close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోడిగుడ్లతో కూరగాయలకి పూత!

టా లక్షలకొద్దీ కోడిగుడ్లు సూపర్‌మార్కెట్లలో అమ్ముడుపోక వృథాగా పోతుంటాయి. అలాగే  నిల్వ చేయడానికి కుదరక చాలావరకూ కూరగాయలూ పండ్లూ కూడా పాడవుతుంటాయి. అందుకే శాస్త్రవేత్తలు ఈ రెండు సమస్యలకీ చక్కని పరిష్కారాన్ని గుర్తించారు. అమ్ముడుపోని గుడ్లతో కూరగాయలకీ పండ్లకీ పూత పూయడం ద్వారా అవి ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేసే విధానాన్ని హూస్టన్‌లోని రైస్‌ విశ్వవిద్యాలయ నిపుణుల బృందం రూపొందించింది. మైక్రాన్‌ మందంతో పూసే ఈ పూత పూయడానికి పెద్దగా ఖర్చూ కాదట. గుడ్డు సొనల నుంచి 70 శాతం బైపాలిమర్‌నీ, చెక్క నుంచి సెల్యులోజ్‌ ఫైబర్‌నీ, పసుపు కొమ్ముల నుంచి కుర్‌క్యుమిన్‌నీ, కొద్దిపాళ్లలో గ్లిజరాల్‌నీ కలిపి చేసిన ఈ పూత పూయడంతో పండ్లలోని తేమ ఆవిరైపోకుండా ఉంటుంది. యాంటీ మైక్రోబియల్‌ గుణాలున్న పసుపు సూక్ష్మజీవులు చేరకుండా అడ్డుకుంటుందట. ఇందుకోసం త్వరగా పాడయ్యే స్ట్రాబెర్రీలూ అవకాడోలూ అరటిపండ్లకు ఈ పూత పూసి పరిశీలించగా- అవి మామూలువాటికన్నా ఎక్కువ కాలం నిల్వ ఉన్నట్లు గుర్తించారు. పైగా ఈ పూత వల్ల ఎలాంటి హానీ ఉండదు సరికదా, ట్యాప్‌ వాటర్‌ కింద కడిగేస్తే పోతుంది అంటున్నారు. సో, త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ పూతతో మున్ముందు ఏవీ వృథా కావన్నమాట.


కృత్రిమ రక్తం మంచిదేనా?!

ప్రపంచవ్యాప్తంగా రక్తం కొరత ఉందనీ, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే శాస్త్రవేత్తలు కృత్రిమ రకాన్ని రూపొందించే పనిలో ఉన్నారన్నది తెలిసిందే. అయితే అది ఎలా ఉంటుందోనని చాలామందిలో భయాందోళనలు ఉన్నాయి. కానీ అలాంటి భయాలేమీ అవసరం లేదనీ కృత్రిమ కణాలు, అచ్చం సహజ రక్తకణాల్లానే పనిచేస్తాయని అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ పేర్కొంటోంది. సాధారణంగా ఎర్ర రక్తకణాలు ఊపిరితిత్తుల్లోని ఆక్సిజన్‌ని గ్రహించి, శరీర కణజాలాలకు అందిస్తాయి. ఈ పని కోసమే వీటిల్లో లక్షలకొద్దీ హిమోగ్లోబిన్‌ కణాలు ఉంటాయి. అలాగే అవసరాన్ని బట్టి రక్తకణాల పరిమాణం సంకోచిస్తుంది, వ్యాకోచిస్తుంది. అందువల్లే ఇవి అత్యంత సన్నని రక్తనాళాలగుండానూ ప్రవహించగలుగుతాయి. అందుకే ఈ గుణాలన్నీ కలిగి ఉండేలా కృత్రిమ కణాల్ని రూపొందిస్తున్నారు. అయితే ఇవి ఆకారం, పరిమాణాల్లో అచ్చంగా సహజ రక్తకణాల్ని పోలి ఉండటమే కాదు, మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయనీ తేలిందట. అదెలా అంటే- అధిక హిమోగ్లోబిన్‌నుగానీ; క్యాన్సర్‌నీ, హానికర బ్యాక్టీరియాని అడ్డుకునే ఔషధగుణాలుగానీ కలిగిఉండేలా వీటిని రూపొందిస్తున్నారు. దాంతో శక్తిమంతమైన ఈ కణాల్ని క్యాన్సర్‌ చికిత్సలో భాగంగానూ ఇంజెక్టు చేయవచ్చు అని వివరిస్తున్నారు నిపుణులు. కాబట్టి భవిష్యత్తులో రక్తదాతలు దొరకని సందర్భాల్లో నిశ్చింతగా కృత్రిమ రకాన్ని ఎక్కించుకోవచ్చన్నమాట.


బయో సెన్సర్‌తో గుండె పరీక్ష!

డకనీ వ్యాయామాన్నీ గుండె రేటునీ చూపించే ఫిట్‌బిట్‌లు ఇప్పటికే మార్కెట్లో చాలానే ఉన్నాయి. అయితే జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు చిన్న పురుగు సైజులో సెన్సర్‌ను రూపొందించారు. దీన్ని గానీ దుస్తుల్లో భాగంగా ధరిస్తే, ఈసీజీ వంటివి తీయించుకోవడానికి ప్రత్యేకంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది గుండె కొట్టుకునే తీరునూ రక్త సరఫరానీ దాని పనితీరునీ అన్నింటినీ చక్కగా గుర్తించి ఆప్‌ ద్వారా కంప్యూటర్‌కి పంపిస్తుంది. అంతేకాదు, ఈసీజీ పసిగట్టలేని గుండె, ఊపిరితిత్తుల సమస్యల్నీ ఇది గుర్తిస్తుందట. చిన్న చిప్‌లా ఉండే ఈ సెన్సర్‌లో అత్యంత పలుచగా ఉన్న సిలికాన్‌ పొరలు ఎలక్ట్రోడ్స్‌లా పనిచేస్తూ గుండె సవ్వడిని లెక్కిస్తాయట. వీటితోబాటు ఇది నడక, వ్యాయామం వంటి వాటినీ గుర్తిస్తుంది. కాబట్టి దుస్తుల్లో దీన్ని ఉంచుకుంటే గుండె పనితీరులోని లోపాలను ముందుగానే గుర్తించి హెచ్చరిస్తుంది. ఇప్పటికే సమస్య ఉన్నవాళ్లయితే తరచూ వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అంటున్నారు.


ఏరోబిక్స్‌తో మతిమరుపు మాయం!

మధ్య కాలంలో యాభై, అరవై దాటిన దగ్గర్నుంచీ చాలామంది ఎదుర్కొంటోన్న సమస్య మతిమరుపు. అయితే ఏరోబిక్స్‌తో మతిమరుపు చాలావరకూ తగ్గుతుందని సౌత్‌ వెస్ట్రన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, ఆలోచనాశక్తి కూడా పెరుగుతుందట. మతిమరుపు మొదలవుతుందీ అనుకున్నదశలోనే ఏరోబిక్స్‌ మొదలుపెడితే, మంచి ఫలితం ఉంటుందట. ఇందుకోసం వాళ్లు ఏడాదిపాటు చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. మెదడుకి ఆక్సిజన్‌ సరఫరా కూడా పెరిగినట్లు గుర్తించారు. ఇందుకోసం సాధారణ వ్యాయామాలు చేసేవాళ్లనీ ఏరోబిక్స్‌ చేసేవాళ్లనీ రెండు భాగాలుగా విభజించి ఎమ్మారై స్కాన్‌ చేసి చూశారట. అందులో ఏరోబిక్స్‌ వ్యాయామం చేసేవాళ్లలో జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగాలకు రక్త
సరఫరా పెరిగిందనీ తద్వారా ఆక్సిజన్‌ శాతం కూడా పెరిగినట్లు గుర్తించారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు