close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విజయం ఎవరికీ ఊరికే రాదు...!

విజయానికి కావాల్సిందేమిటీ...? గొప్ప చదువులా... అదే అయితే ఆయనకి మనదేశం పేరు రాయడం కూడా సరిగ్గా చేతకాదు. పోనీ తాతలిచ్చిన ఆస్తిపాస్తులా అంటే... ఆయన పుట్టింది నిరుపేద కుటుంబంలో! మరి అటు చదువూ, ఇటు వారసత్వపు సంపదా ఏదీలేని కిరణ్‌కుమార్‌ పదివేల కోట్లరూపాయల స్వర్ణ సామ్రాజ్యానికి అధినేత ఎలా అయ్యారూ..? ఆ మాట ఆయన్నే అడిగితే, ఇదిగో ఇలా చెబుతున్నారు...

నేను పుట్టింది నెల్లూరులో. మీకు తెలుసో లేదో... నెల్లూరికి బంగారు నగల తయారీ కేంద్రంగా బాగా పేరుంది. అక్కడ పనిచేయడానికి మా కుటుంబం ఎనభై ఏళ్లకిందట రాజస్థాన్‌ నుంచి వచ్చి స్థిరపడింది. నాన్న మూల్‌చంద్‌ జైన్‌... అమ్మ సుశీలాబాయి. వాళ్లకి ఎనిమిదిమంది సంతానం. నేనే చివరి వాణ్ణి. ఆరుగురు అక్కలూ, ఇద్దరు అన్నలు నాకు. పెద్ద కుటుంబం కావడం వల్ల కటిక దారిద్య్రం తప్పలేదు. నాన్న బంగారు దుకాణాల్లోనూ, బట్టల దుకాణాల్లోనూ పనిచేసేవాడు.  రోజుకి మూడుపూటలా కాదుకదా ఒక్కపూట తిండి దొరకడమే కష్టంగా ఉండేది. నేను చిన్నప్పుడు అందరితోపాటే బడిలో చేరాను కానీ... అదేమిటో నా బుర్రలోకి ఒక్క అక్షరం ముక్క కూడా వెళ్లేది కాదు. ఎలాగోలా ఐదో తరగతి దాకా నెట్టుకువచ్చినా... ఆ తర్వాత మానేశాను. అందుకనే నాన్న ‘మా ఖర్మకొద్దీ పుట్టావురా నువ్వు...!’ అని ఎప్పుడూ తిడుతుండేవాడు. ఇంట్లోని కష్టాల వల్ల కావొచ్చు... తొమ్మిదేళ్లకే నాకు జీవితంపైన ఒక స్పష్టత వచ్చేసింది. అప్పట్లో నా ఈడు వాళ్లు బంగారు దుకాణాల్లో కూలీకి వెళుతుంటే నేను కూడా వాళ్లతో కలిసి వెళ్లడం మొదలుపెట్టాను. మూడేళ్ల తర్వాతే నెల్లూరులో తయారుచేస్తున్న నగల్ని చెన్నై, కేరళల్లోని దుకాణాలకి హోల్‌సేల్‌గా అమ్ముతారని తెలిసింది. నేనూ అలా అమ్మాలనుకున్నా. మరి నగల తయారీకి బంగారం కావాలి కదా! మా ఇంట్లో అమ్మ భద్రంగా దాచుకున్న నాలుగు బంగారు గాజులుండేవి. ఆమెకి చెప్పకుండా వాటిని తీసుకెళ్లి కరిగించి... 65 గ్రాముల్లో కొన్ని జుమ్కీలు చేయించాను. వాటిని తీసుకుని చెన్నై వెళ్లిపోయాను. అక్కడ నేను బాగా విన్న దుకాణం పేరు లలితా జ్యువెలరీసే! ఆ దుకాణం ముందు నిల్చున్నాను. అప్పుడే ఆ సంస్థ ఓనర్‌ కందస్వామి కారు దిగుతున్నారు. ఆయన దగ్గరకెళ్లి నాకొచ్చిన తెలుగు, హిందీ కలగలిపి ‘మీకోసం నగలు అమ్మడానికి నెల్లూరు నుంచి వచ్చాను’ అని చెప్పాను. పన్నెండేళ్ల కుర్రాణ్ణి కదా! ఏదో సరదాపడుతున్నానని అనుకున్నాడేమో ‘సరే చూపించు!’ అన్నారు. ఎర్రటి కాగితంలో చుట్టుకొచ్చిన నా 65 గ్రాముల జుమ్కీలు చూపించాను! రోజూ కిలోల లెక్కన నగలు కొనే ఆయన... వాటిని చూసి నవ్వేశారు. అయినా నన్ను నిరుత్సాహపరచకుండా ‘వీటిని నేను టెస్ట్‌ చేయాలి... రేపు రా!’ అన్నారు. ఇంటికెళితే అందరూ నగల కోసం వెతుకుతూ ఉన్నారు. విషయం చెప్పాను. నాన్న అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అమ్మ మాత్రం ‘ఇంట్లో మిగిలిన చివరి నగలవి... నువ్వే ఆలోచించుకో!’ అని మాత్రమే చెప్పింది. తర్వాతి రోజు ఉదయమే మళ్లీ లలితా జ్యువెలరీస్‌కి వెళ్లాను. నన్ను చూడగానే... ‘ఇలాంటివే మరిన్ని చేసుకురా!’ అని చెబుతూ... 15 వేల రూపాయలు డబ్బులిచ్చారు కందస్వామి. వ్యాపారిగా నా తొలి సంపాదన అది! అందులో వచ్చిన లాభంతో మరికాస్త బంగారం కొన్నాను. 24 గంటలపాటు తిండీ, నిద్రలన్నీ మాని ఈసారి వంద గ్రాముల నగలు తయారుచేసుకుని వెళ్లాను. సాధారణంగా అలా నగలు తయారుచేయడానికి వారం పడుతుంది. నేను రెండోరోజే ఆయన ముందుకి వెళ్లడం చూసి విస్తుపోయారాయన. క్రమంగా 200గ్రా., 300గ్రా., 1000గ్రా... అలా ఆరునెలల్లోనే మూడు కిలోల బంగారు నగలు చేసిచ్చే స్థాయికి చేరుకున్నాను. ఆ తర్వాతి నుంచీ పూర్తిగా నా దగ్గరే నగలు కొనడం ప్రారంభించారు. లలితా జ్యువెలరీస్‌తోపాటూ ఇతర పెద్ద దుకాణాలూ ఆర్డర్‌లు ఇచ్చాయి. దాంతో మొదటి ఏడాదే ఏడు లక్షల రూపాయల వ్యాపారం చేశాను. నేను మేజర్‌ని అయ్యాక అష్రఫ్‌ అనే మిత్రుడి భాగస్వామ్యంతో ‘ఏకే జ్యువెలర్స్‌’ పేరుతో హోల్‌సేల్‌ నగల దుకాణాన్ని రిజిస్టర్‌ చేశాను. ఎనిమిదేళ్లలో దక్షిణాదిలోనే నంబర్‌ వన్‌ హోల్‌సేల్‌ నగల తయారీదారుగా పేరు తెచ్చుకున్నాను. రోజూ కేవలం మూడునాలుగు గంటలే నిద్రపోయేవాణ్ణి. ఆ కఠోర శ్రమే నన్ను పందొమ్మిదేళ్లకే కోటీశ్వరుణ్ణి చేసింది. నా విజయానికి తొలిమెట్టుగా నిలిచిన లక్షణం అదే!

పట్టుదల + సాహసం = కొత్తదనం
1996 ప్రాంతం... లలితా జ్యువెలరీస్‌ సంస్థ యాజమాన్యం నష్టాల్లో కూరుకుపోయింది. ‘అప్పులవాళ్ల వల్ల నేను అరెస్టు కావడమో... దుకాణాన్ని మూసేయడమో!’ రెండేదార్లున్నాయి నాకు అని నా ముందు కన్నీరుపెట్టుకున్నారు దాని యజమాని కందస్వామి. నాకు జీవితాన్నిచ్చిన సంస్థ అలా మునిగిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోను?! అందువల్ల 1999లో నేనే దాన్ని కొన్నాను. కొన్నానే కానీ... ఆరునెలలపాటు నాకేమీ అర్థంకాలేదు. హోల్‌సేల్‌ వ్యాపారిగా గంటకి పది కిలోల నగలు అమ్మే నేను రీటైల్‌లో రోజంతా కష్టపడ్డా కిలో బంగారం నగల్ని అమ్మలేకపోయేవాణ్ణి. నాలుగేళ్లలోనే ‘అసలు ఇటు ఎందుకొచ్చానురా భగవంతుడా!’ అనే పరిస్థితిలో పడ్డాను. అయినాసరే, వెనక్కి తగ్గాలనుకోలేదు. కొత్తగా ఏమేం చేయొచ్చో ఆలోచించడం మొదలుపెట్టాను. నాణ్యత ఉన్నతంగా ఉండాలని దక్షిణాదిలోనే తొలిసారి బీఐఎస్‌ హాల్‌మార్కు నగల్ని పరిచయం చేశాను. వాటిని కూడా హోల్‌సేల్‌ ధరలకే అమ్మేవాణ్ణి. నా లాభాలు తగ్గించుకుని తరుగు తొమ్మిదిశాతం మించకుండా చూసుకున్నాను. ఇవన్నీ వినియోగదారుల్ని ఆకర్షించాయి. లాభాలు పెరిగాయి. కానీ, ‘మాకంటే నువ్వు తక్కువ ధరకు అమ్మడానికి వీల్లేదంటూ’ నగల దుకాణాల సంఘాలు నాకు హుకుం జారీ చేశాయి... పట్టించుకోలేదు. పోటీదారులు నేరుగానే నన్ను బెదిరించారు... భయపడలేదు. నా పని నేను చేసుకుంటూ పోయాను. వాటిని పట్టించుకోని ధైర్యమే నన్ను ఇప్పటిదాకా నడిపిస్తోంది. అదేలేకుంటే జీవితంలో సవాళ్ళని ఎదుర్కోలేం, కొత్తగా ఏదీ సాధించలేం.

అందుకే మోడల్‌ అయ్యాను...
మొదట్లో లలితా జ్యువెలరీస్‌కి నగలు సరఫరా చేయడం కోసం నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. రాత్రి బస్సులకైతే ఛార్జీ రెండు రూపాయలు తక్కువని వాటినే ఎక్కేవాణ్ణి. లక్షలు సంపాదిస్తున్నప్పుడూ అంతే. ‘లలితా జ్యువెలరీస్‌’ని కొన్నాకే చెన్నైకి మకాం మార్చాను. అక్కడ చెన్నైలోని మా ఇంటి నుంచి దుకాణానికి ఆటోలోనే వెళ్లేవాణ్ని. మాకున్న 21 దుకాణాల్లో ఎక్కడా ఛైర్మన్‌గా నాకంటూ ప్రత్యేక క్యాబిన్‌ ఉండదు. మిగతా ఉద్యోగులతోపాటు స్టోర్‌లోనే కూర్చుంటాను. మా సంస్థ ప్రకటనలని స్టార్‌ హీరోల చేత చేయించకపోవడానికీ అదే కారణం. నేనే నటించాలని అనుకున్నాక మేకప్‌లూ, విగ్గులూ వేసుకోమన్నారు చాలామంది. అది కూడా దండగ ఖర్చు అనిపించే నా గుండుతోనే టీవీల ముందుకు వచ్చేశాను. ఇలాంటివాటికి నిరాడంబరత అనే పెద్ద పదం అక్కర్లేదు... ఇదంతా కేవలం వ్యాపార మనుగడ కోసం ఆచితూచి ఖర్చుపెట్టడం మాత్రమే. కానీ జీవితంలో నాకంటూ కొన్ని కలలుండేవి. కారు కొనడం అందులో మొదటిది! లలితా జ్యువెలరీస్‌ని కొన్న చాలా ఏళ్ల తర్వాతే నేను కారుకొన్నాను. ఆ రోజు దానికి పూజ చేసి రాత్రి ఇంటికి తెచ్చాను. పడుకున్నాక రెండుగంటలకి మెలకువ వచ్చింది. ‘నిజంగానే కారు కొన్నానా... అంత గొప్పవాణ్ణయ్యానా?! కాదు ఇదంతా కలేనేమో!’ అనిపించింది. హడావుడిగా లేచి పార్కింగ్‌కి వెళ్లి కారు డోర్‌ తీసి... హారన్‌ మోగించాక కానీ... నాకు తృప్తిగా అనిపించలేదు. ఎంతగా ఆచితూచి ఖర్చుపెట్టినా మన కలలని దూరం చేసుకోకూడదనీ, అవే మన జీవితాల్ని ఉత్సాహంతో నింపుతాయనీ ఆ రోజే తెలుసుకున్నాను.

అనుమానంతో కాదు... ప్రేమతో!
చిన్నప్పుడు స్కూల్లోనే కాదు, ఇప్పటికీ నేను ఇంగ్లిషు అక్షరాలని గుర్తుపెట్టుకోలేను. విదేశాలకి వెళుతున్నప్పుడు ఎయిర్‌పోర్టులో దరఖాస్తు నింపాలికదా... అందులో ‘ఇండియన్‌’ అనే పదాన్ని రాయాలన్నా తడబడతాను. లలితా జ్యువెలరీస్‌ ఇప్పుడు పదివేల కోట్ల రూపాయల సామ్రాజ్యం! అయినా నేను ఇప్పటికీ కరెన్సీ కట్టల్ని సరిగ్గా లెక్కపెట్టలేను. ఎప్పుడు లెక్కపెట్టినా ఎక్కువో తక్కువో వస్తుంది. అయితే లాభనష్టాలని మాత్రం కచ్చితంగా భేరీజు వేయగలను. ఫలానా గంటకి ఇంత బిజినెస్‌ జరుగుతుందని చెప్పగలను. చదువులేని నాకు దేవుడిచ్చిన పెద్ద వరం ఆ ‘మైండ్‌ కాలిక్యులేషన్‌’ అనిపిస్తుంది. అంతకన్నా పెద్ద వరం నా ఉద్యోగులు. నెల్లూరులో ఒకప్పుడు నాతో కలిసి పనిచేసినవాళ్లూ, వాళ్ల పిల్లల్లో 90 శాతం మంది ఇప్పటికీ మా దగ్గర పనిచేస్తున్నారు. నాకు చదువులేకున్నా వాళ్లేం రాస్తున్నారో... ఏ లెక్కలు వేస్తున్నారో అని ఇంకెవరి చేతో తనిఖీ చేయించను. పక్కవారిని అనుమానంతో కాకుండా ప్రేమతో ఆదరిస్తే అద్భుతాలు చేయొచ్చనే విశ్వాసం నా ఉద్యోగుల వల్లే వచ్చింది.

ఉన్నంతలో కొంత...
మేమెక్కడ షోరూమ్‌ తెరిచినా దానికి అనుబంధంగా ఓ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటుచేసి ఆ ప్రాంతంలోని వృత్తిపనివాళ్లకి ఉద్యోగాలు కల్పిస్తాం. ఆ రకంగా మా సంస్థలో వేలాదిమంది ఉద్యోగులున్నారు. మా దుకాణాల్లో పనిచేసేవాళ్లందరికీ మధ్యాహ్నంపూట ఉచితంగా భోజనం పెడతాం. ఇక తనకున్న చిట్టచివరి బంగారు నగలతో నన్ను ఇంతటివాణ్ణి చేసిన అమ్మ గుర్తుగా, ఆమె పెరిగిన రాజస్థాన్‌ బలానా ప్రాంతంలో పెద్ద బడి కట్టించాను. వెయ్యిమంది పిల్లలు ఉచితంగా చదువుకోవచ్చు అక్కడ! వందేళ్లపాటు సున్నం కొట్టాల్సిన అవసరం లేకుండా చలువ రాళ్లతో కట్టించాను. మనం ఎంత ఎత్తుకి ఎదిగినా దానికి ఏదో రకంగా వనరులని ఇచ్చేది ఈ సమాజమే! దానికి తిరిగి ఇవ్వడంలోని సంతృప్తి చిన్నదేం కాదు!

ఇంతా ఎందుకు చెబుతున్నానంటే...
‘గుండుబాస్‌’, ‘గుండాయన’... నా అసలు పేరేమిటో చాలామందికి తెలియకపోయినా తెలుగు టీవీ ప్రేక్షకుల్లో చాలామంది నన్నిలాగే గుర్తుపెట్టుకుంటున్నారు. ఇక నా ప్రకటనలపైన వస్తున్న పేరడీలకైతే లెక్కే లేదు. నిజానికి ఇవన్నీ నాకు కోపం తెప్పించడం లేదు... నేనూ వాటిని భలే ఎంజాయ్‌ చేస్తున్నా! వాటిని తయారుచేసేవాళ్లలో ఎక్కువశాతం యువతేనట. నాపైన ఎంతగా జోకులేసి నవ్వుకున్నా... యువత అన్నాక భవిష్యత్తులో గొప్ప విజయం కోసం కలలు కనకుండా ఉంటారా! ఆ కలలు నెరవేరేందుకు ఎంతోకొంత ఉపయోగపడతాయనే ఆశతోనే వాళ్ల పెద్దన్నగా నా జీవితానుభవాలను ఇలా మీతో పంచుకుంటున్నాను. ‘డబ్బులెవరికీ ఊరికే రావు...’ అంటూ టీవీల్లో కనిపించే నేను ‘విజయం ఎవరికీ ఊరికే రాదు..’ అని యువతకి చెప్పాలనుకుంటున్నా.

అదో కోమాలో ఉంటాను!

నేను ‘లలితా’ సంస్థని కొనడానికి కాస్త ముందే హేమతో పెళ్లైంది. వాళ్లది చెన్నైలో స్థిరపడ్డ రాజస్థానీ కుటుంబం. మాకు ముగ్గురు పిల్లలు. భక్తి, భవ్య అని కవలలు. చిన్నవాడు హీత్‌(దీని అర్థమేంటో వాళ్లమ్మకి మాత్రమే తెలుసు!)కి ఇప్పుడు పందొమ్మిది నెలలు. పిల్లలతో కలిసి ఏడాదికి రెండుమూడుసార్లయినా విదేశాలకి వెళుతుంటాను. అక్కడికెళ్లినా వ్యాపారం గురించే ఆలోచిస్తుంటాను. ‘మీరు ఎక్కడికొచ్చినా బిజినెస్‌ కోమాలో ఉన్నట్టుంటారు... ’ అని విసుక్కుంటారు నా పిల్లలు. నేను వదిలించుకోవాలనుకుంటున్న లక్షణం అదే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.