Bajaj Auto: చేతక్‌ ఉత్పత్తిపై బజాజ్‌ ఫోకస్‌.. 10వేల స్కూటర్లు టార్గెట్‌

Bajaj Chetak EV: చేతక్‌ విద్యుత్‌ స్కూటర్ల తయారీ సామర్థ్యాన్ని పెంచాలని బజాజ్‌ ఆటో నిర్ణయించింది. జూన్‌ నాటికి 10 వేల మైలురాయిని అందుకోవాలని చూస్తోంది.

Published : 28 Apr 2023 18:40 IST

దిల్లీ: చేతక్‌ విద్యుత్‌ స్కూటర్‌ (Bajaj Chetak EV) ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచాలని బజాజ్‌ ఆటో (Bajaj Auto) నిర్ణయించింది. జూన్‌ నాటికి 10 వేల యూనిట్ల మైలురాయిని అందుకోవాలని చూస్తోంది. అలాగే, తన సేల్స్‌ నెట్‌వర్క్‌ను సైతం పెంచాలనుకుంటోంది. సెప్టెంబర్‌ నాటికి 150 ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్లను తెరవాలని చూస్తోందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ తెలిపారు.

ప్రస్తుతం బజాజ్‌ ఉత్పత్తి సామర్థ్యం 5 వేలుగా ఉందని, దాన్ని తొలుత 7 వేలు చేయాలనుకుంటున్నామని రాకేశ్‌ వివరించారు. డిమాండ్‌ను బట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలనుకుంటున్నామని, జూన్‌ నాటికి 10 వేల మార్కును అందుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. విడిభాగాల విషయంలో కొంతమంది వెండర్లు చేసిన జాప్యం కారణంగా ఉత్పత్తిపై ప్రభావం చూపిందని రాకేశ్‌ తెలిపారు. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారమైందని, దాంతో ఉత్పత్తి పెంపుపై విశ్వాసం ఏర్పడిందని పేర్కొన్నారు. 

ప్రస్తుతం చేతక్‌ వెయిటింగ్‌ పీరియడ్‌ 20-25 రోజులుగా ఉందని, మే నుంచి ఈ సమయం 3-5 రోజులకు తగ్గుతుందని ఆశిస్తున్నట్లు రాకేశ్‌ తెలిపారు. ప్రస్తుతం 88 పట్టణాల్లో 105 డీలర్‌షిప్‌ కేంద్రాలు ఉన్నాయని, సెప్టెంబర్‌ నాటికి 120 పట్టణాల్లో 150 ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లకు ఈ సంఖ్యను పెంచాలని అనుకుంటున్నట్లు చెప్పారు. మార్కెట్‌ పరిస్థితులను బట్టి విస్తరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 2024 మార్చి తర్వాతా ఫేమ్‌-2 సబ్సిడీ కొనసాగిస్తారా? లేదా? అనే అంశంపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు. ఒకవేళ ఫేమ్‌-2 సబ్సిడీ నిలిపివేస్తే ఈవీల ధరలకు రెక్కలు వస్తాయని, దాంతో పరిశ్రమ వృద్ధి నెమ్మదిస్తుందని చెప్పారు. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా చేతక్‌ స్టోర్ల విస్తరణ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని