New Rules: కొత్త పన్ను శ్లాబులు, డిపాజిట్ పరిమితి పెంపు.. ఏప్రిల్ 1 నుంచి మారేవి ఇవే..!
Changes From April 1st: కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని మార్పులు రానున్నాయి. ఇందులో కొన్ని సామాన్యులకు ఊరట కలిగించేవి కాగా.. మరికొన్ని భారంగా మారనున్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) వచ్చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతోంది. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో నిర్ణయాలు అదే రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితి పెంపు, సీనియర్ సిటిజన్లకు డిపాజిట్లపై పరిమితి పెంపు వంటి ఊరటనిచ్చే నిర్ణయాలు 1 నుంచే అమలు కానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌పై ఎల్‌టీసీజీ ప్రయోజనాలు తొలగింపు, అధిక ప్రీమియం కలిగిన జీవిత బీమా పాలసీపై పన్ను వాత వంటివీ ఆ రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. ఇవే కాకుండా ఏప్రిల్ 1 నుంచి ఇంకా ఏయే మార్పులు రానున్నాయో చూద్దాం..
డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానం
2023 బడ్జెట్‌లో ఎక్కువగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశం కొత్త ఆర్థిక పన్ను విధానం. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానానికి సంబంధించి ఈసారి బడ్జెట్‌లో కీలక మార్పులను ప్రతిపాదించారు. ఇక నుంచి రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో ‘కొత్త ఆదాయ పన్ను విధానం’ డిఫాల్ట్ ఆప్షన్‌గా ఇస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు వారికి ఇష్టమున్న పన్ను విధానాన్ని ఎంచుకొనే వెసులు బాటునూ కల్పించారు.
పన్ను రాయితీ పరిమితి పెంపు
పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు పన్ను ఆదాయంపై రిబేట్ ఇచ్చేవారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో ఈ రిబేట్‌ను రూ.7 లక్షల వరకు పెంచారు. దీంతో రూ.7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త విధానంలో పన్ను మినహాయింపులు వర్తించవు కాబట్టి పన్ను చెల్లింపుదారుడు ఎంతమొత్తంలో పెట్టుబడి పెట్టారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోరు.
కొత్త పన్ను శ్లాబులు ఇలా..
గతంలో కొత్త పన్ను విధానంలో ఆరు శ్లాబులు ఉండేవి. వాటిని ఈ సారి ఐదుకు కుదించారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఐదు శ్లాబులే ఉంటాయి. రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించరు. రూ.3-6 లక్షల వరకు 5 శాతం; రూ.6-9 లక్షల వరకు 10 శాతం; రూ.9-12 లక్షల వరకు 15 శాతం; రూ.12-15 లక్షల వరకు 20 శాతం; రూ.15 లక్షల కంటే అధికంగా ఉంటే 30 శాతం పన్ను కట్టాలి. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులూ లేవు.
సీనియర్ సిటిజన్లకు ఊరట..
ఇంతకు ముందు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో ఒక్కో వ్యక్తి రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా డిపాజిట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడా ఆ పరిమితిని రూ.30లక్షలకు పెంచారు. దీంతో పాటు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) పరిమితిని కూడా పెంచారు. ఇంతకు ముందు సింగిల్ అకౌంట్ కలిగిన వ్యక్తి నెలకు కేవలం రూ.4.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ డిపాజిట్‌ను రూ.9లక్షలకు పెంచారు. ఇక జాయింట్ అకౌంట్‌లో రూ.7.5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.15లక్షల వరకు పెంచారు.
జీవిత బీమా పాలసీలపై పన్ను
ఇంతకుముందు వరకు జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండేది కాదు. 2023 ఏప్రిల్ 1 తర్వాత కొనుగోలు చేసిన పాలసీ ప్రీమియం మొత్తం రూ.5 లక్షలు దాటితే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను విధిస్తారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాలసీల మొత్తం రూ.5 లక్షలు దాటినా పన్ను వర్తిస్తుంది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు ఈ నియమాలు వర్తించవు.
డెట్ మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు షాక్
డెట్ మ్యూచువల్ ఫండ్లపై ఇస్తున్న దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇకపై వీటిలో చేసే మదుపుపై వచ్చే రాబడిపై ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక బిల్లు 2023 సవరణల్లో దీన్ని ప్రతిపాదించారు. కనీసం 35 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని డెట్ మ్యూచువల్ ఫండ్లకు ఇకపై ఎల్‌టీసీజీ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం డెట్ మ్యూచువల్ ఫండ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం మదుపు చేస్తే వాటిని దీర్ఘకాల పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఇండెక్సేషన్‌తో కలిపి 20 శాతం ఎల్‌టీసీజీ పన్ను వేస్తున్నారు. ఇండెక్సేషన్ లేకుండా అయితే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఈ ఫండ్లలో మదుపు చేసిన వారందరూ ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచే ఇది అమల్లోకి రానుంది.
పెరిగేవి.. తగ్గేవి
ఇటీవలి బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి కొన్ని వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. సుంకాలు, పన్ను రేట్లలో ఆ మేర కేంద్రం మార్పులు చేసింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసింది. పెరిగేవి: ప్రైవేటు జెట్స్, హెలికాప్టర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, వెండివస్తువులు, ప్లాటినం, ఇమిటేషన్ ఆభరణాలు, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు, సిగరెట్లు. తగ్గేవి: దుస్తులు, వజ్రాలు, రంగు రాళ్లు, బొమ్మలు, సైకిళ్లు, టీవీలు, ఇంగువ, కాఫీ గింజలు, శీతలీకరించిన నత్తగుల్లలు, మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, కెమెరా లెన్స్‌లు, భారత్‌లో తయారైన ఎలక్ట్రానిక్ వాహనాలు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు, లిథియం అయాన్ బ్యాటరీలు
మహిళల కోసం ప్రత్యేక పథకం
'ఆజాదీకా అమృత్ మహోత్సవం'లో భాగంగా మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా కొత్త చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని 2023-24 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉండనుంది. ఈ పథకానికి 7.50% స్థిర వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటించింది. డిపాజిట్‌పై రూ.2 లక్షల గరిష్ఠ పరిమితి ఉంది. పథకం పూర్తి వివరాలను ఇంత వరకు ప్రభుత్వం ఖరారు చేయలేదు.
టోల్ బాదుడు..
జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్ రుసుములను సమీక్షిస్తారు. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు తెలిపారు.
ఆభరణాలకు హాల్‌మార్కింగ్..
ఏప్రిల్ 1 నుంచి పసిడి ఆభరణాలను 6 అంకెల హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్)తో విక్రయించడం తప్పనిసరి అని.. ఈ గడువును పొడిగేంచేది లేదని బీఐఎస్ ఛైర్మన్ ప్రమోద్ కుమార్ తివారీ స్పష్టం చేశారు.
వాహనాలు మరింత ఖరీదు..
ఏప్రిల్ 1 నుంచి కఠిన ఉద్గార నిబంధనలు అమల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు వాహన తయారీ సంస్థలు ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ జాబితాలో మారుతీ, హీరోమోటోకార్ప్ సహా పలు కంపెనీలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్