ChatGPT: చాట్‌జీపీటీ నుంచి బిగ్ అప్‌డేట్‌.. ఇక రియల్‌టైమ్‌ సమాచారం

Realtime Info in chatGPT: ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీలో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇకపై రియల్‌టైమ్‌ సమాచారాన్ని యూజర్లు తెలుసుకోవచ్చు.

Published : 28 Sep 2023 17:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (chatGPT) యూజర్లకు గుడ్‌న్యూస్‌. చాట్‌జీపీటీలో ఎప్పటి నుంచో కోరుకుంటున్న కీలక అప్‌డేట్‌ను ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు 2021 సెప్టెంబర్‌ వరకు ఉన్న సమాచారాన్ని ఇన్నాళ్లు ఇచ్చింది. ఇకపై రియల్‌టైమ్‌ సమాచారాన్ని అందించే విధంగా కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. ప్రస్తుతానికి చాట్‌జీపీటీ ప్లస్‌, చాట్‌జీపీటీ ఎంటర్‌ ప్రైజెస్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలో నాన్‌ సబ్‌స్క్రైబర్లకూ ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నట్లు  ఓపెన్‌ఏఐ ప్రకటించింది.

ప్రస్తుతం చాట్‌జీపీటీలో ఏదైనా సమాచారం అడిగితే.. 2021 సెప్టెంబర్‌ వరకు ఉన్న సమాచారాన్నే అందిస్తూ వస్తోంది. ఉదాహరణకు 2022లో ఏదైనా జరిగితే దానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదని చెప్తుంది. ఇకపై రియల్‌టైమ్‌ సమాచారాన్నే అందిచనుంది. మనం ఏదైనా అడిగితే ఇంటర్నెట్‌లో శోధించి ఆ సమాచారాన్ని మన ముందుంచుతుంది. ప్రస్తుతం గూగుల్‌ బార్డ్‌, మైక్రోసాఫ్ట్‌ బింగ్‌ తదితర ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ రియల్‌టైమ్‌ సమాచారాన్నే యూజర్లకు అందిస్తున్నాయి. తాజాగా చాట్‌జీపీటీ ఆ జాబితాలో చేరింది. అయితే, ఆయా చాట్‌బాట్‌లు కొన్నిసార్లు తప్పుడు సమాచారం కూడా అందిస్తున్నాయని సాంకేతిక నిపుణులు చెప్తున్నారు.

అమెజాన్‌ సేల్‌ తేదీలూ వచ్చేశాయ్‌.. కొన్ని ఫోన్లపై అప్పుడే డీల్స్‌!

మరోవైపు చాట్‌జీపీటీలో ఇన్నాళ్లు కేవలం టెక్ట్స్‌, వాయిస్‌ రూపంలో ప్రశ్నలడిగేందుకు అవకాశం ఉంది. అలా అడిగే ప్రశ్నలకు టెక్స్ట్‌ రూపంలోనే సమాధానం ఇస్తోంది. తాజాగా వాయిస్‌, ఇమేజ్‌ క్యాపబిలిటీస్‌ను తీసుకొచ్చింది. అంటే చాట్‌జీపీటీతో నేరుగా యూజర్లు సంభాషణ జరపొచ్చు. అలాగే ఏదైనా ఇమేజ్‌ అప్‌లోడ్‌ చేసి సంబంధిత అంశంపై సలహా అడిగినా చాట్‌జీపీటీ సమాధానం ఇస్తుంది. ఈ సదుపాయాన్ని చాట్‌జీపీటీ ప్లస్‌, ఎంటర్‌ ప్రైజెస్‌ సబ్‌స్క్రైబర్ల కోసం తీసుకొచ్చింది. వాయిస్‌ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐఫోన్లలో, ఇమేజ్‌ ఫీచర్‌ అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓపెన్‌ ఏఐ తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని