Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌లో తయారీ నిలిపివేత?

ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సమాచారం...

Updated : 29 Jul 2022 15:18 IST

చెన్నై: ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సమాచారం. దాదాపు వారంరోజుల నుంచి తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో ఉన్న తయారీ కేంద్రంలో కార్యకలాపాలు నిలిచిపోయాయని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు ఓ ప్రముఖ వాణిజ్య పత్రిక పేర్కొంది. అయితే, ఏటా నిర్వహించే మెయింటనెన్స్‌లో భాగంగానే తయారీని తాత్కాలికంగా నిలిపివేశామని కంపెనీ చెబుతోంది. కానీ, దీనికి అసలు కారణం మరొకటి ఉందని కంపెనీకి చెందిన ఉద్యోగులు తెలిపినట్లు ‘ది ఎకనమిక్‌ టైమ్స్‌’ పేర్కొంది.

దాదాపు 4,000 యూనిట్ల స్కూటర్లు తయారీ ప్లాంట్‌లో పేరుకుపోయాయని సమాచారం. బుక్‌ చేసుకున్నవారి కోసం అందించాల్సిన వేలాది స్కూటర్లకు ఇవి అదనమని తెలుస్తోంది. తయారీ కేంద్రం రోజువారీ సామర్థ్యం 600 యూనిట్లు. ఫ్యూచర్‌ ఫ్యాక్టరీగా పిలిచే ఈ తయారీ కేంద్రంలో గత అక్టోబర్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. దాదాపు 1.50 లక్షల బుకింగ్స్‌ అందాయి. కానీ, తర్వాత స్కూటర్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు తెరపైకి రావడంతో చాలా మంది బుకింగ్స్‌ను రద్దు చేసుకున్నారు. ఓలా డిసెంబరు నుంచి స్కూటర్లను వినియోగదారులకు అందించడం ప్రారంభించింది. కొన్ని నెలల్లోనే స్కూటర్‌లో మంటలు చెలరేగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్కూటర్‌ నాణ్యతపై అనేక సందేహాలు తలెత్తాయి.

ఈ వ్యవహారంపై కంపెనీ వర్గాలు స్పందిస్తూ.. అన్ని కంపెనీల తరహాలోనే వార్షిక నిర్వహణలో భాగంగానే తయారీని తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపాయి. ఇది ఏ రకంగానూ ఉత్పత్తిని నిలిపివేసినట్లు భావించొద్దని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని