Moonlighting: అసలేమిటీ మూన్‌లైటింగ్‌.. ఐటీ కంపెనీలకు కలవరమెందుకు..?

తాజాగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తమ ఉద్యోగులు మూన్‌లైటింగ్‌ చేయకూడదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కొన్నాళ్ల క్రితం విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ కూడా ఇటువంటి

Published : 13 Sep 2022 19:34 IST

ఇన్ఫోసిస్‌ హెచ్చరికల నేపథ్యంలో మరో సారి చర్చలోకి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

తాజాగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తమ ఉద్యోగులు ‘మూన్‌లైటింగ్‌’ చేయకూడదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కొన్నాళ్ల క్రితం విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. మరోవైపు యూనికార్న్‌ స్టార్టప్‌ స్విగ్గీ మాత్రం తమ ఉద్యోగులకు మూన్‌లైటింగ్‌ చేసే అవకాశం ఇటీవలే కల్పించింది. ముఖ్యంగా వైట్‌కాలర్‌ ఉద్యోగాల్లో ఈ విధానం పెరుగుతోంది. దేశీయ కంపెనీలు మూన్‌లైటింగ్‌పై విభిన్నమైన వైఖరులతో ఉన్నాయన్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది. సంప్రదాయ టెక్‌ కంపెనీలు.. నూతనతరం కంపెనీల మధ్య ఉన్న భిన్నవైఖరిని కూడా ఇది ప్రతిబింబిస్తోంది. ఇంతకీ ఏమిటీ మూన్‌లైటింగ్‌..? ఇది నైతికమేనా..? భారత్‌లో దీనికి చట్టబద్ధత ఎంత..?

అసలు ఏమిటిది..?

ఒక వ్యక్తి సాధారణ ఉద్యోగ సమయం తర్వాత మిగిలిన వేళలో రెండో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్‌ అంటారు.  ఉదాహరణకు.. ఓ ఉద్యోగి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తాడు. అదే అతడి ప్రాథమిక ఆదాయ వనరు. అదనపు నగదు కోసం అతడు రాత్రివేళల్లో లేదా వారాంతాల్లో మరో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్‌ అంటారు. ఇది సాధారణంగా ఆయా కంపెనీల పాలసీలపై ఆధారపడి ఉంటుంది. జులైలో ఓ సంస్థ వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తున్న 400 మంది ఐటీ ఉద్యోగలపై సర్వే నిర్వహించగా.. వారిలో 65శాతం మందికి రెండో ఉద్యోగం గురించి తెలుసని చెప్పారు. చాలా మంది వర్క్‌ఫ్రమ్‌ హోం వదిలి తిరిగి ఆఫీస్‌లకు రాకపోవడం వెనుక మూన్‌లైటింగ్‌ కూడా ఓ కారణమనే అంచనాలు ఉన్నాయి. 

భారత్‌లో తొలిసారి ఎప్పుడు బయటపడింది..?

గత రెండేళ్లుగా మూన్‌లైటింగ్‌ ఐటీ సంస్థలకు సమస్యగా మారింది. రెండో ఉద్యోగం చేసే ప్రతిభావంతుడైన  వ్యక్తి నుంచి ఉత్పాదకత తగ్గడం వంటివి సమస్యలను ఇవి ఎదుర్కొంటున్నాయి.

* బెంగళూరులో ఓ వ్యక్తి ఏడు సంస్థలకు పనిచేస్తున్నట్లు కొన్నాళ్ల కిందట బయటపడింది. అతడికి ఉన్న పలు పీఎఫ్‌ ఖాతాల ఆధారంగా గుర్తించారు. 

* ముంబయిలోని ఓ ప్రముఖ కంపెనీ ఐటీ హెడ్‌ ఆఫీస్‌లో విధులకు హాజరయ్యేందుకు నిరాకరించారు. చివరికి అతడి మెయిల్‌పై ఫోరెన్సిక్‌ దర్యాప్తు నిర్వహించగా.. పెద్ద ఎత్తున డేటాను మరో కంపెనీకి పంపిస్తున్నట్లు తేలింది. ఇక్కడ ఉద్యోగం మానేయకుండానే.. మరో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు.

నైతికంగా సరైనదేనా..?

మూన్‌లైటింగ్‌ నైతికతపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. మరోవైపు ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ మోహన్‌దాస్‌ పాయ్‌ సమర్థించారు. ఉద్యోగమనేది యజమాని-ఉద్యోగి మధ్య ప్రతిరోజు కొన్ని గంటల కాంట్రాక్టుగా ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత ఉద్యోగి ఇష్టమని పేర్కొన్నారు. మానవవనరుల విభాగ న్యాయ నిపుణులు మాత్రం భిన్నంగా చెబుతున్నారు. ఫుల్‌టైం ఉద్యోగం ఇచ్చిన సంస్థ.. తన ఉద్యోగి రెండో ఉద్యోగం చేయకుండా కట్టడి చేయవచ్చని చెబుతున్నారు. ఒకేరకమైన రెండు ఉద్యోగాలు చేస్తే.. ఒక చోట రహస్యాలు మరో చోటకు చేరే అవకాశం ఉన్న సందర్భాల్లో ఇది మోసం కిందకు కూడా వస్తుంది. ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్‌ 60 ప్రకారం రెండు ఉద్యోగాలు చేయడాన్ని భారత్‌లో నిషేధించారు. కానీ, ఈ నిబంధన నుంచి ఐటీ సంస్థలకు మినహాయింపు ఇచ్చారు. ఓ వ్యక్తి బహుళ ఉద్యోగాలు చేసే సమయంలో సంస్థ కాంట్రాక్టు పత్రాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం ప్రకారం కూడా బహుళ ఉద్యోగాలు చేయడంపై నిషేధం ఉంది. ఈ చట్టాల పరిధిలోని వారు బహుళ ఉద్యోగాలు చేస్తూ పట్టుబడితే కొలువు కోల్పోవాల్సిందే.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని