Car Insurance: కారు ఆకృతి ఆధారంగా బీమా ప్రీమియం మారుతుందా?

Car Insurance: కారును కొనుగోలు చేసేటప్పుడే కారు బీమా ప్రీమియంను పరిగణనలోకి తీసుకోవాలి. సరైన కారు బీమా పాలసీని పొందడానికి IDVని సరిగ్గా అంచనా వేయాలి. IDVని కారు రకాన్ని బట్టి నిర్ణయిస్తారు.

Updated : 27 Feb 2023 13:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాహనాలపై వెళ్తున్న సమయంలో జరిగే ఊహించని ప్రమాదాల నుంచి బీమా (Vehicle Insurance) ఎంతో రక్షణగా ఉంటుంది. బండికైనా లేదా మనకైనా జరిగే నష్టం చాలా ఖరీదుతో కూడిన వ్యవహారం. అలాంటి కష్ట సమయాల్లో ఆర్థికంగా చితికిపోకుండా బీమా (Insurance) అండగా ఉంటుంది. అందుకే వాహన బీమా (Vehicle Insurance) తప్పనిసరి. కారు విషయానికి వస్తే బీమా (Car Insurance) ప్రీమియం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కారు రకం, ఇంజిన్‌, పరిమాణం, ఉపయోగం.. వీటి ఆధారంగానే కంపెనీలు కారు బీమా ప్రీమియంను నిర్ధారిస్తాయి.

ఐడీవీ ఆధారంగానే ప్రీమియం..

‘ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్‌ వాల్యూ (IDV)’ నిర్ధారించడానికి బీమా జారీ సంస్థలు ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకునే అంశం కారు రకం. కారు బీమాను పొడిగించే సమయంలోనే కంపెనీలు దీన్ని నిర్ధారిస్తాయి. మార్కెట్‌ విలువ ఆధారంగా ఐడీవీని నిర్ణయించి ప్రీమియంను లెక్కిస్తారు. ఐడీవీ కారు రకంపై ఆధారపడుతుంది. కారు రకాన్ని ఇంజిన్‌ సామర్థ్యం ఆధారంగా నిర్ణయిస్తారు.

సులభంగా చెప్పాలంటే IDV అనేది కారు బీమా పాలసీలో ఇచ్చే హామీ మొత్తంగా అర్థం చేసుకోవచ్చు. వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బీమా క్లెయిం చేసుకోవాలంటే ఈ ఐడీవీనే పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని రెఫరెన్స్‌గా తీసుకుని.. సంస్థలు బీమా సొమ్మును అందజేస్తాయి.

కార్లలో వర్గీకరణ..

కార్లను బాడీ స్టైల్‌, సెగ్మెంట్‌, ఇంధన రకం, పరిమాణం, ఉపయోగం.. వీటి ఆధారంగా వివిధ రకాలుగా వర్గీకరించారు. 

  • బాడీ స్టైల్‌: హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్‌, క్రాస్‌ఓవర్‌, వ్యాన్స్‌, కన్వర్టబుల్స్‌
  • కారు సెగ్మెంట్‌: లగ్జరీ, స్పోర్ట్స్‌, యుటిలిటీ
  • ఇంధనం: డీజిల్‌, పెట్రోల్‌, సీఎన్‌జీ, హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌
  • పరిమాణం: మైక్రో, కాంపాక్ట్‌, సబ్‌- కాంపాక్ట్‌, మిడ్‌-సైజ్‌, ఫుల్‌ సైజ్‌
  • ఉపయోగం: వాణిజ్యం, వ్యక్తిగతం, స్పోర్ట్స్‌, లగ్జరీ

ఇలా కార్ల వర్గీకరణ ఆధారంగా ఐడీవీని తద్వారా ప్రీమియంను నిర్ణయిస్తారు. మరోవైపు కార్ల వర్గీకరణను థర్డ్‌ పార్టీ బీమా జారీ సంస్థలు ఒకలాగా.. ఓన్‌ డ్యామేజ్‌ బీమా జారీ కంపెనీలు మరోలాగా పరిగణనలోకి తీసుకుంటాయి.

థర్డ్‌ పార్టీ బీమాలో..

థర్డ్-పార్టీ బీమా అనేది చట్టబద్ధంగా తప్పనిసరి. ప్రమాదానికి గురైనప్పుడు అవతలి పక్షానికి జరిగిన నష్టాన్ని, ఖర్చులను భర్తీ చేయడానికి ఇది ఉండాల్సిందే. ‘మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్’ ప్రకారం.. ప్రమాదం జరిగినప్పుడు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా బాధితుడికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

ఇంజిన్ పరిమాణం ఆధారంగా, థర్డ్-పార్టీ బీమా పాలసీ ప్రీమియంను మూడు రకాలుగా విభజిస్తారు. మోడల్ నంబర్, గత క్లెయిమ్‌లు మొదలైన ఇతర అంశాల ఆధారంగానూ ప్రీమియం మారుతుంది.

ఇంజిన్‌ సామర్థ్యం- ప్రీమియం

  • 1000 సీసీ కంటే తక్కువ-  తక్కువ ప్రీమియం
  • 1000 సీసీ కంటే ఎక్కువ..1500 సీసీ కంటే తక్కువ-  మోతాదు ప్రీమియం
  • 1500 సీసీ కంటే ఎక్కువ-  ఎక్కువ ప్రీమియం

ఓన్‌ డ్యామేజ్‌ పాలసీలోనైతే..

ఇంతకు ముందే చెప్పినట్లు బీమా ప్రీమియంను అనేక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. అందులో కారు రకం ప్రధానమైనది. నిజానికి ఊహించని ప్రమాదాల నుంచి కారు మనల్ని ఎంత వరకు రక్షిస్తుందో దాని బాడీయే సూచిస్తుంది.

హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్?

అధిక విక్రయాలు, చిన్న పరిమాణం కారణంగా హ్యాచ్‌బ్యాక్‌లపై బీమా ప్రీమియం ఇతర వాటితో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. సెడాన్‌ల బీమా ప్రీమియం మాత్రం హ్యాచ్‌బ్యాక్ కంటే ఎక్కువ. అయితే, తిరిగి ఈ సెడాన్‌లు ఏ విభాగంలోకి వస్తాయనే దానిపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది.

హై-ఎండ్ హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్లు..

సాధారణ హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్‌లతో పోలిస్తే హైఎండ్‌ కార్లపై ప్రీమియం అధికంగా ఉంటుంది. దీనికి అధిక ఆన్‌-రోడ్‌ ధరే కారణం.

యుటిలిటీ వాహనాలు..

ఇష్టం వచ్చినట్లుగా వాడేందుకు వీలుగా యుటిలిటీ వాహనాలను రూపొందిస్తారు. పైగా వీటిని ఆఫ్‌-రోడ్‌ డ్రైవింగ్‌లో కూడా ఉపయోగించొచ్చు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువే. దీంతో బీమా ప్రీమియం కూడా అధికంగానే ఉంటుంది.

స్పోర్ట్స్‌ కార్లు..

స్పోర్ట్స్‌ ఎస్‌యూవీలు, లగ్జరీ ఎస్‌యూవీలు, స్పోర్ట్స్‌ సెడాన్‌లు, సూపర్‌ కార్లపై ప్రీమియం అధికంగా ఉంటుంది. చాలా వేగంగా వెళ్లేందుకు వీలుగా వీటి నిర్మాణం ఉంటుంది. ఈ క్రమంలో చాలా ఖరీదైన విడి భాగాలు, టెక్నాలజీని పొందుపరుస్తారు. ఈ నేపథ్యంలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఏ ఏమాత్రం ప్రమాదం జరిగినా.. ఆ నష్టాన్ని పూడ్చుకోవడం ఖరీదైన వ్యవహారం. ఈ నేపథ్యంలో వీటి ఇన్సూరెన్స్‌ను ఎప్పటికప్పుడు రిన్యూవల్‌ చేయిస్తూ ఉండాలి.

లగ్జరీ కార్లు..

లగ్జరీ కార్ల బీమా ప్రీమియం లెక్కింపు భిన్నంగా ఉంటుంది. సాధారణంగా వీటి ప్రీమియం చాలా ఎక్కువగానే ఉంటుంది. వాటిలో ఉండే సౌకర్యాలు, అదనపు వసతులు, టెక్నాలజీ, ధర.. వీటన్నింటి ఆధారంగా కారు బీమా ప్రీమియం ఆధారపడి ఉంటుంది.

కారును కొనుగోలు చేసేటప్పుడే కారు బీమా ప్రీమియంను పరిగణనలోకి తీసుకోవాలి. సరైన కారు బీమా పాలసీని పొందడానికి IDVని సరిగ్గా అంచనా వేయాలి. IDVని కారు రకాన్ని బట్టి నిర్ణయిస్తారు. కారు ఇన్సూరెన్స్‌ తీసుకోవడం భారంగా భావించొద్దు. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని