close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిల్లల్ని నిద్రపోనివ్వండి!

పిల్లలకు నిద్రే బలం అంటుంటారు. అది నూటికి నూరు శాతం నిజమేనట. ఎందుకంటే నిద్రపోయే సమయం తగ్గిపోతే డిప్రెషన్‌, ఆందోళన, ఆలోచనాశక్తి తగ్గిపోవడం... వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ వార్‌విక్‌కు చెందిన నిపుణులు చెబుతున్నారు. నిద్రలో మెదడులోని సంకేతాలన్నీ మళ్లీ ఓ పద్ధతి ప్రకారం ఒకదాంతో ఒకటి అనుసంధానమవుతాయి. అందుకే 9-11 సంవత్సరాల్లోపు పిల్లల్ని ఎంపిక చేసుకుని వాళ్లలో నిద్రలేమితో బాధపడేవాళ్లని పరిశీలించగా- డిప్రెషన్‌ లక్షణాలు కనిపించాయట. దాంతో 6-12 ఏళ్ల పిల్లలకి 9 నుంచి 12 గంటల నిద్ర అవసరమని చెబుతున్నారు. కానీ 60 శాతం మంది పిల్లలు ఆటలు, చదువు, సాంస్కృతిక కార్యక్రమాలు, టీవీ, ఫోనూ... ఇలా రకరకాల కారణాలతో ఎనిమిది గంటలకన్నా తక్కువగానే నిద్రపోతున్నారు. ఫలితంగా వాళ్లలో ప్రవర్తనాలోపాలతోబాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, అధ్యయనశక్తి వంటివి కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి చదువులూ ఆటపాటలంటూ పిల్లలను నిద్రకు దూరం చేస్తే కౌమార దశలో రకరకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు సంబంధిత నిపుణులు.


చేత్తోనే తింటున్నారా?!

అన్నం అయినా ఇడ్లీ అయినా చేత్తో తింటేనే ఫీల్‌ బాగుంటుంది. రుచిగానూ అనిపిస్తుంది. అదే స్పూనుతో తింటే అస్సలు తిన్నట్లే అనిపించదు అని చాలామంది అంటుంటారు. అది నిజమేనని న్యూయార్క్‌లోని స్టీవెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశీలనలోనూ స్పష్టమైంది. పైగా ఆహారం పట్ల అవగాహనతో తిండిని నియంత్రించుకునేవాళ్లు సైతం చేత్తో తిన్నప్పుడు ఎక్కువ తిన్నట్లు తేలింది. ఎందుకంటే తినే ఆహారం ఏదైనాగానీ చేత్తో తినేటప్పుడు ఆ రుచిని ఆనందంగా ఆస్వాదించడంతోబాటు ఎక్కువగానూ తింటారట. పైగా నోట్లో పెట్టుకోకముందే దాన్ని తాకడం వల్ల మెదడు దాని రుచి గురించి ఆలోచించడంతో అది మరింత రుచిగా అనిపిస్తుందట. ఇందుకోసం వీళ్లు కొందరు విద్యార్థులను ఎంపికచేసి, వారిలో ఆహారంపట్ల నియంత్రణ ఉన్నవాళ్లనీ లేనివాళ్లనీ రెండు వర్గాలుగా విభజించి ఓ కప్పులో మినీ బర్గర్లు వేసి ఇచ్చారట. ఇందులో ఆరోగ్య స్పృహతో తమని తాము నియంత్రించుకుంటూ తినేవాళ్లలో- ఫోర్కు వాడేవాళ్లకన్నా చేత్తో తిన్నవాళ్లు ఎక్కువ తిన్నట్లు తేలింది. అదేసమయంలో ఆహార నియంత్రణ పట్ల పెద్ద పట్టింపు లేనివాళ్లలో చేత్తో తిన్నా ఫోర్కుతో తిన్నా పెద్దగా తేడా లేదని గమనించారు. కాబట్టి డైటింగ్‌ చేసేవాళ్లు చేత్తో తినేటప్పుడు కాస్త చూసి తినాల్సిందే మరి.


మాస్క్‌లతోనూ జాగ్రత్త!

అది కరోనా లేదా మరే వైరస్‌ అయినా సరే, స్టెరిలైజ్‌డ్‌ మాస్క్‌లు పెట్టుకుంటే ఇక భయం లేనట్టే అనుకుంటాం. అయితే ఆ మాస్క్‌లను సరిగా వాడకపోతే మంచి కన్నా చెడు జరిగే ప్రమాదమే ఎక్కువనీ, వాటికి బదులుగా సాల్టెడ్‌ మాస్క్‌లు వాడటం వల్ల వైరస్‌ సోకే ప్రమాదం తగ్గుతుందనీ వివరిస్తున్నారు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆల్బర్టాకి చెందిన శాస్త్రవేత్తలు. సాధారణంగా గాల్లో పుట్టుకొచ్చే వైరస్‌లన్నీ సన్నని నీటిబిందువుల రూపంలోనే మనల్ని చేరతాయి. కానీ కరోనా వైరస్‌లాంటివి అతి సూక్ష్మ రేణువుల ద్వారా కూడా మాస్క్‌ రంధ్రాల్లోకి చేరుకోగలవు. పైగా మాస్క్‌లన్నీ వైరస్‌లను అడ్డుకోగలవేకానీ వాటిని నాశనం చేయలేవు. దాంతో వాటిని తీసి పారేసినప్పుడు వాటిమీద ఉన్న వైరస్‌ మళ్లీ ఎవరి వేళ్లకయినా అతుక్కోవడం లేదా పారేసిన ప్రదేశాల నుంచీ వ్యాపించవచ్చు. అయితే, సోడియం క్లోరైడ్‌, పొటాషియం క్లోరైడ్‌ అనే రెండు రకాల ఉప్పు ద్రావణాలను మాస్క్‌మీద పూతగా వేస్తే, వైరస్‌ దానిమీదకు రాగానే ముందు ఉప్పు కరుగుతుంది. తరవాత అది ఆవిరై మళ్లీ స్ఫటికంలా గట్టిపడటంతో వైరస్‌ అందులో చిక్కుకుని చనిపోతుందట. ఈ విషయాన్ని మూడు రకాల వైరస్‌లతో పరిశీలించగా- మొదటి ఐదు నిమిషాల్లో అవి చురుకుదనం కోల్పోయి, అరగంటలో మరణించినట్లు గుర్తించారు. కాబట్టి మరో ఏడాదిలో ఈ సాల్ట్‌ కోటెడ్‌ మాస్క్‌లను మార్కెట్టులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు సదరు నిపుణులు. ప్రస్తుతం సంప్రదాయ మాస్క్‌లను వాడేవాళ్లు దాన్ని పట్టుకునే ముందూ తరవాతా కూడా చేతులు శుభ్రం చేసుకోవడంతోబాటు వాడిన వాటిని జేబుల్లోనో పర్సుల్లోనో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.


టీ... తాగుదాం..!

క్రమం తప్పకుండా వారానికి కనీసం మూడుసార్లు టీ తాగేవాళ్లు ఎక్కువకాలం జీవిస్తారని యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ కార్డియాలజీ పేర్కొంటోంది. ఎందుకంటే టీ తాగే అలవాటు ఉన్నవాళ్లలో హృద్రోగ మరణాలు తక్కువ అని చెబుతున్నారు. ఇందుకోసం వీళ్లు లక్షమందిని ఎంపిక చేసి వాళ్లలో టీ తాగేవాళ్లు, తాగనివాళ్లు అని రెండు వర్గాలుగా విభజించి పరిశీలించారట. అందులో రోజూ టీ తాగే అలవాటున్నవాళ్లు తాగనివాళ్లకన్నా ఎక్కువకాలం జీవించడంతోబాటు వాళ్లలో హృద్రోగాల బారినపడిన వాళ్ల సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే టీలో కూడా బ్లాక్‌ టీతో పోలిస్తే గ్రీన్‌ టీ తాగేవాళ్లే మరింత ఆరోగ్యంగా ఉన్నారట. అంతేకాదు, టీ తాగే అలవాటు ఉన్నవాళ్లలో మెదడు పనితీరు కూడా బాగున్నట్లు మరో పరిశీలనలో తేలింది. కాబట్టి టీ తాగుతూనే ఉండండి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు