలో పనిచేశారు. అన్నయ్య వెంకట్‌, నేనూ అమ్మానాన్నలతోపాటు ఆయా వూళ్లు వెళ్తూ చదువుకున్నాం. మా చదువులో ఎక్కువ భాగం గోవాలో సాగింది. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో చెన్నైలోని తాతగారింటికి వెళ్లేవాళ్లం. అక్కడ మావయ్యతోపాటు వెళ్లి సినిమా షూటింగ్‌లు చూసేవాళ్లం. అయితే నాన్న మాత్రం అన్నయ్యకుగానీ నాకుగానీ సినిమాలవైపు వెళ్లే ఆలోచన రానివ్వలేదు. చదువులపైనే దృష్టి పెట్టమని చెప్పేవారు. అన్నయ్య ప్రస్తుతం అమెరికాలో కార్డియాలజిస్టుగా స్థిరపడ్డాడు. నాన్న వైజాగ్‌లో ఉన్నపుడు రిటైరయ్యారు. అప్పుడు మా కుటుంబమూ అక్కడే సెటిల్‌ అయ్యింది. గోవాలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. వైజాగ్‌లో ఉండగా రొయ్యల ఎగుమతి వ్యాపారం మొదలుపెట్టాను. తర్వాత కోస్తాంధ్రలో చాలాచోట్ల టైర్ల పంపిణీ వ్యాపారంలో అడుగుపెట్టాను. ఇప్పటికీ టైర్ల వ్యాపారంలో కొనసాగుతున్నాను. కొత్త అవకాశాలకోసం 2000 సంవత్సరంలో హైదరాబాద్‌ వచ్చాను. రాఘవేంద్రరావు గారబ్బాయి ప్రకాశ్‌ కూడా ఇంజినీరింగ్‌ చేశాడు. ఇద్దరమూ కలిసి మీడియా రంగంలో ఏదైనా చేయాలనుకున్నాం. కానీ ఏ ఒక్క విషయంపైనా ఫైనల్‌ కాలేకపోయాం. అదే సమయంలో మావయ్య ఆర్‌.కె. టెలీ ఫిల్మ్స్‌ బాధ్యతలు చూసుకునేవాళ్లు కావాలనంటే ఆ బాధ్యతలు కొన్నాళ్లు చూసుకున్నాను.

శోభు...
మా సొంతూరు గుడివాడ దగ్గర పెదపారుపూడి. నాన్న వెంకటేశ్వర్రావు. అమ్మ ధనలక్ష్మి. మాది వ్యవసాయ కుటుంబం. అమ్మనాన్నలకు ఒక్కణ్నే సంతానం. నాన్న ఎం.కామ్‌. చేశారు. అన్నదమ్ములు ఇంజినీర్లూ, డాక్టర్లుగా వేర్వేరు చోట్ల స్థిరపడినా నాన్న వ్యవసాయంపైన ఇష్టంతో వూళ్లొనే ఉండిపోయారు. నేను వైజాగ్‌లో మావయ్య జగన్నాథరావు గారి ఇంట్లో ఉండి చదువుకున్నాను. అక్కడ టింపనీ స్కూల్లో పదో తరగతి వరకూ చదివాను. ఇంటర్మీడియెట్‌ విజయవాడ గౌతమి కాలేజీలో చదివాను. ఇంజినీరింగ్‌ (సివిల్‌-ఎన్విరాన్మెంటల్‌) ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో చేశాను. ఇంజినీరింగ్‌ తర్వాత 1992లో అమెరికా వెళ్లి పర్యావరణ విభాగంలో మాస్టర్స్‌ చేశాను. తర్వాత రెండేళ్లు కాలిఫోర్నియా ఎయిర్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో పనిచేశాను. 1996లో ఇండియా తిరిగి వచ్చి నాలుగేళ్లపాటు బంధువుల్లో ఒకరితో కలిసి ఒక ఆహార పదార్థాలకు సంబంధించిన కంపెనీ పెట్టాను. తర్వాత అక్కణ్నుంచి బయటకు వచ్చి 2000లో స్నేహితుడితో కలిసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభించాను. కానీ సరైన ప్రాజెక్టులులేక కంపెనీ మూసేయాల్సి వచ్చింది. రాఘవేంద్రరావు గారి అన్నయ్య కృష్ణమోహన్‌గారి అమ్మాయి లక్ష్మితో నాకు 1997లో పెళ్లి జరిగింది. అప్పట్నుంచి సినిమా ప్రపంచంతో దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రసాద్‌...

ఆర్‌.కె.టెలీ ఫిల్మ్స్‌ బాధ్యతలు చూసుకుంటున్న సందర్భంలో ఏదైనా మీడియా సంస్థ ప్రారంభించి జాతీయ స్థాయిలో పనిచేయమని సూచించారు రాఘవేంద్రరావు గారు. అప్పుడే శోభూ, నేనూ కలిసి ‘ఆర్కా మీడియా’ను ప్రారంభించాం. టీవీ కార్యక్రమాలు, ప్రకటనలు, డాక్యుమెంటరీలు, యానిమేషన్‌ పనుల్ని జాతీయస్థాయిలో చేయాలనే లక్ష్యంతో మొదలుపెట్టాం. అప్పటికి ఆర్‌.కె. టెలీఫిల్మ్స్‌ నిర్మించిన ‘శాంతి నివాసం’ సీరియల్‌ ఈటీవీలో వచ్చింది. రాజమౌళి దాని దర్శకులు. రామోజీరావుగారు, బాపినీడుగారు శాంతి నివాసం సీరియల్‌ని హిందీలో చేయమన్నారు. అలా మొదటి ప్రాజెక్టు హిందీలో చేశాం. అది ఈటీవీ హిందీ ఛానెళ్లలో ప్రసారమైంది. ఆ సీరియల్‌కోసం ముంబయి వెళ్లి పూర్తిగా ఉత్తరాది నటుల్ని ఎంపికచేసుకున్నాం. దక్షిణాదివారు ఒక హిందీ సీరియల్‌ చేయడం బహుశా అది మొదటిసారి కావొచ్చు.

శోభు...
తర్వాత దశలో తెలుగుతోపాటు ఒరియా, కన్నడ, మరాఠీ, బెంగాలీలలో సీరియళ్లు చేశాం. ఇప్పటివరకూ వివిధ భాషల్లో 30 వరకూ సీరియళ్లు చేశాం. అవన్నీ ఈటీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యాయి, అవుతున్నవీ ఉన్నాయి. ఒకటి జీ టీవీలో ప్రసారమైంది. కొన్ని టీవీ కార్యక్రమాల్నీ నిర్వహించాం. ఒరియా, కన్నడ, తెలుగుల్లో మా సంస్థకు అత్యధిక ఎపిసోడ్ల సీరియల్స్‌ని నిర్మించిన రికార్డు ఉంది. ప్రసాద్‌ తెలుగు సీరియళ్ల బాధ్యతలు చూసుకుంటే నేను కన్నడ విభాగం చూసుకునేవాణ్ని. ఒకవైపు ఆర్కా మీడియా పనులు చూసుకుంటూనే ఆర్‌.కె. బ్యానర్‌లో వచ్చే సినిమాల ప్రొడక్షన్‌లో భాగమయ్యేవాణ్ని. మహేష్‌బాబు ‘బాబి’ సినిమాకి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేశాను. ‘మార్నింగ్‌ రాగ’ ‘పాండురంగడు’ సినిమాల ప్రొడక్షన్‌ పనుల్ని చూశాను. అలా నాకు ప్రొడక్షన్‌పైన ఒక అవగాహన వచ్చింది.

ప్రసాద్‌...
సింహాద్రి సినిమా తర్వాత రాజమౌళిగారికి చిన్న మొత్తం అడ్వాన్స్‌ ఇచ్చి భవిష్యత్తులో సినిమా చేద్దామన్నాం. ‘మగధీర’ తర్వాత ఆ విషయమై సంప్రదిస్తే ‘మర్యాదరామన్న’ కథ వినిపించారు. చేయడానికి సిద్ధమయ్యాం. ఆర్కా బ్యానర్‌పైన నమోదైన మొదటి సినిమా మర్యాదరామన్న. దర్శకుడు క్రిష్‌తో మాకు స్నేహం ఉంది. క్రిష్‌ అప్పటికే గమ్యం తీశాడు. కొత్త కథ ఉంది... అంటే ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఎలాగూ మర్యాదరామన్నతో మాకు రిస్కులేదు కాబట్టి ఇక్కడ రిస్కుకి సిద్ధమయ్యాం. క్రిష్‌ వెళ్లి అనుష్కాకీ, బన్నీకీ కథ చెప్పడం వాళ్లు సరేననడంతో రెండు కోట్లు అనుకున్నది రూ.20 కోట్ల బడ్జెట్‌ అయింది. వేదం, మర్యాదరామన్న... రెండు సినిమాల షూటింగ్‌ సమాంతరంగా జరిగింది. నేను వేదం పనులు చూసుకుంటే శోభు మర్యాదరామన్న పనులు చూసుకునేవాడు. వేదం ముందు రిలీజైంది. మంచి వసూళ్లతోపాటు అవార్డులూ వచ్చాయి. వేదం సమయంలో దర్శకుడూ, హీరోలతో లాభాలపైన వాటా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాం. తెలుగులో అప్పటివరకూ అలా ఎవరూ తీసుకొని ఉండరు. రాజమౌళి కూడా మర్యాద రామన్న సినిమాకి అలానే చేశారు. తర్వాత వేరొక సంస్థతో కలిసి పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘పంజా’ నిర్మించాం. శోభూకి సినిమాలంటే ఆసక్తి. నేను మాత్రం సినిమా నిర్మాణాన్ని వ్యాపారంగానే భావిస్తాను.

శోభు...
ప్రభాస్‌ హీరోగా రాఘవేంద్రరావు గారు నిర్మాతగా రాజమౌళి ఒక సినిమా చేయాలి. అది భారీ బడ్జెట్‌ ప్రాజెక్టు కావడంతో మేమూ భాగమవ్వాలనుకున్నాం. చివరకు మా బ్యానర్‌లోనే తెచ్చేలా ఒప్పందం కుదిరింది. రాజమౌళి, విజయేంద్రప్రసాద్‌గారూ రెండు మూడు సబ్జెక్టులు అనుకొని చివరకు బాహుబలిని ఖరారు చేశారు. ఇది పూర్తిగా వూహాత్మక కథ. భారీ ప్రాజెక్టు కావడంతో ఒక సంవత్సరం పాటు కథ, కథలో ఉండే ప్రతి ఒక్కరి వేషధారణ, ఆయుధాలు, లొకేషన్‌ అన్నీ కంప్యూటర్‌లో డిజైన్‌చేసి ఒక బౌండ్‌ బుక్‌ సిద్ధం చేసుకున్నాం. దాన్ని ఆధారంగా చేసుకొని చిత్రీకరణ చేస్తూ వచ్చాం. ఇప్పటివరకూ ఒక సినిమాకి మా ఇద్దరిలో ఎవరో ఒకరిమే పూర్తి బాధ్యతలు తీసుకుంటూ వచ్చాం. బాహుబలికి మాత్రం నిర్మాణ పనుల్ని నేను నేరుగా పర్యవేక్షిస్తున్నాను. ప్రసాద్‌ బడ్జెట్‌ అంశాల్ని చూస్తున్నాడు. బాహుబలిని మొదట ఒకటే సినిమాగా అనుకున్నాం. మూడున్నరా, నాలుగు గంటల నిడివి రావడంతో రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించాం. ఇప్పటివరకూ ఎవరూ పెట్టని స్థాయిలో గ్రాఫిక్స్‌ పెట్టాం. సౌండ్‌ ఎఫెక్ట్స్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉండాలని బెల్జియంలో డాల్బీ ఎట్మాస్‌ టెక్నాలజీలో చేశాం. దీన్లో సౌండ్‌ 360 డిగ్రీల్లో వస్తుంది.

బాహుబలి తెరపైకి రావడానికి రెండుమూడేళ్లు పడుతుందని ముందే అనుకున్నాం. ఆ జర్నీలో అభిమానుల్నీ తీసుకెళ్తే బావుంటుందని ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫొటోలూ, వీడియోలూ, ఇతర సమచారం పెట్టేవాళ్లం. ప్రచారానికి వేర్వేరు వేదికల్ని ఉపయోగించుకున్నాం. కామికాన్‌లో ఒక చర్చా కార్యక్రమాన్ని పెట్టాం. మద్రాసు ఐఐటీ సారంగ్‌ ఉత్సవంలో కార్యక్రమం ఏర్పాటు చేశాం. బాహుబలి బడ్జెట్‌ రూ.220 కోట్లు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలలో మే 15న రిలీజ్‌ చేయనున్నాం. రెండో భాగం సంక్రాంతికి రావొచ్చు.

ప్రసాద్‌...
మర్యాదరామన్న మాదిరిగానే రాజమౌళి ఈసారి కూడా ప్రాఫిట్‌ షేర్‌కు అంగీకరించడంతో ఎక్కువ మొత్తాన్ని బాహుబలి చిత్రీకరణమీద ఖర్చు చేయగలిగాం. రాజమౌళి, ప్రభాస్‌లు దాదాపు నాలుగేళ్లుగా ఇదే ప్రాజెక్టుమీద పని చేస్తున్నారు. మేం కేవలం సినిమాలకే పరిమితం కాదు. మాకు అనుకూలమైన వారితో మంచి సినిమా చేసే అవకాశం వస్తేనే సినిమాలు తీస్తాం తప్ప సినిమా కోసం ఎవరి వెనకా పరిగెత్తం. మాకు టీవీనే ప్రధాన రంగం. హిందీలో ‘దానవ్‌ హంటర్స్‌’ పేరుతో టీవీ కార్యక్రమాన్ని నిర్మించాం. అది ‘ఎపిక్‌’ ఛానెల్‌లో వస్తోంది. ప్రస్తుతం మావి అయిదు డైలీ సీరియళ్లు నడుస్తున్నాయి. రాఘవేంద్రరావు గారి అమ్మాయి మాధవి భాగస్వామిగా టామీ హిల్‌ఫిగర్‌ షోరూమ్‌ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాం. దేశంలో ఇది పెద్ద షోరూమ్‌. అత్యధిక లాభాలు అందుకున్న షోరూమ్‌గా గతేడాది రికార్డు ఉంది. రాఘవేంద్ర రావుగారికి చెందిన మల్టీప్లెక్స్‌ నిర్వహణనీ మేమే చూసుకుంటున్నాం. ఇంకా ‘రిలీజ్‌డేడాట్‌కామ్‌’ వెబ్‌సైట్‌ని ప్రారంభించాం. దానిద్వారా సినిమా రిలీజైన రోజునే ఇంటర్నెట్‌లో వీక్షకులకు అందించాలనేది మా లక్ష్యం. ఇది ఆచరణలోకి రావడానికి ఇంకా సమయం పట్టొచ్చు. వీటితోపాటు సోషల్‌ మీడియా మార్కెటింగ్‌లో ఉన్నాం.

శోభు...
ప్రసాద్‌దీ, నాదీ భిన్నమైన వ్యక్తిత్వాలు. ప్రసాద్‌ చేసే ప్రాజెక్టులో నేను తల దూర్చను. నేను చేస్తున్న దాంట్లో తాను వేలుపెట్టడు. ఇద్దరికీ ఇంజినీరింగ్‌ నేపథ్యం ఉండటంవల్ల కొత్తదనంవైపు సులభంగా వెళ్లగలుగుతున్నాం. ప్రస్తుతం నేను సినిమా విభాగాన్ని రోజువారీ పర్యవేక్షిస్తాను. తను సీరియళ్లు చూస్తున్నాడు. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయి, భువనేశ్వర్‌లలో దాదాపు ప్రతి రోజూ సీరియల్‌ షూటింగ్‌లు జరుగుతాయి. ఏదైనా సందేహం వస్తే రాఘవేంద్రరావుగారి సలహా తీసుకుంటాం.

ప్రసాద్‌...
అమ్మ దగ్గర కుటుంబ విలువలు నేర్చుకున్నాను. మా బంధువులంతా ఉమ్మడి కుటుంబంలా ఉంటాం. నాన్న సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో జీఎమ్‌ స్థాయికి వెళ్లడం గొప్ప విషయం. ఆయన జీవితంలో చేరుకున్న స్థాయిని చేరుకోగలిగితే నాకు అదే చాలు. చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. నాకు పని మొదటి ప్రాధాన్యం. ఫిట్‌నెస్‌పైన శ్రద్ధ ఎక్కువ. అలాగే సంగీతం అంటే ఇష్టం. ఏడాదిలో రెండుసార్లు ‘టుమారో ల్యాండ్‌’ లాంటి మ్యూజిక్‌ ఫెస్ట్‌లకు స్నేహితులతో వెళ్తుంటాను. అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వాడితో వారాంతాల్లో సమయం గడుపుతాను.

- చంద్రశేఖర్‌ సుంకరి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.