Demat: డీమ్యాట్‌ ఖాతాకు నామినీ జతచేశారా? డెడ్‌లైన్‌ ముగుస్తోంది

Demat: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి చేసేందుకు డీమ్యాట్‌ ఖాతాలు తెరిచేవారిలో చాలామంది నామినీని ఎంచుకోవటం మరచిపోతుంటారు. మీరు కూడా ఇలా మరచిపోతే ఈ డెడ్‌లైన్‌ ముగిసేలోగా నామినీ వివరాలు జత చేసేయండి.

Published : 16 Sep 2023 18:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా? మరి మీ డీమ్యాట్‌ (Demat) ఖాతాకు నామినీని ఎంచుకున్నారా? లేనట్లయితే ఈ నెలాఖరులోగా (సెప్టెంబరు 30) ఆ పనిని పూర్తిచేయండి. లేకపోతే మీ ఖాతాలు స్తంభించిపోతాయి. చాలామంది డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించినప్పుడు, మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసే సమయంలో నామినీ పేరును పేర్కొనరు. పెట్టుబడి పెట్టిన వ్యక్తికి ఏమైనా అనుకోనిది జరిగితే ఖాతాలో ఉన్న పెట్టుబడులు, ఫండ్‌ యూనిట్లను వారసులు క్లెయిం చేసుకోవడం కష్టమవుతోంది. ఇటువంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు నామినీ వివరాలను జతచేయటం తప్పనిసరిచేస్తూ సెబీ సర్క్యులర్‌ జారీ చేసింది. డీమ్యాట్‌ ఖాతా ఉన్నవారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నామినీని ఎంచుకోవాల్సిందే అని పేర్కొంది.

2023 మార్చి 31తో ముగియనున్న గడువును 2023 సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ సెబీ (SEBI) నిర్ణయం తీసుకుంది. అయితే నామినీ వివరాలను అందించాల్సిన సెక్షన్లలో రెండు ఆప్షన్లు సెబీ తీసుకొచ్చింది. ఒకటోది నామినీ వివరాలు నమోదు ఎంపిక చేసుకునే ఆప్షన్‌ కాగా.. నామినీని ఎంచుకోవడం లేదనేది రెండో ఆప్షన్‌. ఇందులో ఖాతాదారులకు కావల్సిన ఆప్షన్‌ను ఎంచుకొనే వెసులుబాటు ఉంది. రెండింట్లో ఏదో ఒక దాన్ని మాత్రం కచ్చితంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణంచేత నామినీ ఎంపికలను మరచిపోతే ఖాతాలు స్తంభించిపోతాయి.

మీకు నచ్చినట్లుగా ఎమోజీ.. ఒక్క క్లిక్‌తోనే క్రియేట్‌ చేసుకోండిలా..

వీటిని గుర్తుంచుకోండి

  • సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఎలా డీమ్యాట్ ఖాతా తెరిచినా నామినీ వివరాలు జత చేయవచ్చు.
  • కేవలం వ్యక్తులను మాత్రమే నామినీలుగా ఎంచుకోవడానికి వీలుంది. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, తోబుట్టువులు ఇలా ఎవరినైనా నామినీగా నియమించవచ్చు. సొసైటీ, ట్రస్ట్‌, బాడీ కార్పొరేట్‌, భాగస్వామ్య సంస్థ, హిందూ అవిభాజ్య కుటుంబం (Hindu Undivided Family)లోని వ్యక్తుల్ని నామినీగా ఎంపిక చేయరాదు.
  • గరిష్ఠంగా ముగ్గురు నామినీలను ఎంచుకోవచ్చు. ఇలా ఎంచుకొనే సమయంలో వారిలో ఒకొక్కరికి ఎంత మొత్తంలో షేర్లు చెందాలో కూడా అందులోనే పొందుపరచవచ్చు.

ఎలా నమోదు చేయాలంటే..

  • ఎన్‌ఎస్‌డీఎల్‌ పోర్టల్‌లోకి వెళ్లాలి.
  • DP ID, Client ID, PAN నంబర్‌ ఎంటర్‌ చేయగానే రిజిస్టర్‌ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాని సాయంతో లాగిన్‌ అవ్వాలి.
  • ఇక్కడ నామినీ ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  • ఆధార్ ఉపయోగించి ఇ-సైన్ చేయాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని