YSRCP: జగ్గూ దెబ్బకు.. కోనసీమ బుగ్గి!

పచ్చని రంగేసినట్లుండే ఆ ప్రాంతం కోనసీమ ముఖద్వారం.. ‘జగ్గూ భాయ్‌’ దెబ్బకు ఇసుక దిబ్బగా మారుతోంది!మాగాణి భూములతో విలసిల్లే ఆ ప్రాంతం మాఫియా ముఠాలకు అడ్డాగా తయారైంది!!

Updated : 20 Mar 2024 08:23 IST

కోనసీమలో వైకాపా ప్రజాప్రతినిధి దోపిడీ!
ఇసుక, మట్టితో రూ.కోట్లలో దందా
వివాదాస్పద భూముల్లో పాగా..

పచ్చని రంగేసినట్లుండే ఆ ప్రాంతం కోనసీమ ముఖద్వారం.. ‘జగ్గూ భాయ్‌’ దెబ్బకు ఇసుక దిబ్బగా మారుతోంది!
మాగాణి భూములతో విలసిల్లే ఆ ప్రాంతం మాఫియా ముఠాలకు అడ్డాగా తయారైంది!!
ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రదేశం.. నేడు దందాలు, బెదిరింపులతో ప్రతిధ్వనిస్తోంది!
జగన్‌ అండ తోడవడంతో.. ‘జగ్గూ..’ కబ్జాకాండకు హద్దూపద్దూ లేకుండా పోతోంది...
లంకల్లో మట్టిని తవ్వేస్తూ.. నదుల్లో ఇసుకను తరలిస్తూ అనతికాలంలో కోట్లు కూడబెట్టుకున్నారు!


కోనసీమ అనగానే.. గలగలపారే పంట కాలువలు, పచ్చని వరి పైరు, కొబ్బరి చెట్లతో కళకళలాడే దృశ్యం కళ్లముందు మెదులుతోందా..! అయితే మీరు ఈ ఐదేళ్లలో ఆ ప్రాంతానికి వెళ్లినట్టు లేరు. ఐదేళ్ల వైకాపా పాలనలో జరిగిన సహజవనరుల దోపిడీకి సాక్ష్యం అన్నట్టు దారి పొడవునా ఇసుక గుట్టలే దర్శనమిస్తాయి. ఆపైన దందాలు, బెదిరింపులు, మట్టి, గంజాయి, మద్యం, స్థిరాస్తి మాఫియాకు ఈ ప్రాంతం కేంద్రంగా మారిపోయింది. ఇదంతా కోనసీమలోని ఓ నియోజకవర్గ వైకాపా ప్రజాప్రతినిధి ‘‘జగ్గూ భాయ్‌’’ అంతులేని ధనదాహం వల్లే. సరిగ్గా ఆరేళ్ల కిందట.. ఓ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం సకాలంలో చెల్లించలేకపోవటంతో ఆయన బహిరంగ నోటీసు అందుకున్నారు. అదే వ్యక్తి ఈ అయిదేళ్లలో రూ.300 కోట్లకు పైనే అక్రమంగా ఆర్జించారు.

అతి పెద్ద ‘భూ’చోడు!

వాణిజ్య కేంద్రమైన రావులపాలెం పట్టణంలో అత్యంత విలువైన వివాదాస్పద భూములను నామమాత్రపు ధరలకు చేజిక్కించుకుని రూ.కోట్లు ఆర్జించారు. ఓ కుటుంబానికి చెందిన 51 సెంట్ల వ్యవసాయ భూమిని మరో కుటుంబం వారు కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. వారి మధ్య వివాదం తలెత్తటంతో... ఈ నాయకుడు అందులో తలదూర్చి, ఆ ఆస్తిని కాజేశారు.

అదే స్థలానికి సమీపంలోని అత్యంత విలువైన 40 సెంట్ల స్థలాన్నీ అతి తక్కువ ధరకు బలవంతంగా చేజిక్కించుకున్నారు. ఈ పట్టణంలోనే మరో చోట అత్యంత విలువైన 70 సెంట్ల స్థలాన్ని దాని యజమానిని బెదిరించి నామమాత్రపు ధరకు తీసుకున్నారు. ఆ  తర్వాత అందులో లేఅవుట్‌ వేసి ఒక్కో సెంటు స్థలాన్ని రూ.70 లక్షలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు.


లేఅవుట్‌ వేస్తే.. ముడుపు చెల్లించాల్సిందే!

ఈ నియోజకవర్గం పరిధిలో ఎవరైనా స్థిరాస్తి లేఅవుట్‌ వేయాలంటే తొలుత ఈ నాయకుడికి భారీ మొత్తాల్లో ముడుపులు చెల్లించుకోవాల్సిందే. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వేస్తే అందులో కచ్చితంగా వాటాలు సమర్పించుకోవాల్సిందే. ఎవరైనా నిరాకరిస్తే వారి పని ఇక అంతే!

కొన్ని చోట్ల ఈ ప్రజాప్రతినిధి స్వయంగా  లేఅవుట్‌లూ వేయిస్తున్నారు. వాటిని అభివృద్ధి పరిచేందుకు వివిధ ప్రభుత్వ శాఖలనూ నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారు.


ఇసుకాయస్వాహా..!

ఈ నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లన్నీ ఈ నాయకుడి ఆధీనంలోనే ఉన్నాయి. మొదట్లో జేపీ సంస్థ నుంచి రీచ్‌లను సబ్‌లీజ్‌కు తీసుకుని తన అనుచరులతో దందా నడిపించారు. పర్యావరణ అనుమతులు లేకుండానే అడ్డగోలుగా రేవుల్లో తవ్వకాలు జరుపుతూ... రూ.కోట్లలో వెనకేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరపటంతో జొన్నాడ వద్ద ఆ గుంతల్లో పడి ఇద్దరు బాలలు ప్రాణాలు కోల్పోయారు.

లంకాసురుడు!

సొసైటీలకు కేటాయించిన వందల ఎకరాల గోదావరి లంక భూముల్లోని మట్టిని అక్రమంగా తవ్వి సమీపంలోని ఇటుక బట్టీలు, లేఅవుట్‌లకు తరలిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.   కొమర్రాజు లంకలోని భూముల్లో మట్టిని అడ్డగోలుగా తవ్వేస్తూ రోజూ వందల లారీల్లో తరలిస్తున్నారు. ఊబలంకలో మత్స్యకారులకు చెందిన సొసైటీ భూముల్లోనూ ఇదే తరహాలో దందా కొనసాగించారు.


కాలనీల భూసేకరణలో కోట్లు కొల్లగొట్టారు...

జగనన్న కాలనీల నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణను ఈ నాయకుడు తన పాలిట బంగారు బాతుగా మార్చుకున్నారు. ఈ ఒక్క దందాలోనే రూ.50 కోట్ల మేర కొల్లగొట్టారు.   గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం రూ.17-24 లక్షలు విలువున్న భూమిని రూ.45-60 లక్షల వరకు కొనుగోలు చేయించారు. నియోజకవర్గ కేంద్రానికి సుమారు 10కి.మీ దూరంలో.. ద్విచక్ర వాహనం వెళ్లేందుకూ అవకాశం లేని ప్రాంతంలో 600 మందికి ఇళ్ల స్థలాల కోసమంటూ అధిక ధరలకు భూమి కొనుగోలు చేయించి.. భారీగా లబ్ధి పొందారు.


మేనమామ తోడుగా బాదుడు!

నియోజకవర్గంలో ఈ నాయకుడి తరఫున ఆయన    మేనమామే చక్రం తిప్పుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనే షాడో ప్రజాప్రతినిధి. అధికారుల బదిలీలు, పోస్టింగులు, కాంట్రాక్ట్‌ పనులు, వాటి బిల్లుల మంజూరు వ్యవహారాలన్నీ ఈయన కనుసన్నల్లోనే జరుగుతాయి. ఈ నియోజకవర్గానికి ముఖ్య శాఖల అధికారులు బదిలీపై రావాలన్నా ముందు ఈయన దర్శనం చేసుకోవాల్సిందే. ఆయన చెప్పే ప్రతి పని చేస్తామని అంగీకరిస్తేనే వారి పోస్టింగు ఖరారవుతుంది.


రైతుల సొమ్మునూ కాజేసి..

ధాన్యం కొనుగోళ్లు, పంటల బీమా వ్యవహారాల్లోనూ తలదూర్చి, భారీగా సొమ్ము చేసుకున్నారు. పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన పరిహారం సొమ్మును అసలు సెంటు భూమి కూడా లేని వైకాపా నాయకులు, ఎంపీటీసీలు, వాలంటీర్ల ఖాతాల్లో వేయించుకుని ఆ మొత్తాన్నీ కాజేశారు. రావులపాలెం మండలంలో స్టీల్‌ప్లాంటు, కొబ్బరి తోటలున్న భూముల్లో సుమారు 250 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు నమోదు చేసి అక్రమాలకు తెరలేపారు.


ఫటాఫట్‌.. హాం.. ఫట్‌!  

  • కాలువల్లో పూడికనూ జగ్గూ వదల్లేదు. ఈయన అనుచరులు నామినేషన్‌ విధానంలో పనులు దక్కించుకుని వాటిలో రూ.5 కోట్లు హాంఫట్‌ చేశారు!
  • పాఠశాలల్లో ‘నాడు- నేడు’ పనులన్నీ ఈ నాయకుడి ప్రధాన అనుచరుడే చేపట్టారు. అత్యంత నాసిరకంగా పనులు చేసి బిల్లులు చేసుకున్నారు.
  • ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహించే ప్రాంతాలను ఈ నాయకుడి అనుచరులు ముందుగానే గుర్తించి వాటి  యజమానులతో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు బాడుగ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఆ దుకాణాలనే ప్రభుత్వానికి రూ.40 వేల వరకు మారు అద్దెకు ఇచ్చి భారీ మొత్తాల్లో కొల్లగొడుతున్నారు.
  • నియోజకవర్గంలో మద్యం గొలుసు దుకాణాలన్నీ ఈ నాయకుడి అనుచరుల నేతృత్వంలోనే కొనసాగుతున్నాయి.
  • నియోజకవర్గ ముఖద్వారంగా ఉన్న పంచాయతీని పర్యాటక కేంద్రంగా చూపి ఓ బార్‌ ఏర్పాటు చేశారు. దీన్ని ఈ నాయకుడి అనుచరులే నిర్వహిస్తూ, గొలుసు దుకాణాలకు ఇక్కడి నుంచే మద్యం సరఫరా చేస్తున్నారు.

ఈనాడు, రాజమహేంద్రవరం, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని