close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెళ్లి కోసం మూడేళ్లు వేచి చూశాను!


రణ్‌వీర్‌ సింగ్‌...

ఖాన్‌, కపూర్‌ల హవా నడిచే బాలీవుడ్‌లో తన నటనతో బాక్సాఫీసు దగ్గర కొత్త రికార్డుల సృష్టిస్తున్న ‘గల్లీబాయ్‌’. అంతేకాదు, అందాల రాశి దీపికా పదుకొణె మనసు దోచుకున్న లవర్‌బాయ్‌ కూడా.
మరి ఈ గల్లీబాయ్‌, లవర్‌బాయ్‌ తన గురించి ఏం చెబుతున్నాడంటే...


‘సాలా, నేను హీరో అయిపోయాను...’ డిసెంబరులో విడుదలైన ‘సింబా’ ప్రీమియర్‌ చూసిన తర్వాత నేను గట్టిగా అన్న మాటలివి. ‘అదేంటీ ఎప్పుడో హీరో అయ్యారు కదా’ అంటారా... నేను 2010లోనే నటుణ్ని అయ్యాను. హీరో అయింది మాత్రం ‘సింబా’తోనే. అంతకు ముందు చేసిన సినిమాలన్నీ నటుడిగా నాకు పేరు తెచ్చాయి. కానీ ఈ సినిమానే నన్ను బాలీవుడ్‌ మాస్‌ హీరోని చేసింది. అందుకే ‘సింబా’ని థియేటర్లకి వెళ్లి ఓ ఇరవైసార్లయినా చూసుంటాను. అందులో ఉండే కిక్కే వేరు. అభిమానుల ప్రేమను తీసుకోవడమే కాదు, తిరిగివ్వడమూ నాకు తెలుసు. ఇంటర్వెల్‌ సమయంలో వాళ్లని హగ్‌ చేసుకునేవాణ్ని, షేక్‌హ్యాండ్‌లు ఇచ్చేవాణ్ని, సెల్ఫీలు దిగేవాణ్ని.
‘ఇదే కదా నేను కోరుకున్నది’ అనుకుని బయటకు వచ్చేసేవాణ్ని.
నేను సినిమాల్లోకి రావడానికి కారణం అంటే... ముంబయి నగరమే. బాంద్రా వెస్ట్‌ చిత్ర పరిశ్రమకు పేరు. ప్రఖ్యాత బాలీవుడ్‌ తారలు ఉండేది అక్కడే. నేను పుట్టి పెరిగింది మధ్య తరగతి ఉండే బాంద్రా ఈస్ట్‌ ప్రాంతంలో. ఒకే నగరంలో రెండు ప్రపంచాలు. గోవిందా, సల్మాన్‌ లాంటి హీరోల పక్కా మాస్‌ సినిమాల్ని చూసి హీరో కావాలని కలలుగన్నాను. కానీ పెద్దవుతున్నకొద్దీ అదెంత కష్టమో అర్థమవుతుండేది. తల్లిదండ్రులు సినిమాల్లో ఉంటే పిల్లలు సినిమాల్లోకి వెళ్లడం సులభం. అలా లేనివారికి కష్టమే. అందుకని ఆలోచనల్ని మార్చుకున్నాను. అమెరికా వెళ్లి ఇండియానా యూనివర్సిటీలో బీఏ కాపీరైటింగ్‌ విభాగంలో చేరాను. దాంతోపాటు యాక్టింగ్‌ క్లాసులకీ వెళ్లే ఛాన్స్‌ వచ్చింది. యాక్టింగ్‌లోని మజాని ఆస్వాదించేవాణ్ని. అప్పుడే అనిపించింది ‘సినిమాల్లో ప్రయత్నించకపోవడం కరెక్ట్‌ కాదు... అవకాశాలు రావడం, రాకపోవడం తరవాత, ప్రయత్నమైతే చేసి తీరాలి’ అని.
అమెరికా నుంచి వచ్చాక కాపీ రైటర్‌గా ముంబయిలో ఓ యాడ్‌ ఏజెన్సీలో చేస్తూ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’కి ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఆఫీసుకి వెళ్లాను. నిర్మాత ఆదిత్య చోప్రాకి మొదటి సీన్‌లోనే నచ్చేశాను. కానీ డైరెక్టర్‌ మాత్రం నాలుగైదు సీన్లు చేయించాకగాని ఓకే చెప్పలేదు. 2010లో వచ్చిన ఆ సినిమా నాకు శుభారంభాన్ని ఇచ్చింది.

పాత్రల ఎంపిక...
రెండో సినిమా ‘లేడీస్‌ వర్సెస్‌ రిక్కీ బాహల్‌’ కూడా మంచి హిట్‌. కానీ అందులో నా పాత్ర మొదటి సినిమాకి దగ్గరగా ఉంటుంది. ఇలా అయితే అందరిలో నేనూ ఒకణ్ని అయిపోతాననిపించింది. అప్పట్నుంచీ ఏ పాత్ర కూడా అదివరకు చేసిన ఛాయలు కనిపిస్తే చేయను. ఛాలెంజింగ్‌గా ఉండేవే ఎంచుకుంటాను. లుటేరా, రామ్‌లీలా, బాజీరావ్‌ మస్తానీ, బేఫిక్రే, పద్మావత్‌, సింబా, గల్లీబాయ్‌ లాంటి విభిన్నమైన సినిమాలు చేశాను. గతేడాది ‘పద్మావత్‌’ విజయవంతమైన తర్వాత చాలామంది నా నటనను మెచ్చుకున్నారు. తర్వాత ‘సింబా’, ఇప్పుడు ‘గల్లీబాయ్‌’... హ్యాట్రిక్‌ హిట్లు. ‘గల్లీబాయ్‌’ కథ చెప్పినపుడు ఇది వంద శాతం నేను చేసి తీరాల్సిందే అనిపించింది. అది ముంబయి గల్లీలో పెరిగిన ఒక ర్యాపర్‌ కథ. నాకు ర్యాప్‌, హిప్‌-హాప్‌ అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. నేను పుట్టింది ముంబయిలోనే. పెరిగింది అక్కడి గల్లీల్లోనే. చిన్నప్పట్నుంచీ ర్యాప్‌ తరహా పాటలు రాయడమంటే ఆసక్తి. దీపికా కోసం ఎన్నోసార్లు ర్యాప్‌ పాటలు రాసి పాడాను. అలాంటిది ఇప్పుడు ముంబయిలోనే ర్యాప్‌ స్టార్స్‌ ఉన్నారని తెలిసి చాలా ఆశ్చర్యమేసింది. ఈ సినిమాలో నాలుగు పాటలు పాడాను. పాటల రచయితలతో కలిసి పనిచేశాను. కొన్ని పాత్రలు మనం నటించాల్సి ఉంటుంది. కొన్ని పాత్రల్లో జస్ట్‌ జీవిస్తే సరిపోతుంది. నా విషయంలో గల్లీబాయ్‌ రెండోకోవకు చెందింది. ఆ సినిమా ముంబయి నగరానికి నేనిచ్చే ట్రిబ్యూట్‌. ప్రస్తుతం ’83లో నటిస్తున్నాను. 1983లో క్రికెట్‌ ప్రపంచకప్‌ గెల్చిన టీమ్‌ ఇండియా కథ ఇది. దీన్లో నాది కపిల్‌దేవ్‌ పాత్ర. దీనికోసం హోమ్‌వర్క్‌ మొదలుపెట్టాను. గతేడాది లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌- ఇండియా మ్యాచ్‌ చూడ్డానికి సచిన్‌తో పాటు వెళ్లాను. రానున్న ప్రపంచకప్‌నీ చూడ్డానికి వెళ్తాను. కపిల్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ శైలిని నేర్చుకుంటున్నాను. బీబీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా కపిల్‌దేవ్‌ జింబాబ్వేపైన చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్‌ రికార్డ్‌ కాలేదు. ఆ ఇన్నింగ్స్‌కి సంబంధించి ఒకట్రెండు ఫొటోలు మాత్రమే ఉన్నాయి. దాన్ని మేం తెరమీద చూపబోతున్నాం. ఈ సినిమా చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. తర్వాత కరణ్‌ జోహార్‌తో ‘తఖ్త్‌’ చేస్తాను. ఔరంగజేబు, దారాశిఖోల కథ ఇది. కథ చెప్పి రెంటిలో ఏ పాత్ర చేసినా నీ ఇష్టమే అన్నాడు కరణ్‌. నాకు దారాశిఖో పాత్ర నచ్చి తీసుకున్నాను. కొన్నిసార్లు పాత్రలో లీనమైపోయి బయట కూడా అలానే ప్రవర్తిస్తుంటా.
దానివల్ల మానసికంగానూ కొంత ఇబ్బంది ఉంటుంది. అందుకే సినిమాల మధ్యన రెండు మూడు వారాల గ్యాప్‌ ఉండేలా చూసుకుంటాను.

వివాహ జీవితం...
నా తొమ్మిదేళ్ల సినిమా కెరీర్‌లో దీపికాతో ప్రయాణం ఆరేళ్లు. ఈ ఆరేళ్లూ ఎంతో వేగంగా గడిచిపోయాయి. తనని మొదటిసారి మకావూలోని ఓ సినిమా వేడుకలో ప్రత్యక్షంగా చూశాను. ఆరోజే తను నా కలల రాణి అనిపించింది. నా జీవితాన్ని పంచుకోబోయేది ఈమెతోనే అనుకున్నాను. అప్పట్నుంచీ నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇద్దరం మూడు సినిమాల్లో కలిసి నటించాం. ఆ దశలో మా మధ్య అనుబంధం ఏర్పడింది. ఇద్దరం ఎంత సేపైనా ఒకరినొకరు చూసుకుంటూ, మాట్లాడుకుంటూ ఉండగలం. వృత్తిపరంగా తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇద్దరం కలిసే కెరీర్‌లను నిర్మించుకున్నాం. ముఖ్యంగా ఇద్దరం కుటుంబానికి విలువ ఇచ్చే మనుషులం. ఇలా ఎన్నో అంశాలు మమ్మల్ని దగ్గర చేశాయి. మూడేళ్ల కిందట నుంచీ నేను పెళ్లికి సిద్ధంగా ఉన్నాను. దీపికా నిర్ణయం తీసుకోవడమే ఆలస్యమని చెప్పాను. గతేడాది నవంబరు 14న ఆ వేడుక జరిగింది.
నా పెళ్లి ఇంత వైభవంగా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఆ క్రెడిట్‌ అంతా దీపికాదే. ఇటలీలో పెళ్లితోపాటు ముంబయి, బెంగళూరుల్లో విందునీ తనే అద్భుతంగా ప్లాన్‌ చేసింది. సంగీత్‌, డిన్నర్‌ పార్టీల్లో డ్యాన్స్‌ కోసం పాటల్ని మాత్రం ఏడాదిపాటు కష్టపడి నేనే సెలెక్ట్‌ చేశాను. గత నవంబరు మొత్తం సంబరాలూ సరదాలతో గడిచిపోయింది. పెళ్లి తర్వాత నా క్రమశిక్షణ మెరుగవుతోంది. తనది స్పోర్ట్స్‌ నేపథ్యం కదా, క్రమశిక్షణ ఎక్కువ. పనులు పూర్తిచేయడంలో నాకంటే తను బెటర్‌. నాకైతే ముంబయిలో కుటుంబం ఉంది. తను ఇక్కడికి ఒంటరిగానే వచ్చి కెరీర్‌ని నిర్మించుకుంది. తనకు తనే సీఈఓ.
ఉదయాన్నే నిద్రలేస్తుంది, మంచి ఆహారం తీసుకుంటుంది, పనుల్ని వాయిదా వేయదు, వేళకు నిద్రపోతుంది. ఇవన్నీ నేనూ పాటించాల్సిందేగా! గృహిణిగా నాకోసం అన్నీ చేసి పెడుతుంది. మంచి భర్తగా ఉంటూ తనకు ఏలోటూ లేకుండా చూసుకోవడం ఒక్కటే నా పని. కెరీర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్నపుడే ఇద్దరం వివాహ బంధంతో ఒక్కటయ్యాô. అది వివాహ వ్యవస్థ మీద మాకున్న నమ్మకం. తనూ సినిమా కెరీర్‌ని కొనసాగిస్తుంది.

వాళ్లే నా బలం
హిందీ సినిమా హీరో అవ్వాలని చిన్నప్పట్నుంచీ కలలు కన్న నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నిజమేనా అనిపిస్తుంది. ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’ సమయంలో ‘తమ్ముడూ, ఈ సినిమా ఆడకపోతే నువ్వు సినిమాలు వదిలి పెళ్లి పార్టీల్లో డ్యాన్స్‌ వేసుకోవచ్చు’ అని చెప్పాడు ఆదిత్య చోప్రా. కానీ ఆ అవసరం రాలేదు. అలాంటి అవసరం ఎప్పటికీ రాకూడదనీ నన్ను నేను రోజురోజుకీ ఉన్నతంగా మల్చుకోవాలనీ చూస్తాను. ‘దయతో ఉండు, కష్టపడి పనిచేయి, కృతజ్ఞతతో మెలుగు...’ ఈ మాటల్ని నా వేనిటీ వ్యాన్‌లో ఉండే బోర్డుమీద కూడా రాసిపెట్టుకుంటాను. చేసే ప్రతి పనిలోనూ ఇదే ఫాలో అవుతాను. నటుణ్ని అవ్వాలనుకున్నపుడు ఇంత పెద్ద సినిమాలు చేస్తానని అనుకోలేదు. ఇప్పుడు మంచి సినిమాల్లో, గొప్ప సాంకేతిక నిపుణులతో పనిచేస్తున్నాను. ఏ ప్రాజెక్టు చేసినా కష్టపడి పనిచేస్తాను. నిజాయతీగా పనిచేస్తాను. ‘యాక్షన్‌, కట్‌ - ఈ రెండు పదాల మధ్యన ఏం చేశానన్న దాన్నిబట్టే నా జీవితం ఆధారపడి ఉంటుంది’ అన్న సంగతిని ఏ క్షణమూ మర్చిపోను. కెరీర్‌లో పైకి వెళ్తున్నకొద్దీ కొత్త అంశాలు వచ్చి చేరుతుంటాయి. వృత్తి తర్వాతే అవి కావాలి తప్ప వాటి తర్వాతే వృత్తి అవ్వకూడదు. మొదట్లో నేనూ ఈ విషయంలో తడబడ్డాను. అప్పుడే ఒక స్నేహితుడు ఈ విషయంలో నాకు జ్ఞానోదయం కలిగించాడు. నాకు మంచి సపోర్ట్‌ టీమ్‌ ఉంది. నా శ్రీమతి దీపిక, నా చెల్లెలు రితికా, స్నేహితులు నవ్‌జార్‌, కరణ్‌, రోహన్‌... వీళ్లు నా దగ్గర ఎలాంటి అరమరికలు లేకుండా ఉంటారు. నా ఆలోచనలూ, ప్రవర్తనా బాగాలేకపోతే ఆ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతారు. ఇక అమ్మ అంజు, నాన్న జగ్జీత్‌ సింగ్‌, నా మార్గదర్శి ఆదిత్య చోప్రా... వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో సందేహాలూ సమస్యలూ ఉంటే వీళ్లతో మాట్లాడి పరిష్కరించుకుంటాను.

ఉత్సాహం ఎక్కువ...

పూర్తి పేరు రణ్‌వీర్‌ సింగ్‌ భావ్‌నానీ. మా తాతావాళ్లు దేశ విభజన సమయంలో కరాచీ నుంచి ముంబయి వచ్చేశారు. అక్కడ మా బంధువులు ఉన్నారు. చదువుకునే రోజుల్లో ఓసారి పాకిస్థాన్‌ వెళ్లాను కూడా.
* నేను చేసే ప్రకటనల్ని తేలిగ్గా తీసుకోను. నా ప్రకటనల్లో సృజనాత్మకత ఉండాలనుకుంటాను. సినిమా అయినా ప్రకటన అయినా వంద శాతం న్యాయం చేయాలనుకుంటాను.
* ఖాళీ దొరికితే నా డీజే స్కిల్స్‌ని మెరుగు పర్చుకోవడానికి చూస్తాను. పాటల్ని వింటూ బాగున్నవాటిని నా లైబ్రరీలో దాస్తాను. వీడియో గేమ్స్‌ ఆడటం ఇష్టం. ఫిఫా నా ఫేవరెట్‌ వీడియో గేమ్‌. వారాంతాల్లో ఫుట్‌బాల్‌ చూస్తుంటాను. నాకు జిమ్‌ చేయడం, ఆటలు ఆడుతూ ఫిట్‌గా ఉండటమూ నచ్చుతుంది.
* నిద్రలేవగానే దీపికాని ముద్దు పెట్టుకుంటాను. అంతకంటే రోజుకి శుభారంభం ఏముంటుంది!
* క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. ఉదయంపూట కొబ్బరినీళ్లు తాగుతాను. బాదం తింటాను.
* గోవిందా నా అభిమాన నటుడు. నేను సినిమాల్లోకి రావడానికి కారణాల్లో ఆయనా ఒకరు. ఆయనతో కలిసి సినిమాలో నటించాను.
* నాకు ఉత్సాహం ఎక్కువ. అది తగ్గించుకోమని చెబుతారు కొందరు. కానీ నాకైతే ఎందుకు తగ్గించుకోవాలీ అనిపిస్తుంది.
* సినిమాల్లోనే కాదు, డ్రెస్సింగ్‌లోనూ వెరైటీ ఉండాలనుకుంటాను. అందుకే ఎవరూ ట్రై చేయలేని కొత్త ఫ్యాషన్లు ఫాలో అవుతా.
* చేసిన పొరపాట్ల గురించి ఎక్కువగా బాధపడను. ‘అయిందేదో అయింది. ధైర్యంగా ముందుకెళ్లడమే మన పని’ అనేది నా పాలసీ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.