EPFO: ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి ₹21 వేలు..?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ  (EPFO)కు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఓ గుడ్‌న్యూస్‌ చెప్పే అవకాశం ఉంది. ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచే అవకాశం కనిపిస్తోంది.

Updated : 24 Nov 2022 17:15 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ  (EPFO)కు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఓ గుడ్‌న్యూస్‌ చెప్పే అవకాశం ఉంది. పెన్షన్‌ స్కీమ్‌కు సంబంధించి ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రూ.15వేలుగా ఉన్న వేతన పరిమితిని రూ.21 వేలకు త్వరలోనే పెంచనుందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులు, యజమానులు చెల్లించే వాటా పెరగనుంది. దీనివల్ల ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేర పెరగనుంది.

ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో రూ.6,500గా ఉన్న గరిష్ఠ వేతనాన్ని రూ.15వేలకు పెంచారు. 20 మంది కంటే ఎక్కువ ఉన్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. తాజాగా ఆ పరిమితిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అధిక వేతనం నిర్ణయించేందుకు ఒక కమిటీని ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి ఎప్పటికప్పుడు గరిష్ఠ వేతన పరిమితిని ఈ కమిటీ సమీక్షించనుంది.

సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతాయి. ప్రస్తుతం ఉన్న గరిష్ఠ వేతన పరిమితి ప్రకారం.. 8.33 శాతం కింద రూ.1250 ఈపీఎస్‌ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా మొత్తం ఉద్యోగి ఖాతాలో జమవుతాయి. గరిష్ఠ వేతన పరిమితి పెరిగితే ఆ మేర ఉద్యోగి వాటా, యజమాని వాటా పెరుగుతుంది. పెన్షన్‌ ఖాతాలో ఎక్కువ మొత్తం జమ అవుతుంది.

ప్రస్తుతం లెక్కింపు ఇలా..

ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం (బేసిక్‌ + డీఏ) రూ.30 వేలు ఉందనుకుందాం. ఇందులో ఉద్యోగి వాటా రూ.3600 ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతాయి. యజమాని వాటా కింద రూ.3600 ఉంటాయి. గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలును పరిగణనలోకి తీసుకుంటే.. 8.33 శాతం కింద రూ.1250 ఈపీఎస్‌ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా రూ.2350 ఉద్యోగి ఖాతాలో జమవుతాయి. అంటే నెలకు ఉద్యోగి, యజమాని వాటా కింద ఈపీఎఫ్‌ ఖాతాలో రూ.5950 ఉంటాయి. గరిష్ఠ పరిమితిని 21వేలు చేస్తే ఆ మేర ఈపీఎస్‌లో జమ అయ్యే సుమారు రూ.1750కి పెరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని